విధాత: శ్రీరాముడికి నమ్మిన బంటు ఆంజనేయస్వామి, అలాంటి ఆంజనేయుడు స్వయంభుగా వెలసిన ప్రాంతం జగిత్యాల జిల్లా కొండగట్టు. సహజమైన కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నమ్మినబంటైన ఎంపీ సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సీఎం నిర్ణయానికి మద్దతుగా, కోట్లాది మంది ఆంజనేయ భక్తులకు బాసటగా కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉండే వెయ్యి ఎకరాల అభయారణ్యం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున దత్తత తీసుకోవాలని సంతోష్ కుమార్ నిర్ణయించారు. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తన నిర్ణయాన్ని ఎంపీ ప్రకటించారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీయార్, స్వరాష్ట్రం సిద్దించాక గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారని, ఆయన తపనను అతి దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. ఆంజనేయుడి ప్రధాన లక్షణాలైన పరాక్రమం, విశ్వాసం కేసీయార్ సొంతమని, అభివృద్ది నిర్ణయాల్లో పరాక్రమం, తెలంగాణ పట్ల ఆయన విశ్వాసం వెలకట్టలేనివని ఎంపీ అన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్దితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని, కాళేశ్వరం కట్టినా, యాదాద్రి పునర్ నిర్మాణం చేసినా, ఇప్పుడు కోటి మొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ది నిర్ణయమైనా కేసీయార్ దార్శనికతకు నిదర్శనమని అన్నారు.
చంద్రుడికో నూలు పోగు లాగా ఆయన వెన్నంటి, మద్దతుగా నిలవటం తనకు లభించిన వరంగా భావిస్తూ, ముఖ్యమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకుని అంజన్న సన్నిధి వెన్నంటి ఉండే వెయ్యి ఎకరాలకు పైగా అభయారణ్యాన్ని దత్తత తీసుకుంటున్నానని సంతోష్ తెలిపారు.
కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్టెమెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటారు. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని ఎంపీ ప్రకటించారు.
దశల వారీగా మిగతా నిధులు కూడా అందించి లక్షిత పనులు పూర్తి చేస్తామని ఎంపీ తెలిపారు.
చిన్నతనం నుంచే కేసీయార్ వెంట ఉన్న తనకు కొండగట్టుతో బలమైన అనుబంధం ఉన్నదని, అనేక సార్లు ఆంజనేయుడిని దర్శించుకుని ఈ అటవీ ప్రాంతంలో సేదతీరిన అనుభూతులు ఉన్నాయని ఎంపీ అన్నారు.
ఐదు వందల ఏళ్లకు ముందే అస్థిత్వంలోకి వచ్చిన కొండగట్టు ఆలయంలో ఈ అడవిలో లభించే సుగంధ మొక్కలు, చందనం చెట్ల నుంచే పూజలు జరిగేవని ప్రతీతి. మళ్లీ ఆ వైభవం కోసం ఈ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు నాటుతామన్నారు.
అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ చర్యలతో పాటు, అడవి లోపల పునరుజ్జీవన చర్యలు చేపడతామన్నారు. సహజ అడవి పునరుద్దరణకు చెక్ డ్యామ్ ల నిర్మాణంతో పాటు, నేలలో తేమ పరిరక్షణ చర్యలు చేపడతామన్నారు.
As the Honble CM Sri KCR garu announced renovation of #Kondagattu temple with 600 Crores, I thought, it will be fitting to adopt 1095 acres of Kodimyal Reserve Forest as part of #GreenIndiaChallenge. Will do the honours on the occasion of the legend’s birthday tomorrow. pic.twitter.com/zVoccyyDwm
— Santosh Kumar J (@MPsantoshtrs) February 16, 2023
ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు, పచ్చని ప్రకృతి మధ్య కాసేపు సేద తీరేలా పరిసరాలను తీర్చిదిద్దుతాని, మట్టితో వాకింగ్ ట్రాక్ తో పాటు, పగోడాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఏ లక్ష్యంతోనైతే ముఖ్యమంత్రి కొండగట్టు పునర్ నిర్మాణం చేపడుతున్నారో, దానికి మద్దతుగా తమ వంతు ప్రయత్నం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఉంటుందని సంతోష్ కుమార్ ప్రకటించారు.