విధాత: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సైతం బీఆరెస్‌ను విజయాలకు దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటున్నది. గత ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఎలాంటి అక్రమాలు జరిగాయో వెలికి తీసే పని మొదలు పెట్టింది.
విజిలెన్స్ వర్గాలు ఆయా రంగాలపై దృష్టి కేంద్రీకరించాయి. వీటిని మరింత వేగవంతం చేసి, లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడక ముందే బీఆరెస్ నేతల అవినీతిని నిరూపించి, చర్యలు తీసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ అడుగులు వేస్తున్నదని సమాచారం. అదే సమయంలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని అమలు చేయడం ద్వారా ఒకవైపు తాను ఇచ్చిన హామీలు, మరోవైపు తాను ఆరోపించిన అంశాలను రుజువు చేయడం అనే డబుల్ బ్యారెల్ గన్‌తో లోక్‌సభ సమరానికి సన్నద్ధమవుతున్నది.
అవినీతిపై చర్యలు కోరుతున్న జనం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఇటీవల తన 50 రోజుల పాలనపై సర్వే చేయించారని సమాచారం. ఈ సర్వేలో పాలనకు మంచి మార్కులే వచ్చినప్పటికీ.. బీఆరెస్ నేతల అవనీతి సొమ్మును కక్కిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పటి వరకూ ఏ చర్యలూ తీసుకోలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో పార్లమెంటు ఎన్నికలకు ముందే ప్రజాభిప్రాయం మేరకు చర్యలు తీసుకోవాలన్న దృఢ నిశ్చయానికి రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసులు, వాటి విచారణలను వేగవంతం చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నది.
భారీగా కేసులు, జోరుగా విచారణలు
గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్టేషన్‌లో నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పీఎస్‌గా వ్యవహరించిన కల్యాణ్‌పై కేసు నమోదైంది. ఈ కేసును అవినీతి నిరోధక శాఖ టేకప్ చేసి విచారణ చేస్తోంది. ముందుగా కార్యాలయంలో ఫైళ్ల తరలింపుపైన నాంపల్లిలోనూ కేసు నమోదైంది. ఇలా పశు సంవర్థక మంత్రిత్వశాఖలో భారీ అవినీతి జరిగిందన్న సందేహాలు వెలువడ్డాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కాళేశ్వరంపై సీరియస్‌గా ముందుకు వెళ్లింది.
దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. శనివారం మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. విజిలెన్స్ నివేదికలో మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చి నట్లు విశ్వసనీయ సమాచారం. మరో వైపు హెచ్ఏండీలో గత ప్రభుత్వ పెద్దలకు అతి సన్నిహితంగా ఉన్న ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ ఏసీబీ అరెస్ట్ కీలక పరిణామంగా నిలిచింది. ఏసీబీ దాడుల్లో భారీగా అవినీతి సొమ్ము బయటపడిన విషయం అందరికీ తెలిసిందే.
దీనికి ముందు ఫార్ములా ఈ- రేస్‌కు ఎలాంటి ఆదేశాలు లేకుండా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ రూ. 55 కోట్లు ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసిన అంశంపై ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దానిపై అరవింద్ కుమార్ పొంతన లేని సమాధానం ఇవ్వడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఆ రూ.55 కోట్ల తిరిగి చెల్లించాలని ప్రభుత్వం అరవింద్ కుమార్‌కు తేల్చి చెప్పింది. తాజాగా భూ కబ్జా కేసులో జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
బీఆరెస్ సవాలుతోనే విచారణలు
ఇవికాకుండా లిస్టులో చాలా అంశాలే కనిపిస్తున్నాయి. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్‌పై విచారణకు ఆదేశించాలని ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు అంతర్గత విచారణ జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అసెంబ్లీలోనే విచారణకు ఆదేశించుకోమని బీఆరెస్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
దీనిని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ సర్కారు ఆదే దిశగా పయనిస్తోందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందుగానే తమ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని రద్దుచేస్తామని ప్రకటించింది. ధరణిని అడ్డం పెట్టుకొని బీఆరెస్ భూ దోపిడికీ పాల్పడిందని ఆరోపించిన కాంగ్రెస్ ఆ భూ కబ్జాల నిగ్గు తేల్చే పనిలో పడింది. ధరణిపై వేసిన కమిటీ ఆనాడు ధరణిలో జరిగిన అవకతవకలన్నింటినీ గుర్తిస్తోంది. ఈ కమిటీ వేగంగా సమావేశాలు నిర్వహిస్తోంది.
ఒకరిద్దరి అరెస్టుతో మొదలు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయిస్తున్న విచారణలన్నీ బీఆరెస్ ప్రభుత్వ పెద్దల వైపే వేలెత్తి చూపిస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధమైందని అంటున్నారు. ఈ మేరకు ఒకరిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నిలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం అవినీతి సొమ్మును కక్కించి జైలుకు పంపిస్తామని రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పారని, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆ చర్యలు చేపట్టక పోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, ఇది ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ కేసులో బీజేపీ అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం జరిగిందని, కానీ అరెస్ట్ చేయకపోవడంతో బీఆరెస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం బటపడి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పడు బీఆరెస్ నేతలపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ కు కూడా ఇదే తీరుగా నష్టపోయే ప్రమాదం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కాళేశ్వరం విజిలెన్స్ విచారణలో దొరికే ఎవిడెన్స్ ఆధారంగా అరెస్ట్‌లు చేయాలన్న ఆలోచనలో రేవంత్ సర్కారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.