Dharani | ధరణి చిక్కులు.. ఊరికో వంద!
Dharani అపరిష్కృతంగా 15 లక్షల సమస్యలు ధరణి వెబ్ పోర్టల్ డ్యాష్ బోర్డు ఎక్కడ? సీఎం సొంత జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ములుగు గ్రామంలో 173 సమస్యలు అధికారాన్ని రెవెన్యూ నుంచి తీశారు సరే.. మరి సమస్యల పరిష్కారానికి దారేది? ఆఫీసుల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు అయినా సమస్యకు దొరకని పరిష్కారం (విధాత న్యూస్ నెట్‌వర్క్) ధరణి ఆ పేరు వింటేనే సగటు రైతు గడగడ లాడుతున్నాడు. భూమికి లేని సమస్యలు సృష్టించిందని వాపోతున్నాడు. పట్టా భూములు […]

Dharani
- అపరిష్కృతంగా 15 లక్షల సమస్యలు
- ధరణి వెబ్ పోర్టల్ డ్యాష్ బోర్డు ఎక్కడ?
- సీఎం సొంత జిల్లాలో పైలట్ ప్రాజెక్టు
- ములుగు గ్రామంలో 173 సమస్యలు
- అధికారాన్ని రెవెన్యూ నుంచి తీశారు సరే..
- మరి సమస్యల పరిష్కారానికి దారేది?
- ఆఫీసుల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
- అయినా సమస్యకు దొరకని పరిష్కారం
(విధాత న్యూస్ నెట్‌వర్క్)
ధరణి ఆ పేరు వింటేనే సగటు రైతు గడగడ లాడుతున్నాడు. భూమికి లేని సమస్యలు సృష్టించిందని వాపోతున్నాడు. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా మారాయని, నిషేధిత జాబితాలో చేరాయని, విస్తీర్ణం తప్పుగా పడిందని, ఒకరి భూమి ఇంకొకరి పేరున పడిందని, ఇలా ఒక్కటేమిటి వందల మంది అనేక రకాల సమస్యలను ఏకరువు పెడుతున్నారు. భూ పరిపాలనలో పారదర్శకం అని చెబుతున్న సర్కారు ధరణికి డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ధరణిలో భూమి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ధరఖాస్తులు వచ్చాయి? పరిష్కారమైనవి ఎన్ని? తిరస్కరణకు గురైనవి ఎన్ని? పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయి? ఇలాగే జిల్లాలవారీగా ఉన్న వివరాలు తెలిపే విధంగా ధరణి డ్యాష్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదన్న సందేహాలు కూడా వెలువడుతున్నాయి.
ధరణి ద్వారా ‘బ్రోకర్లు లేని వ్యవస్థ’ను తీసుకొచ్చామని, రైతుల చేతుల్లోనే రికార్డు ఉన్నదని చెబుతున్న సర్కారు.. వచ్చిన సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదన్న చర్చ రైతుల్లో జరుగుతున్నది.
సీఎం సొంత నియోజకవర్గంలోనే…
భూ పరిపాలనలో అవినీతికి తావులేకుండా ధరణిని తీసుకొచ్చామని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా, ప్రతి గ్రామానికి వందకు పైగా ధరణిలో భూమి సమస్యలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ధరణిలో సమస్యలపై ఏకంగా సీసీఎల్‌ఏను హైకోర్టు న్యాయమూర్తి బోనులో నిలబెట్టిన ఉదంతం అందరికీ తెలిసిందే. ధరణిలో లోపాలున్నాయని పెద్ద ఎత్తున అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే సీఎం కేసీఆర్ వద్ద చెప్పుకొన్నారని సమాచారం.
మంత్రులు చెప్పినా మొదట పట్టించుకోని సీఎం కేసీఆర్.. చిట్ట చివరకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే సిద్దిపేట జిల్లా, సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోని ములుగు మండల కేంద్రాన్ని శాంపిల్‌గా తీసుకొని సమస్యలపై సబ్‌కమిటీ అధ్యయనం చేసింది. ములుగు మండల కేంద్రానికి మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆనాడు సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించారు.
