అధినేత జన్మదిన వేడుకల్లో ఎవరికి వారే.. నల్గొండ BRSలో ఆగని వర్గపోరు

విధాత: బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న వర్గ పోరుకు వేదికయ్యాయి. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న పార్టీ నాయకులు, టికెట్ అశావహులు కేసీఆర్ జన్మదిన వేడుకలను పోటాపోటిగా నిర్వహించడం విశేషం. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మంత్రి జగదీశ్ రెడిని ఆహ్వానించి జిల్లా పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి […]

  • Publish Date - February 17, 2023 / 11:30 AM IST

విధాత: బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న వర్గ పోరుకు వేదికయ్యాయి. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న పార్టీ నాయకులు, టికెట్ అశావహులు కేసీఆర్ జన్మదిన వేడుకలను పోటాపోటిగా నిర్వహించడం విశేషం. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మంత్రి జగదీశ్ రెడిని ఆహ్వానించి జిల్లా పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి తన నివాసం వద్ద తన వర్గీయులతో కలిసి భారీ ఎత్తున కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మరో నేత పిల్లి రామరాజు కూడ తన నివాసం వద్ద ఆర్కేఎస్ ఫౌండేషన్ తరపున కేసీఆర్ జన్మదిన వేడుకల్లో రక్తదానం నిర్వహించి కేక్ కట్ చేసి 500 మంది రజక కుటుంబాల మహిళలకు అందించ తలపెట్టిన ఎలక్ట్రికల్ ఐరన్ బాక్సుల పంపిణీకి శ్రీకారం చుట్టి తొలి దఫా 150మందికి అందించారు. విద్యార్థులకు భోజనం ప్లేట్లను గ్లాసులను పంపిణీ చేశారు. కానిస్టేబుల్ ఈవెంట్స్ కి ఎంపికైన 250 మందికి షూస్ పంపిణీ చేశారు.

నియోజకవర్గం పరిధిలోని 30 క్రికెట్ టీమ్ లకు క్రికెట్ కిట్లు 20 వాలీబాల్ టీమ్ లకు వాలీబాల్ కిట్లు అందించారు. అన్నదానం నిర్వహించారు. సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం బేతావోని చర్చిలో కేసీఆర్ వేడుకల్లో కేక్ కట్ చేసి దివ్యాంగులు వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి అందరికీ అన్నదానం చేశారు . గుత్తా అమిత్ రెడ్డి అనుచరులు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ భవన్ లో కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

నకిరేకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గాలు వేరువేరుగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించాయి. చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకల కోసం వీరేశం వర్గీయులు వేదిక ఏర్పాటు చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు.

చిరుమర్తి వర్గీయులు కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించుకుని వెళ్లాకే మీరు వేడుకలు జరుపుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో వీరేశం వర్గీయులు అలాగే వేడుకలు నిర్వహించారు. కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఒకవైపు, కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, వేనేపల్లి చందర్ రావు వర్గీయులు మరోవైపు కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఇదే రీతిలో నాగార్జునసాగర్ లో ఎమ్మెల్యే నోముల భగత్ ,ఒకవైపు ఎమ్మెల్సీ కోటిరెడ్డి మరోవైపు కేసీఆర్ జన్మదిన వేడుకల్లో సందడి చేశారు. భువనగిరి నియోజకవర్గంలో పైళ్ల శేఖర్ రెడ్డి వర్గీయులు, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి వర్గీయులు వేర్వేరుగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దేవరకొండ లో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, తుంగతుర్తి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆలేరులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలు, మునుగోడు లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. అయితే వేడుకల్లో పలువురు ఎస్సీ నాయకులు మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ చేసి 16 నెలలు కావస్తున్న భర్తీలో జాప్యం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.