ఒకే రోజు వేర్వేరు విమాన ప్రమాదాల నుంచి బయటపడిన జంట

ఒక జంట వేర్వేరుగా ప్రయాణించిన రెండు విమానాలు ఒకే రోజు కూలిపోయాయి.. అదృష్టవశాత్తూ ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

  • By: TAAZ    latest    Dec 22, 2023 11:33 AM IST
ఒకే రోజు వేర్వేరు విమాన ప్రమాదాల నుంచి బయటపడిన జంట

స్వల్ప గాయాలతో బయటపడ్డారు..

ఒకసారి ఒక ప్రమాదం నుంచి బయటపడటం మామూలే.. అప్పుడప్పుడు వేర్వేరు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోవడమూ తెలిసిందే. కానీ.. ఈ జంట ఒకే రోజు రెండు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు.. అందులోనూ ఆ రెండూ భయానక విమాన ప్రమాదాలు కావడం విశేషం. అందుకేనేమో రాసిపెట్టి ఉండాలంటారు! ఇటలీకి చెందిన ముప్పై ఏళ్ల స్టెఫానో పిరెల్లి, అతడి ఫియాన్సీ 22 ఏళ్ల ఆంటోనియెట్టా డీమాసి స్నేహితులతో కలిసి లంచ్‌ చేసేందుకు వేర్వేరు విమానాల్లో సవానో నగరానికి ప్రయాణించారు.


స్టెఫానియో రెండు సీట్ల విమానంలో బయలుదేరగా.. సాంకేతిక సమస్య తలెత్తి.. అది కూలిపోయింది. దురదృష్టం ఏమిటంటే.. అంటోనియెట్టా ఎక్కిన వేరొక రెండు సీట్ల విమానం కూడా అదే రోజు సాంకేతిక సమస్యలతో.. అందులోనూ స్టెఫానో విమానం కూలిపోయిన ప్రాంతానికి 25 మైళ్ల దూరంలో బుసానో వద్ద కూలిపోయింది. ఈ రెండు ఘటనల్లో వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విమాన శిథిలాల నుంచి అగ్నిమాపక సిబ్బంది వెంటనే వారిని బయటకు తీవారు. లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేది.


ఈ ప్రమాదంలో ఆంటోనియెట్టా పైలట్‌ పౌలో రొటోండోకు తలకు తీవ్ర గాయమైంది. నలుగురినీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆంటోనియెట్టా విమానం ఎక్కడం అదే మొదటిసారి అని స్టెఫానో చెప్పాడు. జరిగినదానికి తాను ఎంతో బాధపడుతున్నానని అన్నాడు. ఆ రోజు ఉదయం అందంగా మొదలై.. విచారకరంగా ముగిసిందని చెప్పాడు. అయితే.. ప్రాణహాని లేకపోవడంతో సంతోషం వ్యక్తం చేశాడు.