ఆనాడు 173 సమస్యలు గుర్తించారు. వాటిలో కొన్నింటిని పరిష్కరించడానికి మాడ్యూల్ కూడా లేదు. తమ గ్రామంలో ఫౌతి, వారసత్వ సమస్యలు తప్ప, మిగిలిన సమస్యలు నేటికీ పరిష్కరించలేదని స్థానికులు వాపోతున్నారు. ఈ గ్రామంలో ఒకరి భూమికి ఇంకొకరి పేరు పడిన కేసులు చాలా ఉన్నాయని, వాటిని ఇప్పటికి కూడా పరిష్కరించలేదని చెబుతున్నారు.
సమస్యల పుట్ట ‘ధరణి’
భూ పరిపాలనలో పారదర్శకత కోసం, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో భూ క్రయవిక్రయాలు నిర్వహించే విధంగా తీసుకు వచ్చిన ధరణి పోర్టల్.. సమస్యలకు నిలయంగా మారింది. ఒక్కో రెవెన్యూ గ్రామంలో ధరణిలో భూమిమి సమస్యలు 150 నుంచి 200 మధ్య ఉంటాయని ఇటీవల భూ సమస్యలపై అధ్యయనం చేసిన లీఫ్ సంస్థ తెలిపింది. ఈ లెక్కన రాష్ట్రంలో 11894 రెవెన్యూ గ్రామాలున్నాయని, సమస్యలు 10 నుంచి 15 లక్షల వరకు ఉండవచ్చునని అంచనా వేసినట్లు పేర్కొన్నది.
అయితే వివిధ ప్రసార మధ్యమాల ద్వారా వచ్చిన ప్రకటనలు పరిశీలిస్తే ధరణి అస్తవ్యస్తంగా ఉన్నదని అర్థం అవుతున్నదని ఈ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఒకసారి 5 లక్షలు, మరోసారి 7 లక్షలు, ఇంకోసారి 10 లక్షలు.. ఇలా చెబుతన్నారని ఆయన తెలిపారు. వాస్తవంగా ఏ సమస్య అయినా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పరిష్కారమయ్యాయి? అనేది కలెక్టర్, శాఖాధిపతుల డ్యాష్‌డోర్డులపై ఉండాలి.
ఇవన్నీ వెబ్‌సైట్‌లో లభ్యం కావాలి. కానీ దీనికి భిన్నంగా భూమి సమస్యలకు చెందిన సమాచారం ఎక్కడా కనిపించదని, అధికారులు కూడా చెప్పరని రైతు సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఇటీవల భూమి సమస్యలపై జరిగిన ఒక సమావేశంలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 లక్షల వరకు భూమి సమస్యలు ఉండే అవకాశం ఉన్నదని చెప్పడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది.
సమస్యలు ఏమిటంటే…
ధరణిలో భూ సమస్యలు లక్షల్లో ఉన్నాయని తెలుస్తున్నది. ప్రధానంగా 5 లక్షల సర్వే నంబర్లు, 15 లక్షల సర్వే సబ్ డివిజన్ నంబర్లకు చెందిన భూములలో తప్పున్నాయని ఈ సమస్యలపై అధ్యయనం చేసిన నిపుణులు పేర్కొంటున్నారు. చాలా పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని అంటున్నారు. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, లావణి పట్టాలుగా, పట్టాదారుల పేర్లు తప్పుగా నమోదుకావడం, సర్వే నంబర్లు, విస్తీర్ణంలో తప్పులు, ఒకరి పేరుపై పట్టా ఉంటే మరొకరి పేరు రికార్డులకు ఎక్కడం వంటి సమస్యలున్నాయని రైతులు చెబుతున్నారు.
ధరణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలియని వారు చాలామందే ఉన్నారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 52 వేలకు పైగా పరిష్కారం కాని ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తున్నది.
