Delhi
విధాత: యమున నది ఉప్పొంగి ప్రవహించడంతో దేశరాజధాని ఢిల్లీ చిగురుటాకులా వణికిపోతున్నది. వరద ముంపులో హస్తన ప్రజలు అల్లలాడుతున్నారు. ఢిల్లీలోని దాదాపు అన్ని లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్లలోతున వరద నీరు వచ్చి చేరింది. వేల సంఖ్యలో ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించారు. కేవలం టెంట్లు వేసి పునరావాసం కల్పించడం పట్ల నిరాశ్రయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ పేదలు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారు.. తప్పరాజకీయాలు ఎలాంటి అసౌకర్యానికి గురికావడంతో లేదని ఓ మహిళ ఆరోపించారు.
ట్రాఫిక్ మళ్లింపు
వరద నీరు కారణంగా అనేక ప్రాంతాల్లో గురువారం ట్రాఫిక్‌ను మళ్లించారు. జీటీ రోడ్డులోని షాహదారా నుంచి ఐఎస్‌బీటీ, కశ్మీర్ గేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సీలంపూర్ టీ-పాయింట్ నుంచి కేశవ్ చౌక్-కర్కర్దూమా కోర్టు మీదుగా మళ్లించారు. దాంతో ఢిల్లీ శాస్త్రీ పార్క్ సమీపంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. గురువారం ఉదయంవేళ ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రయాణాలు సాగించవద్దని సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
दिल्ली के जिन इलाक़ों में पानी भर रहा है वहाँ पर सब सरकारी व प्राइवेट स्कूलों को बंद कर रहे हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 13, 2023
రెడ్ అలర్ట్ ప్రకటించినా.. యమునా నీటి మట్టం ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీకి వరద రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయినా, వరద ముంపు ప్రభావం ఢిల్లీ ప్రజలపై తీవ్రంగా పడింది. దీని వెనుక ఉన్న కారణాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారి వివరించారు. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు ఈ సంవత్సరం ఢిల్లీకి చేరుకోవడానికి తక్కువ సమయం పట్టిందని తెలిపారు. గతంలో వరద నీరు ప్రవహించడానికి ఎక్కువ స్థలం ఉండేదని, ఇప్పుడు కబ్జాల కారణంగా మార్గం కుంచించుకుపోందని పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో విద్యా సంస్థల మూసివేత
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. గురువారం ఉదయం యమున నది వరద 208.46 మీటర్ల మార్కును దాటి ప్రవహిస్తున్నది. ఇది ప్రమాద హెచ్చరికకు మూడు మీటర్లు అదనం.
మూడు వాటర్‌ఫిల్టర్ ప్లాంట్ల మూసివేత
వరద నీరు చేరుకోవడంతో వజిరాబాద్, చంద్రవాల్, ఓక్లా వాటర్ ట్రిట్‌మెంట్ ప్లాంట్లను మూసివేయాల్సిందిగా సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. దాంతో పలు ప్రాంతాల్లో కూడా తాగునీటి సమస్యకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది.