విధాత: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మరో రెండు నూతన మండలాలు ఎర్రవెల్లి, పాల్వంచలను ఏర్పాటు చేయడంతో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో వేములకొండ (Vemulakonda) నూతన మండల ఏర్పాటు డిమాండ్ మళ్లీ ఊపందుకుంది.
ఏకంగా 37 గ్రామ పంచాయతీలతో రాష్ట్రంలోనే అతిపెద్ద మండలాల్లో ఒకటిగా కొనసాగుతున్న వలిగొండ మండలమును పునర్విభజించి వేములకొండను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఇప్పటికే 272 రోజులకు పైగా ఆ ప్రాంత ప్రజలు వరుస ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ఈ నెల 25న యాదాద్రి కలెక్టరేట్ ముట్టడికి వేములకొండ మండల సాధన అఖిలపక్ష కమిటీ పిలుపునిచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నిర్ణయించింది. అయితే ఈ ఆందోళన ప్రారంభమయ్యాక ప్రభుత్వం 13 మండలాలను ప్రకటించినప్పటికీ దీనిని మండలం చేయకపోవడంపై పలు విమర్శలకు తావిస్తున్నది.
వలిగొండ మండలాన్ని పునర్విభజించి వేములకొండ లేదా అరూర్ కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ స్థానిక ప్రజల నుండి నిరంతరం బలపడుతూనే వస్తుంది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోణాలతో పాటు ఇతర ఏ అంశాల ప్రాతిపదికన చూసినా వలిగొండ మండలాన్ని ఇప్పటికే పునర్విభజన చేయాల్సి ఉంది.
భౌగోళికంగా, జనాభా సంఖ్య, పంచాయతీల సంఖ్య పరంగా, రోడ్లు, రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రాల కనెక్టివిటీ ఇలా ఏ కోణంలో చూసినా వలిగొండ మండలాన్ని పునర్విభజన చేసి వేములకొండ లేదా అరూరు మండలాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ శాస్త్రీయతకు, హేతుబద్ధతకు, తర్కానికి నిలబడుతుందనడం నిర్వివాదాంశం.
రాజకీయ కోణాల్లో వలిగొండ మండలం కంటే చిన్న మండలాలను కూడా విభజించి చుట్టూ ఉన్న మండలాల గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసి రాజు తలుచుకుంటే కానిదేముంది అన్నట్లుగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం వలిగొండ మండలం పునర్విభజన విషయంలో చర్యలు తీసుకోకపోవడమే విడ్డూరం.
మండల పునర్విభజన తో పాటు కొత్త మండలాల ఏర్పాటు డిమాండ్ సాధనలో స్థానిక భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి విఫలమవుతుండటమే ఇక్కడి ప్రజల కొత్త మండల ఏర్పాటు కల సాకారాన్ని దూరం చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బిఆర్ఎస్ అధిష్టానం, వద్ద సంబంధిత ప్రభుత్వ శాఖల వద్ద వలిగొండ మండలం పునర్విభజన, కొత్త మండల ఏర్పాటు వాదనలను బలంగా తీసుకెళ్లే నాయకత్వం లేకపోవడం ఇక్కడి ప్రజల కొత్త మండల ఏర్పాటు ఆశలను నీరుగారుస్తుంది.
గతంలో 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదా జాబితాలో దూరాన ఉన్న నకిరేకల్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలోకి వెళ్లిన వలిగొండ మండలాన్ని భౌగోళిక.. శాస్త్రీయ వాదనలతో పాటు అఖిలపక్ష ఆందోళనలతో భువనగిరి నియోజకవర్గం పరిధిలోకి చేర్చడంలో ఇక్కడి నాయకత్వం సంఘటితంగా విజయవంతమైంది.
అలాంటి రాజకీయ నాయకత్వ స్ఫూర్తి కొరవడడంతో పాటు బిఆర్ఎస్ అధిష్టానాన్ని వలిగొండ మండల పునర్విభజన విషయమై ఒప్పించే బిఆర్ఎస్ నాయకత్వం కరువవ్వడం కూడా కొత్త మండల సాధనలో వైఫల్యానికి కారణ మవుతుంది. 10 గ్రామాలతో పాల్వంచ, ఎర్రబెల్లి మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. 14 గ్రామాలతో సానుకూలత ఉన్న వేములకొండ మండలాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సహేతుకంగా కొత్త మండల డిమాండ్
37 గ్రామ పంచాయతీలతో అతిపెద్ద మండలంగా ఉన్న వలిగొండ మండలంలో వేములకొండ, వెంకటాపురం, ముద్దాపురం, చిత్తాపురం, గోపరాజుపల్లి, నరసాపురం, దుప్పల్లి, గుర్నాథ్ పల్లి గ్రామ పంచాయతీలతోపాటు రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం కొత్తగూడెం శోభనాద్రిపురం గ్రామాలతో వేములకొండ మండలాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది.
ఇంకోవైపు అరూర్, జంగారెడ్డిపల్లి, అప్పారెడ్డిపల్లి, తుర్కపల్లి సహా వేములకొండ మండల డిమాండ్ పరిధిలో ఉన్న గ్రామాలతో కలిపి అరూరు మండలాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. అయితే అరూర్ మండల డిమాండ్ లోని గ్రామాలతో కలిపే వేములకొండను మండలంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న వాదన బలంగా వినిపిస్తుంది.
వేములకొండలో మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తో పాటు బ్యాంకు, పిహెచ్ సి సహ ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన వసతులున్నాయి. ప్రస్తుత వలిగొండ మండల కేంద్రానికి చుట్టూన ఉన్న రామన్నపేట, ఆత్మకూరు(ఎం), మోత్కూరు మండల కేంద్రాలకు మధ్యలో ఉన్న వేములకొండ మండల ఏర్పాటు డిమాండ్ వైపే మెజారిటీ గ్రామాల ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
శాస్త్రీయంగా, భౌగోళికంగా వేములకొండ డిమాండ్ కు కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన అనేక మండలాల కంటే ఎక్కువ సానుకూతలే ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం. అందుకే నానాటికి వేములకొండ మండల ఏర్పాటు డిమాండ్ బలపడుతుండగా మండల సాధన దిశగా అఖిలపక్షం పేరుతో సాగిస్తున్న ఆందోళనలు.. స్థానిక అధికార పార్టీ నాయకత్వం చేసే ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయన్నది మునుముందు తేలాల్సి ఉంది.