విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్‌లోకి వలసల గేట్లు ఓపెన్ చేశామని, ఇక బీఆరెస్ ఖాళీ కాక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొడుతామని కేసీఆర్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అంటున్నారని, వాళ్లు పడగొడుతామంటే మేం నిలబెట్టుకునే పని చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలను తమ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది మీడియా కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని భారాస, భాజపా నేతలు పదేపదే అంటున్నారు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా? కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని పెద్దలు చెప్పారు.. కొట్టకుండా ఊరుకుంటామా? మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఫిరాయింపులకు పాల్పడలేదు. ఈ రోజు నుంచే నేనూ రాజకీయం ప్రారంభించాను. మా పార్టీలోకి పొద్దున్నే ఒక గేటు తెరిచా.. మొత్తం ఇంకా తెరవలేదు. ఇవాళ ఒక ఎంపీ, ఎమ్మెల్యేకు గేటు ఓపెన్ చేశాం. ఇక బీఆరెస్ ఖాళీ కాబోతున్నది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటి నుంచి తన రాజకీయం ఏంటో బీఆర్ఎస్, బీజేపీలకు చూపిస్తా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వంద రోజులు సీఎంగా నిబద్ధతతో పనిచేశానని, ఎన్నికల నగరా మోగింది కాబట్టి పీసీసీ చీఫ్‌గా ఎన్నికల రూపం చూపిస్తానని చెప్పారు.
రాచరిక పోకడలను సహించని తెలంగాణ
తెలంగాణ సమాజం నిరంకుశ, రాచరికపు పోకడలను, బానిసత్వాన్ని సహించదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నిజాం నకలుగా నయా నిజాం మాదిరిగా పాలన సాగించిన కేసీఆర్‌ను ప్రజలు అందుకే గద్దె దించారని తేల్చిచెప్పారు. నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా నిరంకుశత్వ వైఖరి ఆనాడు ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైందని, కేసీఆర్ సైతం సచివాలయం, కాళేశ్వరం చూపి ప్రజల స్వేచ్ఛను హరించి, ఖాసి రజ్వీలా తెలంగాణలో తన అధిపత్యం, అణిచివేత విధానాలను అమలు చేశాడని ఆరోపించారు. 75 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రజలు నయా నిజాంపై పోరాడి కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి మళ్లీ స్వేచ్ఛను, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని చెప్పారు. వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించామన్నారు. 2023 డిసెంబర్ 3వ తేదీకి, తెలంగాణ విముక్తికి ఉన్నంత ప్రాముఖ్యం ఉందన్నారు. వంద రోజుల పరిపాలన తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఈ వంద రోజుల్లో ప్రతి నిమిషం ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేశామని, గత పాలన చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. ముందు ముందు ఇంకా బాధ్యతతో అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. వంద రోజుల పాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనట్టు భావించడం లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందన్న విశ్వాసం తెలంగాణ ప్రజలకు కల్పించినట్టు నమ్ముతున్నామన్నారు. తాము పాలకులం కాదు.. సేవకులం అని తెలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. కొద్దిమంది అధికారులతో సాగించిన పాలనకు స్వస్తి చెప్పామని, పరిపాలన వికేంద్రీకరణ చేసి పారదర్శక పాలన అందించే ప్రయత్నం చేశామన్నారు. ప్రగతి భవన్ ముళ్ల కంచెను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని, రాష్ట్ర పరిపాలనను నిర్దేశించే సచివాలయంలో అందరికీ ప్రవేశం కల్పించామని చెప్పారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకెళుతున్నామన్నారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ పథకాలను అమలు చేస్తున్నామని, 10లక్షల ఆరోగ్య బీమా అమలు, 200యూనిట్ల గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 8లక్షల కుటుంబాలు రూ.500 గ్యాస్ సిలిండర్ అందుకున్నాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించుకుని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల నిర్మాణం జరిపిస్తున్నామని చెప్పారు.
గంజాయి మొక్కలను ఏరేస్తున్నాం
గత ప్రభుత్వం తులసి వనంలో కొన్ని గంజాయి మొక్కలను నాటి వెళ్లిందని, అవి దుర్గంధం వెదజల్లుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రోజుకు 18 గంటలు పనిచేసి మొత్తం అలాంటి గంజాయి మొక్కల్ని ఒక్కొక్కటిగా పీకేస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. గత పాలకులకు రాజకీయ ప్రయోజనం కోసం, తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసే చిల్లర పనులతో విద్యుత్తు కోతలను, తాగు, సాగునీటి సమస్యలను సృష్టిస్తున్న అధికారులను గుర్తించి చర్యలు చేపడుతున్నామన్నారు. పేదలకు ఉచిత కరెంటు అందించే గృహజ్యోతి జీరో బిల్‌ను అమలు చేస్తుంటే కొందరు తెలివితేటలు ఉపయోగించి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వాళ్ల అడ్డు తొలగించి పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేసి తీరుతామన్నారు.
