మేం రెడీ! లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖం పూరించిన కాంగ్రెస్
తాము అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు.

- కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని నాగపూర్‌లో హై తయ్యార్ హమ్ పేరిట భారీ సభ
- లోక్‌సభ ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం
- మేం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన
- మోదీ పాలనలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సాధికారతేది?
- బీజేపీలో బానిస బతుకులేనని ఆ పార్టీ ఎంపీ చెప్పారు
- కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు
- రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా
నాగపూర్ : రాబోయే లోక్‌సభ ఎన్నికల సమరానికి తాము సంసిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రలోని నాగపూర్‌లో ‘హై తయ్యార్ హమ్’ పేరిట నిర్వహించిన భారీ సభతో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమని అభివర్ణించారు. ‘ఇండియా కూటమిలో, ఎన్డీయే కూటమిలో వేర్వేరు పార్టీలు ఉన్నా.. రాబోయే ఎన్నికల సమరం రెండు సిద్ధాంతాల మధ్యనే ఉండబోతున్నది’ అని ఆయన చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని ప్రకటించారు.
నాడు బ్రిటిషర్ల చెంత రాజులు, సంస్థానాధీశులు
ఆనాడు స్వాంతంత్ర్య పోరాటంలో పోరాడింది రాజులు, పాలకులు కాదు.. ఈ దేశ ప్రజలని రాహుల్ గుర్తు చేశారు. ‘రాజులు, సంస్థానాధీశులు ఆనాడు బ్రిటిషర్లకు మద్దతుగా ఉన్నారు. ప్రజలు తాము బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని అనుకున్నారు. నిజానికి బ్రిటిషర్లతోపాటు.. రాజులు, సంస్థానాధీశులకు వ్యతిరేకంగానూ ప్రజలు పోరాడారు’ అని చెప్పారు. ‘రాజులు బ్రిటిషర్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ఈ దేశ ప్రజల కోసం ఆ భాగస్వామ్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడింది. స్వాంతంత్ర్యానికి ముందు ప్రజలకు హక్కులు ఉండేవి కాదు. ఇది ఆరెస్సెస్ సిద్ధాంతం. మేం ఆ సిద్ధాంతాన్ని మార్చివేశాం’ అని రాహుల్ చెప్పారు. యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లను ప్రతిభ ఆధారంగా కాకుండా.. ఫలానా సంస్థకు చెందినవారన్న కోణంలో నియమిస్తున్నారని రాహుల్ విమర్శించారు. గడిచిన 40 ఏళ్లలో లేనంత స్థాయిలో దేశంలో నిరుద్యోగిత ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీలో బానిసత్వం
బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన రాహుల్.. ఆ పార్టీలో బానిసత్వం ఉన్నదని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి బీజేపీలోకి వెళ్లిన ఎంపీ ఒకరు ఇటీవల తనతో ప్రైవేటుగా మాట్లాడుతూ ఆ పార్టీలో బానిసల్లా బతకాల్సి ఉంటుందని చెప్పారని పేర్కొన్నారు. తాను బీజేపీలో ఉన్నా.. తన మనసులో మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఉన్నదని చెప్పారని తెలిపారు. ‘పై నాయకత్వం నుంచి వచ్చే ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాల్సిందే. పార్టీ కార్యకర్తల మాట వినేవాళ్లు ఎవరూ ఉండరు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వేరే మార్గం ఉండదు’ అని ఆయన చెప్పారని రాహుల్ వెల్లడించారు. కానీ.. దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పారు. జూనియర్ నాయకుడికి సైతం ప్రశ్నించే హక్కు, నాయకత్వంతో విభేదించే అవకాశం ఉంటుందని తెలిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలను బబ్బర్ షేర్.. అంటూ సంబోధించిన రాహుల్.. ఆరెస్సెస్, బీజేపీకి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ఎవరికీ భయపడాల్సిన పనిలేదని చెప్పారు. మహారాష్ట్రతోపాటు దేశంలో కలిసికట్టుగా విజయం సాధించబోతున్నామని అన్నారు. ఈ దేశ ప్రజలకు సాధికారత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదని రాహుల్ చెప్పారు. ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తన అధికారం కోసం దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. ఆఖరుకు మీడియాను కూడా వదల్లేదని అన్నారు.
ఏదీ బీసీలకు సాధికారత?
బీసీలకు సాధికారత కల్పిస్తామని మోదీ చెప్పడాన్ని ప్రస్తావించిన రాహుల్.. దేశ జనాభాలో ఓబీసీలు 50శాతం ఉన్నారని, కానీ.. కేంద్రంలోని 90 మంది ఐఏఎస్ అధికారుల్లో ఓబీసీలు ముగ్గురే ఎందుకు ఉన్నారని నిలదీశారు. వారికి కూడా చిన్న శాఖలు అప్పగించారని ఆరోపించారు. అధికారం విషయానికి వచ్చేసరికి వారు మాత్రం బీజేపీకి పనికిరారని అన్నారు. ‘దేశ జనాభాలో ఓబీసీలు 50శాతం, దళితులు 15%, ఆదివాసీలు 12% ఉన్నారు. కానీ వారికి బీజేపీ హయాంలో దక్కిందేమీ లేదు. 100 నుంచి 200 పెద్ద కంపెనీలు ఎవరివి? వాటిలో ఓబీసీలు, దళితులు, గిరిజనులు కనిపించరు. మరి ఏ ప్రాతిపదికన తాము ఓబీసీలు, దళితులు, గిరిజనులను ఉద్ధరిస్తున్నామని బీజేపీ సర్కారు చెప్పుకొంటున్నది? అని రాహుల్ నిలదీశారు. అధికారంలో వారికి భాగం ఏది? అని ప్రశ్నించారు. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత కన్హయ్యకుమార్, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ తదితరులు ప్రసంగించారు.