రేవంత్ టార్గెట్‌ 26!

ఇప్పటికి ఒకటే గేటు ఓపెన్‌ చేశామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మిగిలిన గేట్లు కూడా తెరిచేందుకు సిద్ధమయ్యారా? ఈ విషయంలో పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ

  • Publish Date - March 19, 2024 / 02:43 PM IST
  • కాంగ్రెస్‌ పార్టీ గేట్లు మరిన్ని ఓపెన్‌?
  • సీఎం రేవంత్‌కు మేడం గ్రీన్‌ సిగ్నల్‌!
  • వలసలపై సోనియాతో సీఎం కీలక భేటీ
  • బీజేపీ వలకు చిక్కకుండా హస్తం గూటికి
  • బీఆరెస్‌ శాసనసభాపక్షంలో చీలిక..
  • తద్వారా కాంగ్రెస్‌ సర్కారుకు సుస్థిరత
  • డబుల్‌ యాక్షన్‌కు దిగుతున్న కాంగ్రెస్‌

విధాత: ఇప్పటికి ఒకటే గేటు ఓపెన్‌ చేశామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మిగిలిన గేట్లు కూడా తెరిచేందుకు సిద్ధమయ్యారా? ఈ విషయంలో పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ అనుమతి తీసుకున్నారా? అంటే.. అవుననే సమాధానమే వస్తున్నది. బీజేపీ, బీఆరెస్‌ నేతల బెదిరింపుల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునే పనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోకస్‌ పెంచారు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులోనూ మరిన్ని చేరికలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి రేవంత్‌కు ఉన్న ఏకైక మార్గం బీఆరెస్‌ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడమే. అయితే.. ఇందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ క్రమంలోనే గతంలో కేసీఆర్‌ అనుసరించిన ఫార్ములానే తాను కూడా అనుసరించేందుకు సిద్ధమయ్యారు. 26 మంది ఎమ్మెల్యేలను బీఆరెస్‌ నుంచి తనవైపు తిప్పుకొంటే.. ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదని, అందుకే నేరుగా కుంభ స్థలాన్ని కొట్టేందుకు రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయంలో పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ అనుమతి కూడా రేవంత్‌కు లభించినట్టు ఢిల్లీ కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి

వలసలపైనే ప్రత్యేక చర్చ

కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాల సందర్భంగా సోమ, మంగళవారాల్లో ఢిల్లీలోనే ఉన్న రేవంత్‌రెడ్డి.. సోనియాగాంధీతో భేటీయై పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అలాగే వంద రోజుల పాలన పురోగతిని, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. అక్కడే ఉన్న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతోనూ కొద్దిసేపు సమావేశమయ్యారు. ప్రత్యేకించి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై సోనియాతో ఈ రెండు రోజుల్లో రెండు దఫాలుగా గంటకుపైగా చర్చించినట్టు తెలుస్తున్నది. ఇందులో బీఆరెస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశంపైనే ఎక్కువగా కేంద్రీకరించారని సమాచారం. ఇప్పటికే బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలకు ఒక గేటు తెరిచామని, ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి చేరారని, మిగతా గేట్లు ఓపెన్ చేస్తే బీఆరెస్ ఖాళీ అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తామంటున్న ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంపై ఎలాంటి వైఖరి అనుసరించాలన్నదానిపై సోనియాగాంధీతో రేవంత్‌ చర్చించారని తెలుస్తున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో బీఆరెస్ బలహీపడుతుండగా, బీజేపీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఇప్పుడు ఆలస్యం చేస్తే బీఆరెస్ ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు లాక్కునే అవకాశముందని సోనియాకు వివరించారని తెలిసింది. చర్చల సందర్భంగా ఆమె బీఆరెస్‌ఎల్పీ చీలికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

26 మంది చేరేదాకా గేట్లు ఓపెన్!

ప్రస్తుతం బీఅరెస్ ఎమ్మెల్యేల నుంచి దానం నాగేందర్ ఒక్కరే కాంగ్రెస్‌లో చేరారు. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా బీఅరెస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. విడతల వారీగా బీఅరెస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేవరకు స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లను పెండింగ్‌లోనే పెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా చెబుతున్నారు. గతంలో బీఅరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సైతం ఇదే తరహాలో కాంగ్రెస్, టీడీపీ శాసనసభాపక్షాలను చీల్చారు. 2014లో 23 మందిని, 2018లో 16మందిని బీఆరెస్‌లో చేర్చుకున్నారు. ఇప్పుడు అదే వ్యూహంతో ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్లుగా బీఅరెస్‌ను దెబ్బ కొట్టేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. బీఅరెస్‌కు ప్రస్తుతం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 26 మంది కాంగ్రెస్‌లో చేరాక బీఆరెస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటారని తెలుస్తోంది. బీఆరెస్‌ ఎమ్మెల్యేల చేరికతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు కూడా పెరుగుతాయని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తున్నదని సమాచారం.