క్షేత్రస్థాయి ప‌ర్య‌ట‌న‌కు ధ‌ర‌ణి క‌మిటీ

ధ‌ర‌ణిలో రైతుల భూముల‌కు సంబంధించిన కీల‌క‌మైన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేద‌ని ధ‌ర‌ణి క‌మిటీ గుర్తించింది. క‌మిటీ సిఫార‌స్సుల మేర‌కు ధ‌ర‌ణిలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి

  • Publish Date - March 13, 2024 / 04:56 PM IST
  • పరిష్కారానికి నోచని కీలక సమస్యలు?
  • పరిశీలించేందుకు సిద్ధమైన కమిటీ సభ్యులు
  • సమస్యాత్మకంగా సాదాబైనా అంశాలు
  • ధ‌ర‌ణిలో తాసిల్దార్ల‌కు రెండు ఆప్ష‌న్స్
  • రెండు రోజుల్లో మరో రెండు ఆప్షన్స్‌!

విధాత‌: ధ‌ర‌ణిలో రైతుల భూముల‌కు సంబంధించిన కీల‌క‌మైన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేద‌ని ధ‌ర‌ణి క‌మిటీ గుర్తించింది. క‌మిటీ సిఫార‌స్సుల మేర‌కు ధ‌ర‌ణిలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టిన విష‌యం అంద‌రికి తెలిసిందే.. ఈ మేర‌కు మండ‌లానికి రెండు మూడు టీమ్‌ల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. గ‌త ప్ర‌భుత్వానికి భిన్నంగా క‌మిటీ సూచ‌న మేర‌కు అధికారాల‌ను కూడా తాసిల్దార్ల‌కు, ఆర్డీవోల‌కు, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ల‌కు బ‌దిలీ చేసింది. దీంతో రైతులు మండ‌ల కార్యాల‌యాల‌కు పోటెత్తారు. ప‌రిస్థితిని అర్థం చేసుకున్న ప్ర‌భుత్వం స్పెష‌ల్ డ్రైవ్‌ గ‌డువును 9వ తేదీ నుంచి 17వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. అయితే చాలామంది రైతులు తాసిల్దార్ల వ‌ద్ద‌కు వస్తున్నా ప‌రిష్కారం చేయ‌లేని స‌మ‌స్య‌లున్నాయ‌ని తేలింది.

సాదామైనామాలతో సమస్య

తెలంగాణ‌లో నోటి మాట ద్వారా, తెల్ల కాగితంపై జ‌రిగిన సాదాబైనామా లావాదేవీలు అనేకం ఉన్నాయి. అమ్మిన రైతు, కొనుగోలు చేసుకున్న రైతు ఇద్ద‌రూ అంగీకారం తెలిపినా ధ‌ర‌ణిలో ప‌రిష్కారం చేసే అవ‌కాశం లేదు. దీంతో పాటు పీవోటీలు కూడా ప‌రిష్కారం కాలేదు. వాస్తంగా పేద రైతులు పీవోటీ భూములు కొనుగోలుచేస్తే తాసిల్దార్ వాటిని విచార‌ణ చేసి పేద‌వాడ‌ని, నిర్థారించుకున్న త‌రువాత కొనుగోలు దారుడికి ప‌ట్టా చేసే అవ‌కాశం ఉండేది. కానీ ధ‌ర‌ణిలో ఆ వెస‌లుబాటు లేదు. వీటితోపాటు చిన్న చిన్న స‌మ‌స్య‌లు, వైవాటీ క‌బ్జాలు తెలంగాణ‌లో ప్ర‌తి గ్రామంలో ఉంటాయి. రైతు భూమికి ప‌ట్టా ఒక ద‌గ్గ‌ర ఉంటే, వాస్త‌వ క‌బ్జాలో మ‌రో ద‌గ్గ‌ర ఉంటాడు. ఇలాంటివి రైతులు వారికి వారే మాట్లాడుకొని వ‌చ్చి తాసిల్దార్‌ను క‌లిసి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే స‌రి చేస్తారు. కానీ ధ‌ర‌ణిలో దీనికి ఎక్క‌డా అవ‌కాశం లేదు. అలాగే టెక్నిక‌ల్‌గా వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు ధ‌ర‌ణిలో ప‌రిష్కారం లేని అంశాన్ని కూడా గుర్తించారు. ముఖ్యంగా ఎవ‌రైనా ఒక రైతు త‌న‌కు ఒక స‌ర్వే నంబ‌ర్‌లో రెండు మూడు ఎక‌రాల భూమి ఉంటే అందులో నుంచి ఒక అర ఎక‌రం అమ్ముకున్నాక మిగిలిన భూమి ఉంటుంది. ఆ భూమిని ఇత‌ర అవ‌స‌రాల కోసం మ‌రొక‌రికి అమ్ముకుందామంటే స్లాట్ బుక్ కావడం లేదు. వాస్త‌వంగా గ‌తంలో అమ్ముకున్న అర ఎక‌రం భూమి మాత్ర‌మే డిలిట్ అయి మిగిలిన భూమి అంతా రైతు త‌న అవ‌స‌రం కోసం వినియోగించుకునేలా ఉండాలి. కానీ చాలా చోట్ల టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల‌తో ఇలాంటి ఇబ్బందులు కూడా ఏర్ప‌డుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌పై సీసీఎల్ఏకు లెట‌ర్ రాస్తే… సీసీఎల్ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీకి రాస్తే ప‌రిష్కారం కావాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. అవుతుందో కాదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. కొన్నింటికి చ‌ట్టంలో సవరణలు తెస్తేనే ప‌రిష్కారం దొరుకుతుంది. గ‌త ప్రభుత్వం ధ‌ర‌ణి ద్వారా సామాన్య రైతుల‌కు చెందిన ప‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుండా చేసింద‌న్నచ‌ర్చ కూడా జరుగుతోంది.

