ఏడాదంతా అబద్ధాలు చెప్పలేకనే.. మొదటి రోజునే నిజాలు చెప్పాం

ఏడాదంతా అబద్ధాలు చెప్పలేకనే వాస్తవ లెక్కల ఆధారంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో మొదటి రోజునే నిజాలు చెప్పామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు

  • By: Somu    latest    Feb 10, 2024 10:13 AM IST
ఏడాదంతా అబద్ధాలు చెప్పలేకనే.. మొదటి రోజునే నిజాలు చెప్పాం
  • ఓటాన్ అకౌంట బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి
  • సెక్రటెరియట్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణ అక్రమాలపై విచారణ
  • ఈ ఫార్ములా రేస్ నిర్వాహకులకు నోటీసులిచ్చాం
  • అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పరిస్థితిలా ఇరిగేషన్ శాఖ దుస్థితి


విధాత, హైదరాబాద్‌ : ఏడాదంతా అబద్ధాలు చెప్పలేకనే వాస్తవ లెక్కల ఆధారంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో మొదటి రోజునే నిజాలు చెప్పామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. గత బడ్జెట్ కంటే 70వేల కోట్లు…23శాతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తగ్గిందన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్లను అబద్ధాలతో నడిపించారని, మేము అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదని…మొదటి రోజే నిజం చెప్పాలి అనుకున్నామన్నారు. 10సంవత్సరాలైనా మాజీ సీఎం కేసీఆర్‌కు బడ్జెట్‌పై అంచనా వేయడం రాలేదని, మా ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క రెండు నెలల్లోనే దీనిపై అవగాహాన సాధించారన్నారు. వాస్తవాలకి అనుగుణంగా బడ్జెట్ ప్రిపేర్ చేసినందుకు భట్టికి అభినందనలన్నారు.


కేంద్రంతో వచ్చే నిధులు తప్పకుండా తెచ్చుకుంటామని, తద్వారా పథకాల అమలు మరింత మెరుగ్గా ముందుకు తీసుకెలుతామన్నారు. ఇరిగేషన్ శాఖ పరిస్థితి చూస్తే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పరిస్థితి మాదిరిగా ప్రభుత్వం పరిస్థితి ఉందన్నారు. ఈ శాఖలో ఏటా 16వేల కోట్లు అప్పులు కట్టాల్సివుందన్నారు. అక్కర లేకున్నా పిలిచిన టెండర్లు రద్దు చేస్తామన్నారు. ఇరిగేషన్ పై శ్వేత పత్రం పెడతామని, కాగ్ నివేదిక సైతం పెడతామన్నారు. 2లక్షల రైతురుణమాఫీ చేస్తామని, ఇందుకోసం బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయన్నారు. మహిళలకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. అమరవీరుల స్థూపం, అంబెడ్కర్ విగ్రహం, సెక్రటేరియట్‌ల నిర్మాణంలో అవినీతిపై విచారణకు అదేశిస్తున్నామన్నారు.


ఈ ఫార్ములా రేస్ అక్రమాలపై నిర్వాహకులకు ఇచ్చిన నోటీస్‌లకు రీప్లై వచ్చిందని, దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 13న తలపెట్టిన మేడిగడ్డ సందర్శనకు ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ సహా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలుస్తామన్నారు. వారికి సమయం లేకపోతే మరో తేదీన ఆ కార్యక్రమం పెడుతామన్నారు. ఒక రోజు ముందు వెనుక అయినా మేము సిద్ధంగా ఉన్నామని, కాళేశ్వరం టూర్ కు ప్రతిపక్ష నాయకుడుకి ఎప్పుడు టైం ఉందో చెప్పాలన్నారు. మాట్లాడుదామంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదన్నారు. మేడిగడ్డ పై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, తరువాత జుడిష్యల్ ఎంక్వయిరీలో దోషులు తెలుతారన్నారు. అప్పుడే చర్యలుంటాయన్నారు. ఇతర పార్టీ ఎమ్మేల్యేలు మా పార్టీలోకి వచ్చే అంశం నా దృష్టిలో లేదని, ఎవరైనా మా పాలన నచ్చి వచ్చేందుకు రెడీగా ఉంటే వారి విషయంలో మా పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.


20మంది బీఆరెస్ ఎమ్మెల్యేల చేరిక అంశం జగ్గారెడ్డినే అడుగాలన్నారు. ఎమ్మెల్సీలకు క్షమాపణ చెప్పే అంశం సభా అధికారులు చూసుకుంటారన్నారు. తెలంగాణ భాష ఇలాగే ఉంటుందన్నారు. 2014లో టీడీపీ బీఏసీ మెంబర్లుగా నన్ను, ఎర్రబెల్లిని పార్టీ నిర్ణయించిందని, కానీ హరీష్ రావు నన్ను బీఏసీకి రానివ్వలేదన్నారు. గత ప్రభుత్వ బాధితులను తప్పకుండా ఆదుకుంటామన్నారు. వ్యవసాయం చేసే రైతులకు, పంటలు సాగు చేసే భూములకే పెట్టుబడి సహాయం రైతు భరోసా అందిస్తామన్నారు. అనర్హులకు రైతుభరోసా ఇవ్వబోమన్నారు. గత ప్రభుత్వం గుట్టలు, రాళ్లకు, రహదారులకు సైతం రైతు బంధు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేసిందన్నారు. జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు..ప్రత్యేక హెల్త్‌కార్డులు అందిస్తామన్నారు.