నయా రాయ్‌పూర్ : మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)కు కొత్త డిప్యూటీ సీఎం నియామకం రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపింది. పార్టీలో అసమ్మతిని సద్దుమణిగించేందుకు సింగ్ దేవ్‌ను డిప్యూటీని చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అవన్నీ వట్టివేనని కొత్త డిప్యూటీ సీఎం కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, తాను కలిసికట్టుగా పని చేస్తున్నామని, భవిష్యత్తులోనూ అదే విధంగా పని చేస్తామని చెప్పారు.
టీఎస్ సింగ్‌దేవ్‌ను కొత్త డిప్యూటీ సీఎంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం నియమించారు. సంవత్సరాంతంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీలో అంతర్గత పోరును దారిలోకి తెచ్చేందుకు ఆయనను నియమించారని పలువురు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సింగ్‌దేవ్‌ను ముందుకు తెస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి.
అయితే సింగ్‌దేవ్ మాత్రం.. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి భూపేశ్ భగేలేనని స్పష్టం చేశారు. తనకు అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. ఇప్పటికైతే తనకు ప్రత్యేకంగా బాధ్యతలేవీ ఇవ్వలేదని చెప్పారు. రాబోయే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరో రెండేళ్లు పంచే ప్రతిపాదన ఉన్నదన్న అంశాన్ని కూడా సింగ్‌దేవ్ కొట్టిపారేశారు. అటువంటి ప్రతిపాదన ఏదీ తన వద్దకు చర్చకు రాలేదని తెలిపారు. అది కేవలం మీడియా సృష్టేనని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌కు రెండో ముఖ్యమంత్రి అనే అంశం 2021 మధ్యలోనే వచ్చింది. అప్పటికి పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో రెండున్నరేళ్లు సింగ్‌దేవ్‌ను సీఎం చేస్తారని భావించారు. దానికి తోడు తనను ప్రభుత్వంలో పక్కన పెడుతున్నారన్న సంకేతాలను గతేడాది సింగ్‌దేవ్ ఇచ్చారు. కాగా, సింగ్‌దేవ్ నియామకాన్ని ముఖ్యమంత్రి భగేల్ స్వాగతించారు. కొత్త డిప్యూటీకి ట్విట్టర్‌లో ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీని ఐక్యంగా ఉంచేందుకే సింగ్‌దేవ్ నియామకం జరిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు గట్టి సవాళ్లు ఉన్నాయి. వీటికి తోడు పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమైతే మొదటికే ముప్పు వస్తుందని భావించిన అధిష్ఠానం.. రెండు వర్గాలను బుజ్జగించేందుకే సింగ్‌దేవ్‌ను నియమించిందని అంటున్నారు.
అయితే.. ఇది అనుకూలిస్తుందా? లేక తిప్పి కొడుతుందా? అనేది రాబోయే రోజుల్లో చూడాలి. సింగ్‌దేవ్ హుందాతనం కలిగిన నాయకుడని, ఉత్తరాది ప్రాంతాల్లో గట్టి పట్టున్న నేత అని పేరుంది. సర్జుగా రాజ వంశానికి చెందిన సింగ్‌దేవ్.. ప్రస్తుతం రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు.