CPI-CPM: కమ్యూనిస్టులకు BRSకు మధ్య దూరం పెరుగుతున్నదా? కూనంనేని మాటల వెనుక ఆంతర్యం!

కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు దగ్గరవుతారా? బీజేపీని వ్యతిరేకించడం అనే కారణంతో బీఆర్‌ఎస్‌(BRS)కు దగ్గరైన కమ్యూనిస్టులకు (Communists) ఆ పార్టీతో దూరం పెరుగుతున్నదా? సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే అదే అనుమానం కలుగుతున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొన్నటిదాకా స్నేహ పూర్వకంగానే మెలిగిన పార్టీల మధ్య ఇప్పడు చిన్న చిన్న పొరపొచ్చాలు మొదలయ్యాయని చెప్తున్నారు. ఇవి ఎటు దారితీస్తాయోనని చర్చించుకుంటున్నారు. విధాత: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టులు […]

CPI-CPM: కమ్యూనిస్టులకు BRSకు మధ్య దూరం పెరుగుతున్నదా? కూనంనేని మాటల వెనుక ఆంతర్యం!
  • కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు దగ్గరవుతారా?

బీజేపీని వ్యతిరేకించడం అనే కారణంతో బీఆర్‌ఎస్‌(BRS)కు దగ్గరైన కమ్యూనిస్టులకు (Communists) ఆ పార్టీతో దూరం పెరుగుతున్నదా? సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే అదే అనుమానం కలుగుతున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొన్నటిదాకా స్నేహ పూర్వకంగానే మెలిగిన పార్టీల మధ్య ఇప్పడు చిన్న చిన్న పొరపొచ్చాలు మొదలయ్యాయని చెప్తున్నారు. ఇవి ఎటు దారితీస్తాయోనని చర్చించుకుంటున్నారు.

విధాత: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టులు బీజేపీ (BJP) అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డిని ఓడించడం అనే సూత్రంపై బీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు. ఆ పార్టీ శ్రేణులతో కలిసి ఉప ఎన్నిక ప్రచారంలో సీపీఐ, సీపీఎం కార్యకర్తలు, నాయకులు గట్టిగా కృషి చేయడంతోనే బొటాబొటీ మెజార్టీతో బీఆర్ఎస్‌ బయపడిందని అప్పట్లో చర్చ నడిచింది. కమ్యూనిస్టుల బలమే బీఆర్‌ఎస్‌ను గెలిపించిందనేది వాస్తవం. ఇది జరిగి నెలలు గడిచాయి.

ఇప్పడు అసలైన ఎన్నికల వాతావరణం వచ్చేసరికి ఎవరికి ఎన్ని సీట్లు అనే చర్చ, ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రత్యేకించి సీపీఐతో బీఆర్‌ఎస్‌కు దూరం పెరుగుతున్నదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ నేతల తీరుపై ఇటీవల స్వయంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఎన్నికల వేడి (2024 General elections) ఇప్పుడిప్పడే మొదలవుతున్న తరుణంలో కూనంనేని చేస్తున్న హాట్‌ కామెంట్స్‌ వెనుక ఆంతర్యం ఏమిటన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.

కమ్యూనిస్టు క్యాడర్‌ బీఆర్‌ఎస్‌ వద్దంటున్నారా?

రాష్ట్రంలో అధికార BRSతో కలిసి పనిచేయడానికి రెండు పార్టీల శ్రేణులు సుముఖంగా లేవన్న వాదన ఒకటి ఉన్నది. దానికి తోడు సీట్ల కేటాయింపు అప్పుడే తెరపైకి రానప్పటికీ స్థానికంగా బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్నవారు వామపక్ష పార్టీలను (Left Parties)చులకన చేసి మాట్లాడటం, ప్రత్యేకించి సీపీఐకి క్యాడర్‌ ఏముంది? వాళ్లకు ఉన్న ఓట్లెన్ని అని వ్యాఖ్యలు చేయడం సీపీఐకి ఆగ్రహం కలిగించింది. దీనిపైనే తీవ్రంగా స్పందించిన కూనంనేని.. ‘మేం తలుచుకుంటే అధికారం తారుమారవుతుంది’ అంటూ పరోక్షంగా బీఆర్‌ఎస్‌ నేతలను హెచ్చరించారు.

తాము పొత్తుల కోసం, సీట్ల కోసం ఎవరి వద్దకూ వెళ్లమబోని, అవసరం అనుకుంటే వారే వస్తారని అన్నారు. తమ పార్టీపై, నేతలపై వ్యంగ్యంగా మాట్లాడే నేతలను బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కంట్రోల్‌ చేయాలని సలహా ఇచ్చారు. నిజానికి పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం బీఆర్‌ఎస్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఇల్లెందులో సీపీఐ నాయకత్వం రేవంత్‌రెడ్డి పాద యాత్రలో పాల్గొనడం సంచనలం రేపింది. కమ్యూనిస్టు పార్టీ క్యాడర్‌లో ఉన్న మనోభావాలకు ఈ ఘటన అద్దం పడుతున్నదని అంటున్నారు.

కూనంనేని హాట్‌ కామెంట్స్‌

అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా సమస్యలు పరిష్కరించలేక పోయిందని, మనం సమస్యలపై పోరాడుతుంటే కేసులు పెడుతున్నదని, ఇంకో వైపు అవహేళన‌గా ఆ పార్టీ నేతలు మాట్లాడుతుంటే మనం ఎందుకు వారి వెంట వెళ్లాలని పార్టీ రాష్ట్ర‌ నాయకత్వాన్ని సీపీఐ ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్‌ నిలదీస్తున్నట్టు తెలుస్తున్నది. పేదల ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన సీపీఐ ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌ నగర శివార్లలో గుడిసెల పోరాటం చేసింది.

ఈ పోరాటంలో సీపీఐ రాష్ట్ర‌ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ పోరాటంలో పాల్గొన్న కూనంనేనితోపాటు పలువురు పార్టీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం భూ ఆక్రమణ కేసులు పెట్టింది. ఇది కమ్యూనిస్టులకు మింగుడు పడడం లేదన్న చర్చ జరుగుతున్నది. బీఆర్‌ఎస్‌ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని క్యాడర్‌ నాయకత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కూనంనేని పొత్తు పొత్తే… పోరాటం పోరాటమే అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కమ్యూనిస్టులకు, బీఆర్‌ఎస్‌కు మధ్య దూరం పెరుగుతున్నదన్న ఊహాగానాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగంగా 2024 ఎన్నికల్లో కమ్యూనిస్టులు తమతో కలిసి వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌తో ఉంటారో.. లూటీచేసే దొంగల పార్టీలో ఉంటారో కమ్యూనిస్టులు తేల్చుకోవాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. మరో వైపు కమ్యూనిస్టు పార్టీ క్యాడర్‌లో అంతర్మధనం మొదలైందన్న చర్చ జరుగుతోంది. క్యాడర్‌ పరిస్థితిని అర్థం చేసుకున్న కూనంనేని కావాలనే స్టేట్‌మెంట్లు ఇస్తున్నారేమోనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.