తప్పుల సవరణకు ప్రదక్షిణలు
తప్పుగా నమోదైన తమ రికార్డులను సరి చేసుకోవడానికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రెండు, మూడు సంవత్సరాల తిరిగినప్పటికీ కొంతమందికి సమస్య పరిష్కారం కాలేదు. రికార్డుల్లో తప్పులను సరిచేసే ఆప్షన్ స్థానిక రెవెన్యూ కార్యాలయాల్లో లేకపోవడంతో రైతులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారు. తప్పుల సవరణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ పరిష్కరించకపోవడంతో రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగడంతోనే సరిపోతున్నది.
ఏదైనా భూమికి సంబంధించిన సర్వే నంబర్ బదులు పొరపాటుగా ఇతర నంబర్ నమోదై, నిషేధిత జాబితాలో పడితే దానిని సరి చేయడానికి ఎమ్మార్వోల వద్ద ఆప్షన్ లేదు. దీంతో ఎంతోమంది రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధరణికి దళారులే…
మెదక్ జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు ధరణి రాకముందు రెవెన్యూ రికార్డుల్లో 33 గుంటల భూమి ఉండగా ధరణిలో మాత్రం 15 గుంటల భూమిగా చూపిస్తున్నది. మిగతా 18 గుంటల భూమిని ధరణిలో నమోదు చేయాలని మూడేండ్లుగా రెవెన్యూ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేదు. ధరణి బాధితుల అవసరాన్ని అసరాగా చేసుకొని రంగంలోకి దిగుతున్న బ్రోకర్లు.. ఒక్కో రైతు నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
‘ఇక్కడ మీ పని కాదు. హైదరాబాద్‌లోని సీసీఎల్ఏలో చేయస్తాం’ అని చెబుతూ.. దందా చేస్తున్నారని అంటున్నారు. దళారులు, లంచగొండి అధికారులు పనులు చేయిస్తామని చెప్పి డబ్బు తీసుకొని, సమస్యలు పరిష్కరించకుండా ఇబ్బందులు పెట్టడంతో మెదక్ జిల్లాలో అదనపు కలెక్టర్ నగేష్ నుండి మొదలుకొని ఉమ్మడి జిల్లాలో అదనపు తాసిల్దార్లు, ధరణి ఆపరేటర్లు ఏసీబీ అధికారులకు చిక్కి కటకటాల పాలైన సందర్భాలు ఉన్నాయి.
జిల్లా సర్వేయర్ ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ గంగయ్యను సైతం రైతులు ఏసీబీ అధికారులకు పట్టించారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలో ధరణిలోని తప్పును ఆధారంగా చేసుకొని ఒకరి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో అసలు భూమి కలిగిన రైతు సంగారెడ్డి కలెక్టర్ శరత్‌కు ఫిర్యాదు చేశారు. దానినిపై విచారించి, తాసిల్దార్ రాజయ్యను సస్పెండ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి.
జనగామలో…
కొద్దినెలల క్రితం జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు, అతని భార్య తమ భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ జనగామ కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ పైకెక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో ముప్పు తప్పింది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
కట్టిన డబ్బు తిరిగి రాదు!
ధరణిలో భూముల రిజిస్ట్రేషన్‌కు డబ్బు చెల్లించి, స్లాట్ బుక్ చేస్తే.. అనివార్య కారణాల పట్టా చేసుకోకపోతే డబ్బులు తిరిగి రావడం లేదు. మంచిర్యాల జిల్లాలో విరాసత్ 533, పెండింగ్ మ్యుటేషన్ 220, నాలా కోసం 364, సవరణలకు సంబంధించి 2090, నిషేధిత జాబితాలో నుండి తొలగించాలని 601 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 3600 వరకు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.
