Dharani Part-3 | ద‌డ పుట్టిస్తున్న ధ‌ర‌ణి.. నిస్సహాయులుగా రెవెన్యూ అధికారులు Part-3

Dharani Part-3 సబ్‌కమిటీ చేసిందేంటి? అంతా బాగుంటే ఉప సంఘమెందుకు? సబ్‌కమిటీ సూచనలను పరిగణించారా? సమగ్ర భూసర్వే చేస్తామన్న ప్రభుత్వం కొన్ని చోట్ల పైలట్‌ ప్రాజెక్టులతో సరి.. రికార్డుల ప్రక్షాళనలో కష్టించిన ఉద్యోగులు ఆనాడు ప్రశంసలు కురిపించిన ప్రభుత్వం నేడు ధరణి సమస్యలు వారిపై నెట్టేసే యత్నం నిస్సహాయులుగా రెవెన్యూ అధికారులు అటకెక్కిన ధరణి పర్యవేక్షణ వ్యవస్థ బూడిద సుధాక‌ర్‌, విధాత, హైద‌రాబాద్ ప్రతినిధి: విధాత‌: తెలంగాణ రైతాంగం ధరణి ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించడానికి […]

Dharani Part-3 | ద‌డ పుట్టిస్తున్న ధ‌ర‌ణి.. నిస్సహాయులుగా రెవెన్యూ అధికారులు Part-3

Dharani Part-3

  • సబ్‌కమిటీ చేసిందేంటి?
  • అంతా బాగుంటే ఉప సంఘమెందుకు?
  • సబ్‌కమిటీ సూచనలను పరిగణించారా?
  • సమగ్ర భూసర్వే చేస్తామన్న ప్రభుత్వం
  • కొన్ని చోట్ల పైలట్‌ ప్రాజెక్టులతో సరి..
  • రికార్డుల ప్రక్షాళనలో కష్టించిన ఉద్యోగులు
  • ఆనాడు ప్రశంసలు కురిపించిన ప్రభుత్వం
  • నేడు ధరణి సమస్యలు వారిపై నెట్టేసే యత్నం
  • నిస్సహాయులుగా రెవెన్యూ అధికారులు
  • అటకెక్కిన ధరణి పర్యవేక్షణ వ్యవస్థ

బూడిద సుధాక‌ర్‌, విధాత, హైద‌రాబాద్ ప్రతినిధి:

విధాత‌: తెలంగాణ రైతాంగం ధరణి ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించడానికి గ‌తంలో ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ధరణిలోని సమస్యల పరిష్కారానికి తీసుకురావాల్సిన మార్పులను ఈ కమిటీ సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

ధరణి అంతా బాగుందని, బాగా పని చేస్తుందని చెబుతున్న ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేసింది? ఈ కమిటీ ఏయే సూచనలు చేసింది? ఈ సూచనలను ప్రభుత్వం పాటించిందా? అనే విషయాలపై ప్రజల్లో ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి.

గ్రీవెన్స్ పై గోప్యత ఎందుకో?

ధరణి వెబ్‌సైట్‌లో భూసమస్యలపై అనేక దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని అకారణంగా తిరస్కరిస్తున్నారు. అసలు ధరణిలో భూసమస్యలపైన ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి? వాటిలో ఎన్ని పరిష్కరించారు ? తిరస్కరణకు కారణాలేంటి? వంటి వివరాలను ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచడం కూడా అనుమానాలకు తావిస్తున్నది.

సమగ్ర భూసర్వేకు మోక్షమెప్పుడో?

భూసమస్యల పరిష్కారానికి సమగ్ర భూ సర్వేనే మార్గమని 2017లో ప్రభుత్వం చెప్పింది. 100 రోజుల్లో తెలంగాణ అంతా ప్రతి ఇంచు భూమిని కొలిచేందుకు సమగ్ర భూసర్వే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత రెండుమూడు సార్లు భూసర్వే చేస్తామని చెప్పి పక్కన పెట్టేసింది.

జిల్లాకు ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొని సర్వే చేస్తున్నట్లు చెప్పింది. అసలు భూసర్వే ఎక్కడి వరకు వచ్చింది? పైలట్ ప్రాజెక్టు పూర్తయ్యిందా? ఎన్ని గ్రామాల్లో సర్వే చేశారు? అనే విషయాల్లో ఏ మాత్రం స్పష్టత లేదని పలువురు భూ రికార్డుల నిపుణులు చెబుతున్నారు.

శత్రువులుగా మారిన ఉద్యోగులు

భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రాత్రింబవళ్లు రెవెన్యూ ఉద్యోగులు కష్టపడ్డారని గ‌తంలో ప్రభుత్వం మెచ్చుకుంది. వీరి కష్టానికి ప్రతిఫలంగా ఒక నెల జీతాన్ని బోన‌స్‌గా కూడా ఇచ్చింది. అక్కడి వరకు రెవెన్యూ ఉద్యోగులు మంచి వారని చెప్పిన ప్రభుత్వానికి ధరణి వెబ్‌సైట్‌ వచ్చాక శత్రువులుగా కనిపించారన్న విమర్శలు ఉన్నాయి.

ధరణిలో లోపాలు బయటపడకుండా, భూసమస్యలకు రెవెన్యూ ఉద్యోగులే కారణమనే నెపాన్ని వారిపైకి నెట్టేయాలనుకుంటున్నారని పలువురు రెవెన్యూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించే అధికారాలు ఇవ్వకుండా ప్రజల్లో వారిని శత్రువులుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారాలు దూరం చేసి రెవెన్యూ అధికారులను ప్రభుత్వం నిస్సహాయులుగా మార్చిందని అంటున్నారు.

క్షేత్రస్థాయిలో వీఆర్ఏ లు ల్యాండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ లుగా, భూ రికార్డుల నిర్వహణ అధికారిగా ఉండేవారు. కానీ నేడు ఆ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. దానికి సమాంతరంగా మరో వ్యవస్థను నిర్మించడంలో పూర్తిగా విఫలమైందని అంటున్నారు. కానీ తన తప్పును కప్పిపెడుతూ తాజాగా వీఆర్ఎలను కూడా ఇతర శాఖలలో మెర్జ్ చేశారని చెబుతున్నారు.

అటకెక్కిన ధరణి పర్యవేక్షణ వ్యవస్థ..

ధరణి వెబ్‌సైట్‌ ద్వారా భూసమస్యలు పరిష్కరించాలని రైతులు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. కానీ ఆ దరఖాస్తులపై జవాబుదారీతనం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల వద్ద ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని పరిష్కారమవుతున్నాయి? ఇవన్నీ పర్యవేక్షించే వ్యవస్థ లేనే లేదని చెబుతున్నారు.

భూ రికార్డులలో ఏమైనా తప్పులు దొర్లితే గతంలో రెవెన్యూ అధికారులే సరి చేసేవారు. ఒకస్థాయిలో కాకున్నా మరో స్థాయిలో ఏ విధమైన సమస్య ఉన్నా పరిష్కారం లభించేది. ధరణి వచ్చాక ఏ ఒక్క‌ అధికారికీ సమస్యలను పరిష్కరించే అధికారం లేకుండా చేయడంతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు