Revanth Reddy | పర్యావరణానికి సమాధి కట్టిన CM KCR .. రూ.100 కోట్ల భూమిని రూ.17 కోట్లకే కాజేసిండు: రేవంత్‌రెడ్డి

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ అడ్డగోలు నిర్మాణాలకు అనుమతి రూ.100 కోట్ల భూమిని రూ.17 కోట్లకే కాజేసిన కేసీఆర్‌ బెదిరించి భూములు రాయించుకున్నాడనడానికి ఇదే నిదర్శనం కేసీఆర్‌ విధ్వంసాన్ని రేపు ఉదయం11 గంటలకు మీడియాకు ప్రత్యక్షంగా చూపిస్తా మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విధాత: అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ గ్రేటర్‌లో పర్యావరణానికి సీఎం కేసీఆర్‌ సమాధి కడుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గత 60 ఏళ్లలో ఎప్పుడూ జరగని విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్‌ఎస్‌ హయాంలో […]

  • Publish Date - April 12, 2023 / 02:03 PM IST
  • కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ అడ్డగోలు నిర్మాణాలకు అనుమతి
  • రూ.100 కోట్ల భూమిని రూ.17 కోట్లకే కాజేసిన కేసీఆర్‌
  • బెదిరించి భూములు రాయించుకున్నాడనడానికి ఇదే నిదర్శనం
  • కేసీఆర్‌ విధ్వంసాన్ని రేపు ఉదయం11 గంటలకు మీడియాకు ప్రత్యక్షంగా చూపిస్తా
  • మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

విధాత: అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ గ్రేటర్‌లో పర్యావరణానికి సీఎం కేసీఆర్‌ సమాధి కడుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గత 60 ఏళ్లలో ఎప్పుడూ జరగని విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్‌ఎస్‌ హయాంలో విధ్వంసం జరిగిందన్నారు. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నైసర్గిక స్వరూపం నేపథ్యంలో అక్కడ ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్నారు.

ఈ మేరకు జూబ్లీహిల్స్ లో ఇళ్ల నిర్మాణానికి, వ్యాపార సంస్థలకు 5 అంతస్థులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కేబీఆర్ పార్క్ ను ఎకో టూరిజం, ఎకో సెన్సిటివ్ జోన్ గా పరిగణిస్తారని, అందుకే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కమర్షియల్ భవనాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.

కేబీఆర్‌ పార్క్‌కు ఎదురుగా ఉన్న నిజాం నవాబుల హెరిటేజ్‌ భవనాన్నికేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ సంస్థ కొనుగోలు చేసిందన్నారు. అక్కడ మొత్తం 7416 గజాలు ఉండగా, రోడ్డు వెడల్పులో కొంత స్థలం పోగా 6900 గజాలు మిగిలిందని, ఇందులో 1200 గజాలు గ్రీన్ బెల్ట్ కింద ఉందని తెలిపారు. ఇక మిగిలిన 5800 గజాల భూమిలో 60వేల చదరపు అడుగుల భవనం నిర్మించడానికి మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

అయితే ఈ భూమిలో నమస్తే తెలంగాణ దామోదర్ రావు 2704 గజాల భూమిని అప్పనంగా పొందారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ స్థలం తీసుకున్నందుకు నజరానాగా ఆ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చారన్నారు. వాస్తవంగా ఈ స్థలంలో 5 అంతస్థుల కంటే ఎక్కువ అనుమతి ఇవ్వవద్దని నిబంధనలు చెబుతున్నాయన్నారు.

కానీ భూమి రాసిచ్చాక కేఎస్‌ అండ్‌ సీఎస్‌ డెవలపర్స్‌ సంస్థకు 4 అంతస్తులు భూమిలోపల, 16 అంతస్తులు భూమి పైన కట్టుకునెలా అనుమతులు ఇచ్చారన్నారు. వాస్తవంగా నమస్తే తెలంగాణకు కేసీఆర్ యజమాని అని అన్నారు. భూమి రాసిచ్చాక నిబంధనలకు విరుద్ధంగా 4,78,825 చదరపు అడుగుల నిర్మాణాలు చేసేందుకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు.

కేవలం 3వేల గజాల్లోనే ఇలాంటి అనుమతులు ఇస్తే… కేబీఆర్ పార్కు జంక్షన్ లో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? అని అడిగారు. పర్యావరణ పరంగా పార్కు పరిస్ధితి ఏమిటి? అని రేవంత్‌ ప్రశ్నించారు. వాస్తవంగా పక్కనే 7 ఎకరాల్లో ఉన్న బసవతారకం ఆసుపత్రికి కూడా 3 అంతస్థులకు మించి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నా అప్పటి పాలకులు విధ్వంసం సృష్టించలేదన్నారు.

100 కోట్ల విలువైన 2704 గజాల భూమిని 17 కోట్లకే కేసీఆర్ తీసుకున్నారని ఆరోపించారు. దీనిని నిరూపించడానికి కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా.. 17 కోట్లు కాదు.. 40 కోట్లు ఇస్తే కేసీఆర్ ఆ భూమిని ఇవ్వగలడా? అని సవాల్‌ విసిరాడు. బెదిరించి భూములు రాయించుకున్నారనడానికి ఇది నిదర్శనం కాదా? అని రేవంత్‌ అడిగాడు.

దోపిడీ అనే పదం కూడా కేసీఆర్ దోపిడీ ముందు చిన్నది అవుతుందన్నారు. వాళ్ళ కోసం నిఘంటువులో కొత్త పదం సృష్టించాలన్నారు. కేసీఆర్ విధ్వంసాన్ని మీడియా సాక్షిగా నిరూపించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు ఆ భవనం వద్దకు తీసుకెళ్లి చూపిస్తానని రేవంత్‌ చెప్పారు.

తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమేనా? అని ప్రశ్నించారు. నిజాం కూడా ఇంత విధ్వంసం సృష్టించలేదన్నారు. కేసీఆర్ కుటుంబం స్వార్థానికి హైదరాబాద్ నగరాన్ని బలి చేస్తారా? అని అడిగారు. నేను చేసేవి రాజకీయ విమర్శలు కాదు.. నగర భవిష్యత్ కోసమే నా తపన అని అన్నారు. డీ9(దావూద్ 9) గ్యాంగ్ రాష్ట్రాన్ని కుప్ప చేస్తోందని, వీళ్లలో ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదని రేవంత్‌ అన్నారు.

ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ , సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, మల్‌రెడ్డి రాం రెడ్డి, మెట్టు సాయి కుమార్, గౌరీశంకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.