తినడానికి తిండి లేదని పసిబిడ్డను చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
Bengalore | అతనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. భార్య, బిడ్డతో హాయిగా జీవితం కొనసాగిస్తున్నాడు. కానీ గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేదు. తాను చేస్తున్న బిట్ కాయిన్ బిజినెస్‌లో కూడా నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. దీంతో తినడానికి కూడా తిండి కరువైంది. తన బిడ్డకు కడుపు నిండా ఆహారం పెట్టేందుకు కూడా తన వద్ద డబ్బు లేదని చెప్పి.. రెండేండ్ల పసిపాపను తండ్రి చంపేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన […]

Bengalore | అతనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. భార్య, బిడ్డతో హాయిగా జీవితం కొనసాగిస్తున్నాడు. కానీ గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేదు. తాను చేస్తున్న బిట్ కాయిన్ బిజినెస్‌లో కూడా నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. దీంతో తినడానికి కూడా తిండి కరువైంది. తన బిడ్డకు కడుపు నిండా ఆహారం పెట్టేందుకు కూడా తన వద్ద డబ్బు లేదని చెప్పి.. రెండేండ్ల పసిపాపను తండ్రి చంపేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ తాలుకా పరిధిలోని కెందట్టి గ్రామ సమీపంలో వెలుగు చూసింది.
గుజరాత్‌కు చెందిన రాహుల్ పర్మార్(45) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య భవ్య, కూతురు(2) ఉంది. అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడంతో ఉద్యోగం నిమిత్తం రెండేండ్ల క్రితం బెంగళూరుకు కుటుంబంతో వచ్చాడు రాహుల్. ఆరు నెలల కిందట ఉద్యోగం కోల్పోయాడు. దీంతో జీవితం గడపడానికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే తాను చేస్తున్న బిట్ కాయిన్ బిజినెస్‌లో కూడా నష్టాల పాలయ్యాడు. దీంతో బతకడం మరింత కష్టమైంది. తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది రాహుల్‌కు.
దిక్కు తోచని స్థితిలో రాహుల్ తన బిడ్డను తీసుకుని నవంబర్ 15న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో తన భర్త, కూతురు అదృశ్యంపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే శనివారం రాత్రి కోలార్ పోలీసు స్టేషన్ పరిధిలోని కెందట్టి గ్రామ సమీపంలోని చెరువు వద్ద ఓ పాప మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటానస్థలికి చేరుకున్న కోలార్ పోలీసులు పాప డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌కు చెందిన బ్లూ కలర్ కారును స్టేషన్‌కు తరలించారు.
తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాహుల్‌ను కోలార్ పోలీసులు విచారణ చేయగా, బిడ్డను తానే చంపినట్లు అంగీకరించాడు. అటు ఉద్యోగం పోయింది.. ఇటు వ్యాపారంలో నష్టపోయాను. తినడానికి తిండి లేదు. బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నానని, అందుకే చంపేశానని రాహుల్ చెప్పాడు. పాపను బయటకు తీసుకెళ్లి గుండెలకు హత్తుకున్నాను. కాసేపు ఆమెతో ఆడుకున్నాక చంపేశానని తెలిపాడు.
ఆ భయంతోనే.. బిడ్డను చంపి ఉండొచ్చు..
ఉద్యోగం కోల్పోవడం, బిజినెస్‌లో నష్టాలు రావడంతో.. కొద్ది రోజుల క్రితం తన ఇంట్లో బంగారాన్ని దొంగిలించాడు. అనంతరం తన ఇంట్లో బంగారం మాయమైందని బెంగళూరు పోలీసులకు రాహుల్ ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో రాహులే బంగారం దొంగిలించినట్లు తేలింది. అది విక్రయించగా వచ్చిన డబ్బుతో నిత్యావసరాల కోసం ఖర్చు చేసినట్లు తేలింది. దీంతో అతనిపైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. అయితే తనపై కేసు నమోదైతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.