విధాత, గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌లో బీజేపీకి బలం లేదని, కాంగ్రెస్ కు కాండిడేట్లు లేరని, బీఆరెస్‌కు తిరుగులేదన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో పలు పార్టీల నుంచి మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆరెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ కు గతమే తప్ప భవిష్యత్తు లేదని, కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్ దారుణంగా విఫలమైందన్నారు.
అసెంబ్లీలోనూ కాంగ్రెస్ తీరు ఎంత దారుణంగా ఉందో ప్రజలు చూశారన్నారు. కాంగ్రెస్ లో వాళ్ల గొడవలు వాళ్ళకే తప్ప ప్రజల బాధలు పట్టవన్నారు. ఎవ్వరు ఔనన్న, కాదన్నా బీఆరెస్ హ్యాట్రిక్ కొట్టడం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
తెలంగాణ అభివృద్ధిని ఇతర రాష్ట్రాల సీఎంలతో పాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా ప్రశంసిస్తున్నా రని గుర్తు చేశారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేదని, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అంటున్నారన్నారు.
కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామంటున్నారని, మూడు పంటలకు కరెంటు ఇస్తున్న కేసీఆర్ కావాలా లేక మూడు గంటల కాంగ్రెస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.