Dasari Manohar Reddy | పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరిపై మూకుమ్మడి దాడి.. సొంత పార్టీలోనే వ్యతిరేకత
Dasari Manohar Reddy | టికెట్ ఇస్తే గెలవడంటూ వ్యాఖ్యలు.. మామ కోడళ్ళ పెత్తనంపై వార్డు సభ్యుల మండిపాటు ఆసక్తికరంగా పెద్దపల్లి అధికార పార్టీ రాజకీయాలు విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సొంత పార్టీలోని అసమ్మతి నేతల నుండి ముప్పేట దాడి ఎదుర్కొంటున్నారు. శాసనసభ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తున్న వేళ ఎగిసిపడుతున్న అసమ్మతి స్వరాలు ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్దపల్లి నుండి వరుసగా రెండుసార్లు శాసనసభకు ఎన్నికై, గత చరిత్రను తిరగ […]

Dasari Manohar Reddy |
- టికెట్ ఇస్తే గెలవడంటూ వ్యాఖ్యలు..
- మామ కోడళ్ళ పెత్తనంపై వార్డు సభ్యుల మండిపాటు
- ఆసక్తికరంగా పెద్దపల్లి అధికార పార్టీ రాజకీయాలు
విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సొంత పార్టీలోని అసమ్మతి
నేతల నుండి ముప్పేట దాడి ఎదుర్కొంటున్నారు. శాసనసభ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తున్న వేళ ఎగిసిపడుతున్న అసమ్మతి స్వరాలు ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్దపల్లి నుండి వరుసగా రెండుసార్లు శాసనసభకు ఎన్నికై, గత చరిత్రను తిరగ రాసిన మనోహర్ రెడ్డికి ఈ ఎన్నికలు ‘నల్లేరు మీద నడక’ కాబోవని పరిస్థితులను చూస్తే అర్థం అవుతోంది. అటు కాంగ్రెస్, బిజెపి వారికి తోడుగా సొంత పార్టీ నేతలు తనపై విమర్శలు ఎక్కువ పెట్టి, సవాళ్లు విసురుతున్న క్రమంలో పెద్దపల్లి రాజకీయాల్లో దాసరి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారైంది.
కార్పొరేట్ విద్యాసంస్థల నుండి రాజకీయాల్లోకి వచ్చిన దాసరి రాజకీయాలను కార్పొరేట్ తరహాలోనే నిర్వహిస్తున్నారని నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గోనె ప్రకాష్ రావు,
చింతకుంట విజయ రమణారావు(కాంగ్రెస్), గుజ్జుల రామకృష్ణారెడ్డి(బీజేపీ) ఇప్పటికే అనేక వేదికలపై శాసనసభ్యుడి అవినీతి వ్యవహారాలపై ధ్వజమెత్తుతుండగా, దానిని తిప్పి కొట్టి, దాసరికి మద్దతుగా నిలవాల్సిన అధికార పార్టీ నేతలు సైతం అవే ఆరోపణలు చేస్తుండటం, 9 ఏళ్ల పాటు ఏకచత్రాధిపత్యం వహించిన శాసనసభ్యుని వర్గానికి మింగుడు పడని పరిణామం.
మట్టి, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరికి ఈసారి టికెట్ గల్లంతేనని భావిస్తున్న అధికార పార్టీ నేతలు పలువురు, తమ వంతు ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ టికెట్ ప్రయత్నాలు, పెద్దపల్లి మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్ల తిరుగుబాటు రాజకీయాలు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య బహిరంగంగానే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం.. దాసరి మనోహర్ రెడ్డికి తలనొప్పిగా మారాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సమయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చింతలఫణి సత్యనారాయణ రెడ్డి ‘ప్రజాహితస పేరిట సంస్థలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అవినీతిపై పోరాడుతున్నారు. మట్టి, ఇసుక ఎమ్మెల్యే పుట్టి ముంచుతాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు హెచ్చరిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, శాసనసభ్యుడిపై వస్తున్న అవినీతి ఆరోపణలు పార్టీ అధిష్టానం వద్దకు చేరవేసే పనిలో మరికొందరు అధికార పార్టీ నేతలు నిత్యం బిజీగా ఉంటున్నారు. ఈ కారణాలన్నీ దృశ్య దాసరికి ఈసారి టికెట్ దక్కకపోవచ్చని భావిస్తున్న పలువురు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
పార్టీ నేత నల్ల మనోహర్ రెడ్డి, జూలపల్లి జెడ్పిటిసి లక్ష్మణ్ తదితరులు ఈసారి పెద్దపల్లి సీటు ఆశిస్తున్నారు. బీసీలలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న పద్మశాలి కులానికి చెందిన జడ్పిటిసి లక్ష్మణ్
పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించడానికి కేసీఆర్ సేవాసదనం పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు.పెళ్లిళ్లకు, పేరంటాలకు ఆర్థిక సహాయం అందించడం, పార్టీ కార్యకర్తల
మద్దతు కూడగట్టుకోవడంలో ఆయన బిజీ అయ్యారు. మరోనేత నల్ల మనోహర్ రెడ్డి ఈసారి టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు.
వీరిరువురే కాకుండా పట్టణం మున్సిపాలిటీ కౌన్సిలర్లు అసమ్మతి గళం ఎత్తారు. పురపాలక సంఘం పూర్తిగా తన ఆధీనంలో ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన కోడలు మమతారెడ్డికి చైర్మన్ పదవి కట్టబెట్టారు. అప్పటినుండి కౌన్సిలర్లలో చోటు చేసుకున్న వ్యతిరేకత ఎన్నికల సమయంలో క్రమేపి బయటకు వస్తోంది. పెద్దపల్లికి చెందిన 18,19 వార్డు కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్, సంధ్య టిఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తామే కాకుండా, శాసనసభ్యునిపై అసంతృప్తితో ఉన్న మరో ఎనిమిది మంది కౌన్సిలర్లను వెంటేసుకు వెళ్లేందుకు సంప్రదింపులు జరిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇటీవల కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. కొంతమంది కోవర్టులుగా మారేందుకు, పార్టీ వీడేందుకు ప్రయత్నిస్తు న్నారని వారి వల్ల తనకేం నష్టం లేదంటూ తన వర్గానికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల వరకు ఓపిక పడతానని, ఆతర్వాత అసంతృప్తులపై తడాఖా చూపుతానని హెచ్చరించారు.
దీంతో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే అధికార పార్టీని వీడి, బిజెపి లేదా కాంగ్రెస్ లో చేరడం ద్వారా ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పనిచేయాలనే నిర్ణయానికి ఒకరిద్దరు కౌన్సిలర్లు వచ్చారు. ఇటీవల పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి మనోహర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఓడిపోతారని తమ పార్టీలోనే ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ .రాజయ్య బహిరంగ వ్యాఖ్యలు, కౌన్సిలర్ల తిరుగుబాటు యత్నాలు, జడ్పిటిసి లక్ష్మణ్ టికెట్ ప్రయత్నాలు ఇవన్నీ దాసరిమనోహర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించక తప్పనిసరి పరిస్థితులు కనిపిస్తున్నాయి.