Dharani | బీఆర్‌ఎస్.. భూస్వాముల పక్షం!
Dharani విధాత: తెలంగాణలో రాజకీయాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. అధికారంలో ఉన్నబీఆర్‌ఎస్ నేత కేసీఆర్ తాను రైతుల పక్షపాతినని చెప్పుకొంటున్నారు. తెలంగాణలో తాను అమలు చేస్తున్న విధానమే దేశానికి దిక్సూచి అని చెప్పుకుంటున్నారు. నిజంగా తెలంగాణలో అమలవుతున్న భూమి పాలసీ దేశానికి దిక్సూచిగా ఉండటమంటే రైతులను కోర్టుల చుట్టూ తిప్పడమా? ఇప్పటి వరకు భూములు సాగు చేసుకుంటున్న రైతులను ఆ భూములకు దూరం చేయడమా? తమ భూములు ధరణిలో కనిపించక పోతే ఏమి చేయాలో అర్థం కాక, […]

విధాత: తెలంగాణలో రాజకీయాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. అధికారంలో ఉన్నబీఆర్‌ఎస్ నేత కేసీఆర్ తాను రైతుల పక్షపాతినని చెప్పుకొంటున్నారు. తెలంగాణలో తాను అమలు చేస్తున్న విధానమే దేశానికి దిక్సూచి అని చెప్పుకుంటున్నారు. నిజంగా తెలంగాణలో అమలవుతున్న భూమి పాలసీ దేశానికి దిక్సూచిగా ఉండటమంటే రైతులను కోర్టుల చుట్టూ తిప్పడమా? ఇప్పటి వరకు భూములు సాగు చేసుకుంటున్న రైతులను ఆ భూములకు దూరం చేయడమా?
తమ భూములు ధరణిలో కనిపించక పోతే ఏమి చేయాలో అర్థం కాక, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులకు గురికావడమా? చివరకు రిజిస్ట్రేషన్‌కోసం చెల్లించిన డబ్బులు కూడా ఏ కారణం చేతనైనా ఆ రిజిస్ట్రేషన్ ఆగిపోతే ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడమా? దేశానికి దిక్సూచిగా చూపించేది ఇదేనా? బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కానీ, బీఆర్‌ఎస్ అగ్రనేతలు కానీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ధరణిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడినప్పుడు.. భూ సమస్యలుంటే కోర్టుకు వెళతారని, కోర్టులో తేల్చుకుంటారని చెప్పారు. అంటే భూ సమస్యలు తాము పరిష్కరించబోమని చెప్పడమే. రాష్ట్రంలో ధరణి వచ్చిన తరువాత సమస్యలు మరింత జటిలం అయ్యాయి కానీ పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ పార్టీ 1975లో భూ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చి భూస్వాముల నుంచి మిగులు భూములు స్వాధీనం చేసుకొని, ఆ భూములను భూమి లేని పేదలకు పంచింది.
ఒక్క తెలంగాణలోనే 35 లక్షల ఎకరాల భూములను పేదలకు ఎస్సీ, ఎస్టీ, భూమి లేని పేదలకు పంచింది. పోడు భూములకు పట్టాలు ఇచ్చింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ప్రజా అవసరాల పేరిట అసైన్డ్ భూములు భారీగా గుంజుకుంటున్నది. దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ భూములు ఇవ్వకపోగా.. కాంగ్రెస్ పంచిన భూములు కూడా గుంజుకుంటున్నది.
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పేదల పక్షాన్నే నిలబడిందని చెప్పడానికి భూ సంస్కరణ చట్టమే అద్దం పడుతుంది. భూమి రికార్డులను పక్కాగా నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసీ) తీసుకువచ్చి భూమి వివరాలన్నింటినీ కంప్యూటరీకరించింది.
ధరణి వచ్చేంత వరకు భూ రికార్డులన్నీ ప్రభుత్వం వద్దనే పూర్తి భద్రంగా ఉన్నాయి. కానీ భూమి రికార్డుల్లో పూర్తి భద్రత అంటూ ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి రాష్ట్ర భూముల వివరాలన్నింటినీ ఐఎల్‌ఎఫ్‌ఎస్ చేతిలో పెట్టారు. ఈ కంపెనీ నుంచి విదేశీ కంపెనీ చేతుల్లోకి తద్వారా శ్రీధర్‌రాజు అనే ప్రైవేట్‌వ్యక్తి చేతుల్లోకి రికార్డులు వెళ్లాయి. అసలు భూ రికార్డులకు భద్రతనే లేకుండా పోయింది.
