పీవీ కీర్తి పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది: సీఎం రేవంత్‌ రెడ్డి

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

  • By: Somu    latest    Dec 23, 2023 12:22 PM IST
పీవీ కీర్తి పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది: సీఎం రేవంత్‌ రెడ్డి
  • గవర్నర్ తమిళి సైతో కలిసి పీవీకి నివాళులు


విధాత : మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వ‌ద్ద గవర్నర్ తమిళి సైతో కలిసి రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు.


“బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై పీవీ తన మాటల్లో తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని చెప్పిన సంగతిని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ నరసింహా రావు అని రేవంత్ రెడ్డి అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన పాలన వేత్త అని, పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారన్నారు.


పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.


ఢిల్లీలో పీవీకి డిప్యూటీ సీఎం భట్టి నివాళి

ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ లో జరిగిన దివంగత మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు 19వ వర్ధంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పీవీ తన ప్రతిభా, సామర్ధ్యాలతో దేశానికి ప్రధాని కావడంతో దేశ పరిపాలనను ఆర్ధిక సంస్కరణలతో కొత్త పుంతలు తొక్కించిన పరిపాలన దక్షుడు కొనియాడారు. తెలుగు వారి ఖ్యాతిని తన పాలనతో ప్రపంచానికి చాటరన్నారు. పీవీ పాలనతో దేశం అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కిందన్నారు. పీవీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రగతి కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ అధికారి ఐఏఎస్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.