CPM , CPI | కళ్లు తెరిచేదెన్నడు కామ్రేడ్స్‌? అంతా అయిపోయాక మిత్రధర్మం యాదికి!

CPM , CPI | రాష్ట్రంలో అనేక ఆందోళనలకు దూరం సర్కారు తప్పులపై మాట్లాడని నేతలు ఇప్పుడు గొంతెత్తాల్సిన అనివార్యత (విధాత ప్రతినిధి) బీఆరెస్‌ను ఓడించాలనే నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని సీపీఐ, సీపీఎం నేతల ప్రకటించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి వాళ్లు చెప్పిన కారణాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారని, కానీ తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారని వామపక్ష నేతలు […]

  • By: Somu    latest    Aug 24, 2023 12:13 AM IST
CPM , CPI | కళ్లు తెరిచేదెన్నడు కామ్రేడ్స్‌? అంతా అయిపోయాక మిత్రధర్మం యాదికి!

CPM , CPI |

  • రాష్ట్రంలో అనేక ఆందోళనలకు దూరం
  • సర్కారు తప్పులపై మాట్లాడని నేతలు
  • ఇప్పుడు గొంతెత్తాల్సిన అనివార్యత

(విధాత ప్రతినిధి)

బీఆరెస్‌ను ఓడించాలనే నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని సీపీఐ, సీపీఎం నేతల ప్రకటించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి వాళ్లు చెప్పిన కారణాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారని, కానీ తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారని వామపక్ష నేతలు తప్పుపడుతున్నారు. అలాగే బీజేపీతో సఖ్యత ఏర్పడిన కారణంగానే కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని ఆరోపించారు. కనీస మిత్ర ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వాపమక్షాలు మిత్ర ధర్మం గురించి మాట్లాడటం వారి బలహీనతను తెలియజేస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీతో బీఆరెస్‌ సఖ్యతతో ఉన్నదనే ఆరోపణలు చాలా కాలంగా కాంగ్రెస్‌ చేస్తున్నది. ఇండియా కూటమిలోకి కేసీఆర్‌ను ఆహ్వానించే ప్రసక్తేలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తెలంగాణ గడ్డపై నుంచే ప్రకటించారు. అప్పుడు దానిపై స్పందించని వాపక్షాలు ఇప్పుడు బీఆరెస్‌, బీజేపీ సఖ్యత గురించి మాట్లాడటం విడ్డూరమేనని అంటున్నారు. ఇండియా కూటమిలోకి బీఆర్‌ఎస్‌ను ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో బీఆరెస్‌తో పొత్తుకు లెఫ్ట్‌ పార్టీ నేతలు ఎందుకు అంత తహతహలాడారన్న ప్రశ్నకు కూడా తగిన జవాబులు లేని పరిస్థితి.

‘మునుగోడు’తోనే ముగిసినా మిన్నకున్నారా?

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో ‘విధాత’ తెలుసుకునే ప్రయత్నంలో ఆ నియోజకవర్గ ప్రజలు చెప్పిన విషయాలు ఆసక్తి కలిగించాయి. ఒకప్పుడు మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోట. ఆ తర్వాత చాలాకాలం కాంగ్రెస్‌కు, అనంతరం బీఆరెస్‌కు అవకాశం దక్కింది. కానీ ప్రస్తుతం బీజేపీకి ఇక్కడి ఓటర్లు మారే ప్రశ్నే తలెత్తదు అని పలువురు తేల్చిచెప్పారు. మునుగోడు బీఆరెస్‌ విజయం వెనుక వామపక్షాల పాత్రే కీలకం.

తెలంగాణలో బీజేపీ విస్తరణను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే నాడు వామపక్షాలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించాయి. వామపక్షాల బలం తెలిసే కేసీఆర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించగానే వారి మద్దతు కోరారు. వారి మద్దతే మునుగోడులో బీఆరెస్‌ విజయానికి దోహదం చేసిందనేది తిరుగులేని సత్యం. ఆ ఎన్నిక అయిపోయే వరకు వరకు వారితో సత్సంబంధాలు నెరపిన కేసీఆర్.. ఫలితం అనంతరం వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని వామపక్ష నేతలే చెప్పారు. అప్పుడైనా కమ్యూనిస్టులు కళ్లు తెరవాల్సిందని ఒక విశ్లేషకుడు అన్నారు.

లెఫ్ట్‌తో పొత్తుపై ఏనాడూ మాట్లాడని కేసీఆర్‌

ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఎంఐఎం తమ మిత్రపక్షమని కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా.. బహిరంగసభల్లోనూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కానీ ఎన్నడూ ఆయన వామపక్షాల గురించి ప్రస్తావించలేదు. అలాంటప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి అవసరం ఏమొచ్చింది? బీఆర్‌ఎస్‌ వామపక్షాలకు చెరో టికెట్‌, రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వజూపినట్టు సమాచారం.

ఈ మాత్రం దానికి వాళ్లు బీఆర్‌ఎస్‌తో పొత్తు కోవడం దేనికి? వామపక్షాలు ఐక్యంగా వాళ్లకు బలం ఉన్నచోట కలిసి పోటీ చేస్తే అవే సీట్లు వారికి సొంతంగానే దక్కుతాయి. అవసరం అనుకుంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి వారి జాతీయ నాయకత్వం కలిసి పనిచేస్తున్నందున వారు పోటీ చేసే చోట ఇరువురూ సహకరించుకునే అవకాశం ఉన్నది. ఇన్ని అవకాశాలను వదిలేసి బీఆర్‌ఎస్‌తోనే కలిసి వెళ్దామనుకున్నామని, కానీ కేసీఆర్‌ మమ్మల్ని పట్టించుకోవడం లేదని కామ్రేడ్‌లు ఆవేదన చెందడం అభ్యుదయవాదులకు, ప్రజాస్వామికవాదులకు రుచించే విషయం కాదు.

ఏదీ పోరాటం?

వామపక్షాలు ఇప్పటికే త్రిపుర, బెంగాల్‌ వంటి రాష్ట్రాలను కోల్పోయాయి. రానున్నరోజుల్లో వారి ఉనికే ప్రశ్నార్థం అయ్యే ప్రమాదం ఉన్నది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వాళ్లు ఇంకో పార్టీని టికెట్లు అడగటం కంటే సొంతంగానే పోటీ చేసి తమ అస్తిత్వాన్ని నిలుపుకొంటే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నది. కనుక కామ్రేడ్లు దేశంలో ప్రస్తుతం నెలకొన్నప్రతికూల పరిస్థితుల దృష్ట్యా మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడే పార్టీలతో కలిసి వెళ్లడం వారికీ మంచిది. దేశానికి శ్రేయస్కరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆందోళనల్లో వామపక్షాలు ఎక్కడ?

గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఉదంతంతోపాటు.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, తరుగు తీయడం, వీఆర్‌ఏల ఆందోళన, వర్షాలు వరదలకు ప్రజలు పడిన ఇబ్బందులు, నష్టపరిహారం కోసం ఆందోళనలు, రైతుబంధు ఇవ్వడంపై నాన్చుడు ధోరణి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో తీవ్ర జాప్యం.. ఇలా చెప్పుకొంటూ పోతే అనేక సందర్భాల్లో వామపక్షాలు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేక పోయాయి. అనేక ఆందోళనల్లో అవి పాల్గొనలేక పోయాయి. ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించని కమ్యూనిస్టులు ఇప్పుడు అనివార్యంగా ప్రభుత్వ తప్పిదాలపై గొంతెత్తాల్సిన పరిస్థితి నెలకొన్నది.