సమస్యలు తెలుసుకుంటున్న ధరణి కమిటీ

ధ‌ర‌ణిలో ప‌లుర‌కాల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం లేద‌నే విషయాన్ని క‌మిటీ గుర్తించింది. ఈ మేర‌కు ధ‌ర‌ణి క‌మిటీ స‌భ్యులు మాజీ ఎమ్మెల్యే, జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్య‌క్షుడు కోదండ‌రెడ్డి, న‌ల్సార్ యూనివ‌ర్సిటీ అసెంట్ ప్రొఫెస‌ర్ భూమి సునీల్‌ క్షేత్రస్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధ‌వారం న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు మండ‌ల కేంద్రాన్ని సంద‌ర్శించారు. తాసిల్దార్‌తో, మండల‌ కార్యాల‌యానికి వ‌చ్చిన రైతుల‌తో మాట్లాడారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో భూమి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయా? స్పెష‌ల్ డ్రైవ్ వ‌ల్ల రైతుల‌కు క‌లుగుతున్న ప్ర‌యోజ‌నం ఏమిటి? అధికారుల‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లు ఏమిటి? ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ప‌రిష్కారం చేయ‌లేని స‌మ‌స్య‌లు ఏమున్నాయి? అనేవి అడిగి తెలుసుకున్నారు. ధ‌ర‌ణి స్పెష‌ల్ డ్రైవ్ వ‌ల్ల దర‌ఖాస్తు దారులు త‌మ స‌మ‌స్య‌ను తాసిల్దార్ వింటున్నారన్న సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో త‌మ వ‌ద్ద ఏమీ లేదు.. మీకు స‌మ‌స్య ఉంటే ధ‌ర‌ణిలో ద‌ర‌ఖాస్తు చేసుకోండి.. క‌లెక్ట‌ర్‌ను క‌లువండి అనే వాళ్లని, ఇప్పుడు స‌మ‌స్య చెప్పాలని కోరుతూ తాము చెప్పేది వింటున్నార‌ని రైతులు చెపుతున్నారు. దీంతో ప్ర‌భుత్వం త‌మ‌కు న్యాయం చేస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని రైతులు వ్య‌క్తం చేస్తున్నార‌ని ధ‌ర‌ణి క‌మిటీ స‌భ్యులు చెప్పారు.

మనుగోడులో 210 సమస్యలకు రిపోర్ట్‌ రెడీ

మునుగోడు మండ‌లంలో ధ‌ర‌ణిలో281 ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉండ‌గా, 210 ద‌ర‌ఖాస్తుల‌కు రిపోర్ట్ త‌యారైంద‌ని ఈ మేర‌కు వాటిని ప‌రిశీలించామ‌ని ధ‌ర‌ణి క‌మిటి స‌భ్యులు సునీల్ తెలిపారు. ఇందులో టీఎం-33 మాడ్యూల్ కింద ద‌ర‌ఖాస్తు చేసిన‌వి 100 ఉన్న‌య‌ని, పాస్‌పుస్త‌కాల డాటా క‌రెక్ష‌న్ మ‌రో వంద ఉన్నాయ‌న్నారు. ప్ర‌భుత్వం స్పెష‌ల్ డ్రైవ్‌లో టైమ్ బాండ్ పెట్ట‌డం వ‌ల్ల ఈ రిపోర్ట్‌లు త‌యార‌య్యాయని సునీల్ తెలిపారు. అయితే ధ‌ర‌ణిలో తాసిల్దార్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ఆప్ష‌న్స్ వ‌చ్చాయ‌ని, మ‌రో రెండు ఆప్ష‌న్స్‌కు రెండు రోజులో వ‌స్తాయ‌న్నారు. దీంతో చాలా స‌మ‌స్య‌లు పరిష్కారం అవుతాయంటున్నారు. స్పెష‌ల్‌ డ్రైవ్‌లో 15 రోజుల పాటు మూడు బృందాలు చేయ‌డం వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని అంటున్నారు. అయితే ఈ స్పెష‌ల్ డ్రైవ్‌లో కొత్త ద‌ర‌ఖాస్తులు తీసుకోవ‌డం లేదంటున్నారు. ధ‌ర‌ణిలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం అంటే ఆర్థికంగా భారంతో కూడుకున్న‌ద‌ని చెపుతున్నారు.

కాగా ధ‌ర‌ణి బ‌య‌ట ఈ మండ‌లంలో980 సాదాబైనామా, 200 పీ ఓటి కేసుల‌తో పాటు వైవాటి క‌బ్జాలు, ధ‌ర‌ణి టెక్నిక‌ల్ స‌మ‌స్య‌లు కూడా చాలా వ‌ర‌కు ఉన్నాయ‌ని ధ‌ర‌ణి క‌మిటీ గుర్తించింది. వీట‌న్నింటిపై ప్ర‌భుత్వానికి క్షేత్ర స్థాయి నివేదిక ఇవ్వ‌నున్న‌ట్లు ధ‌ర‌ణి క‌మిటీ సభ్యులు కోదండ‌రెడ్డి, భూమి సునీల్‌ తెలిపారు.