పేరుతో వేల కోట్ల కుంభకోణం జరిగిందని అర్థమవుతున్నది. ధరణి కుంభకోణంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేవనెత్తిన సందేహాల్లో ఒక్కదానికి కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేక పోయింది.
ధరణి పోర్టల్ వచ్చిన తరువాత భూమి సమస్యలు విపరీతంగా పెరిగాయి. ఏ గ్రామానికి వెళ్లినా ధరణిలో భూమి సమస్యలనే ప్రజలు చెపుతున్నారు. ధరణి రాకముందు భూమి రికార్డుల్లో పట్టాదారు, అనుభవ దారు కాలం ఉండేవి. చాలా మంది రైతులు పాత కాలంలో భూస్వాముల నుంచి తెల్ల కాగితాలపై భూములు కొనుగోలు చేశారు.
ఆయా భూములు రికార్డులో అనుభవదారు కాలంలో కొనుక్కున్న రైతు పేరు ఉండేది. పట్టదారుగా భూమి అమ్ముకున్న ఆసామి పేరే ఉండేది. ఇలా ఏళ్ల కొద్ది రికార్డులు అలాగే ఉన్నాయి. తరువాత కాలంలో తాసీల్దార్లు, ఆర్డీఓలు విచారించి ఆయా భూములకు యజమానులను గుర్తించి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. ధరణి వచ్చిన తరువాత అనుభవ దారు కాలం ఎగిరిపోయింది. దీంతో సాగులో ఉన్న రైతు ఎగిరిపోయి. ఏనాడో భూమిని అమ్ముకొని వెళ్లిపోయిన ఆసామి తెరపైకి వచ్చాడు.
ప్రస్తుతం కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు, రైతుబీమా వారికే వర్తిస్తున్నది. వాస్తవ రైతు తన భూమి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.. కానీ తాసీల్దారు నుంచి కలెక్టర్‌వరకు ఏ ఒక్కరు కూడా సమస్యను పరిష్కరించడం లేదు. మీ-సేవలో డబ్బులు కట్టి దరఖాస్తు చేస్తే రిజక్ట్ అని రెండు మూడు రోజుల్లో సమధానమే వస్తున్నది.
ధరణి వచ్చిన తరవాత సమస్యలు సులువుగా పరిష్కారం కావాలి కానీ జటిలం అవుతాయా? అని హై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదిలాబాద్ నుంచి ఒక మహిళ హైకోర్టుకు వచ్చిన తీరును న్యాయమూర్తి నేరుగా సీసీఎల్‌ఏకే వివరించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయినా సమస్యలు పరిష్కరించకుండా ధరణి బ్రహ్మాండంగా ఉందని కేసీఆర్ తన సొంత పత్రికలో రాయించుకున్న తీరు పరిశీలిస్తే రైతుల భూమి సమస్యలు పరిష్కరించడానికి సిద్దంగా లేడని తెలుస్తోంది.
సమస్యలు పరిష్కరించాలంటూ దాదాపు మూడు లక్షల మంది రైతులు ధరణిలో దరఖాస్తు చేసుకున్నారంటే సమస్య తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను సమస్యల ఊబిలోకి లాగింది. దీని నుంచి ఎలా బయట పడాలో కూడా తెలియని పరిస్థతి ఏర్పడింది. రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలలో ధరణి సమస్యలే ఎక్కువగా వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన కాంగ్రెస్‌పార్టీ రైతులకు అండగా నిలబడాలని నిర్ణయించింది.
రైతుల భూములకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయాలని తలపించింది. రైతు భూములకు ప్రభుత్వమే గ్యారెంటీగా ఇస్తూ టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని
నిర్ణయించింది. ఈ చట్టం ద్వారా రైతుకు ఒక్కసారి భూ యజమాన్య హక్కులు కల్పించిన తరువాత దానిని ఇతరు నుంచి కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంటుంది.
అందుకే మేము రైతుల భూముల రక్షణ బాధ్యత తీసుకుంటామని రేవంత్‌రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. రైతు భూమికి గ్యారెంటీ ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
– బెల్లయ్య నాయక్
టీపీసీసీ అధికార ప్రతినిధి,
జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సెల్ అధ్యక్షుడు