ఏపీ కాంగ్రెస్‌లో అభ్యర్థుల దరఖాస్తుల జాతర షురూ..

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణను బుధవారం ప్రారంభించింది

  • Publish Date - January 24, 2024 / 09:34 AM IST
  • ప్రారంభించిన పార్టీ ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్
  • ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకూ అవకాశం కల్పిస్తాం
  • తొలి దరఖాస్తు అందుకున్న మడకశిర సుధాకర్


విధాత: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణను బుధవారం ప్రారంభించింది. ఈసందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు దరఖాస్తులు అందజేశారు. మొదటి దరఖాస్తును మడకశిర నుంచి సుధాకర్ అందుకున్నారు. ఆతర్వాత వరుసగా గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ, బద్వేల్ నుంచి కమలమ్మ దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు దరఖాస్తును తీసుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను పోటీలో నిలబెడుతున్నట్లు చెప్పారు. పార్టీకి అందిన దరఖాస్తులను మధుసూదన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీస్తుందని తెలిపారు. ఏఐసీసీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక చేపడతామని అన్నారు. కుల రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ దూరమన్న ఆయన.. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలసి ఎన్నికల క్షేత్రంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మాజీలు, నిజమైన కాంగ్రెస్ వాదులు పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పోటీ చేసే స్థానం త్వరలో తెలుస్తుందని అన్నారు.