కేసీఆర్ గడీలో కవులు, కళాకారులు బందీ
ఇన్నాళ్లు కవులు, కళాకారులను కేసీఆర్ తన గడీలో బంధించారని, దొరగారి భుజకీర్తుల కోసం తెలంగాణ సాంస్కృతిక చరిత్రపై దాడి చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకే తమ ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకుందని చెప్పారు. బతుకమ్మను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారని అన్నారు. బతుకమ్మ, బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకొంటున్న పండుగలని, ఎవరు ఉన్నా లేకున్నా బతుకమ్మ, బోనాల పండుగలు జరుగుతాయని స్పష్టం చేశారు.
వైబ్రంట్ తెలంగాణనే మా లక్ష్యం
వైబ్రంట్ తెలంగాణనే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంపై రూ.9లక్షల కోట్ల అప్పుల భారం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లు అయితే, ఇప్పుడు ఏడాదికి రూ.64 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రతీ ఏడాది రూ.70 వేల కోట్లు అప్పుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. మేం అప్పుల గురించి మాట్లాడితే వాళ్లు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హరీశ్ ఇంటిపేరులో తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో, గవర్నర్‌తో సామరస్యపూర్వక విధానాలతో ముందుకెళుతున్నామని, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళుతున్నామని తెలిపారు. అందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందిస్తామన్నారు. సమస్యలు చెప్పుకుంటే వినడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. గత ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ సహా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందన్న రేవంత్‌రెడ్డి.. వాటి ఆదాయాలను పెంచి ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఎప్పటిమాదిరిగానే సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అన్యాక్రాంతమైన, కబ్జాలకు గురైన, ధరణితో స్వాహా అయిన భూముల రికవరికీ చర్యలు తీసుకుంటామన్నారు.
విచారణ కమిటీల నివేదికల మేరకే చర్యలు
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వేల కోట్లకు చేరిందని, వాటిపై చట్టబద్ధంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపైన, ఇతర సాగు తాగునీరు, విద్యుత్తు ప్రాజెక్టులపైన కమిటీలు విచారణ చేస్తున్నాయన్నారు. విచారణ కమిటీల నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించామని తెలిపారు. ధరణి పోర్టల్‌ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప అసలు విషయం బయటపడదని, ధరణి లోసుగుల నిగ్గు తేల్చి తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారికి మినహాయింపులు ఉండవని, చట్ట పరిధిలో విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి విచారణకు ఒక పద్ధతి ఉంటుందన్నారు.
కక్షసాధింపులకు పాల్పడం
రాజకీయ నాయకులపైన, అధికారులపైన వ్యక్తిగత కక్ష సాధింపులకు తాము పాల్పడబోమని రేవంత్‌రెడ్డి తెలిపారు. పరిపాలన సందర్భోచితంగానే శాఖపరమైన విచారణలుంటాయన్నారు. రైతుబంధు ప్రస్తుతం 5ఎకరాల మేరకు ఉన్న రైతులకు పడిందని చెప్పారు. రైతుబంధుపై కచ్చితంగా పరిమితులుంటాయని, గుట్టలు, రోడ్లకు, వెంచర్లకు రైతుబంధు ఇవ్వబోమని స్పష్టం చేశారు. టూరిజం, ఎండోమెంట్, ఎక్సైజ్, విద్యుత్తు పాలసీలపై పునస్సమీక్ష చేసి నూతన పాలసీలు చేస్తామన్నారు. మల్కాజిగిరి పరిధిలోని వక్ఫ్ భూముల వివాదం పరిష్కరించి బాధత ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించిన వివిధ మార్గాల్లో మెట్రో విస్తరణ పనులను చేపట్టామని వివరించారు. నగరం నాలుగువైపుల డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటుతో మూసీనది అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
కేంద్రంతో విచారణ జరిపించుకోవచ్చు
రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈటలకు తన ఆరోపణలపై చిత్తశుద్ధి ఉంటే వారి ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వంతో విచారణ జరిపించుకోవచ్చని స్పష్టం చేశారు. కేవలం చిల్లర మల్లర ఆరోపణలతో రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పట్ల తమకు గౌరవం ఉందని చెప్పారు. ఆయనకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బాధ్యత ఆఫర్ చేశామని, కానీ ఆయన ముందుకు రాలేదని వెల్లడించారు. ఆయన కేసీఆర్‌తో చేరుతాడని భావించడం లేదని, కేసీఆర్‌తో చేరితో అందుకు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ పాల్గొన్నారు.