ధరణి సమస్యలతో దద్దరిల్లుతున్న ‘ప్రజావాణి’
జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కి ధరణి సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. వందల మంది వచ్చి, సమస్యలు చెప్పుకొన్నా పరిష్కారం కావడం లేదని బాధిత రైతులు పేర్కొంటున్నారు. ధరణిలో అనువంశికంగా వారసులకు వస్తున్న సర్వే నంబర్లలో తప్పులు ఉండటం, అన్నదమ్ములు, ఇతర పాలివాళ్ళతో.. అన్నదమ్ముల పిల్లలకు రావలసిన పట్టా భూములలో పలు సమస్యలు ఉంటే ధరణి పోర్టల్‌లో ఆప్షన్ లేక సంవత్సరాలుగా తాసిల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్నా, సమస్యలు పరిష్కారం కావడం లేదు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌లో భూ సంబంధిత, ముఖ్యంగా ధరణి సమస్యలపై ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో జిల్లాలో 40 నుంచి 65 వరకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ లెక్కన పరిశీలిస్తే ఒక్కో జిల్లాలో నెలకు 150 నుంచి 200 ఫిర్యాదులు వస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో ధరణి దరఖాస్తులు 16000 వస్తే.. 3000 పరిష్కారం అయ్యయని సమాచారం.
ఎన్నారై రైతులకు తప్పని తిప్పలు..
ఎన్నారైల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. ఎన్నారై రైతులకు పట్టా పాస్‌బుక్‌లు ఉన్నప్పటికీ వారి వారసులకు జీపీఏ చేయించుకుందామని ప్రయత్నిస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి. 3 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పటికీ తాసిల్దార్ నుంచి కలెక్టర్‌కు రిపోర్డు రావాలనే నిబంధన ఉన్నది. దీని ప్రకారం ఎలా రిపోర్ట్ పంపాలో తాసిల్దార్‌కు కూడా సరైన గైడెన్స్ లేకపోవడంతో ఎన్నారై రైతుల పాట్లు అన్నీ ఇన్నీ కావు.
కొందరు ఎన్నారై రైతుల భూములు జీరో (0) ఖాతాలో పడడంతో వారీ బాధలు వర్ణనాతీతం. స్వయంగా కలెక్టర్ పట్టించుకుంటే తప్ప వాటి సమస్య పరిష్కారం కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. లేదంటే అధికార పార్టీ నాయకుల అండ ఉండాలని అంటున్నారు.
అమ్మపేరిట ఉన్న 20 గుంటల కోసం..
మా అమ్మ పేరు మీద ఉన్న 20 గుంటల భూమి ఇతరుల పేరు మీద ధరణిలో ఎక్కింది. ఇది మార్చమని ఎన్నోసార్లు తాసిల్దార్కు, ఆర్డీవోకు విన్నవించుకున్న. అయినా పరిష్కారం కాలేదు. ఇది తరతరాలుగా వస్తున్న భూమి. ధరణిలో సైతం ముందుగా అమ్మ పేరే ఉంది. సర్వే నంబర్ 75లో ఉన్న 20 గుంటల భూమి ఇతరుల పేరు మీద పడింది. ఇది వాళ్ళు కూడా ఒప్పుకొంటున్నారు. కానీ ధరణిలో తాసిల్దార్లకు ఆప్షన్ లేకపోవడంతో రైతులకు ఏవో కారణాలు చెప్పి తిప్పి పంపుతున్నారు. ఇది తెలియక దాదాపు ఐదారువేలు ఖర్చు చేసుకుని మీ సేవ, ఇతర కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కబ్జాలో నేనే ఉన్నా. కానీ రికార్డు పరంగా లేదు. దాంతో రైతుబంధు అందటం లేదు. ఇప్పటికైనా అధికారులు నా సమస్యను పరిష్కరించాలి.
– పల్లె నర్సింహులు, మెదక్ మండలం శివాయపల్లి
ఇప్పడేమీ తెలుస్తల్లేదు
ఇంతకుముందు రెవిన్యూ రికార్డులో మార్పులు జరిగితే తెలిసేది. ఇప్పుడు మార్చింది తప్పితే, పాతది తిరిగి చూడలేము. తెలుసుకోలేము. వరంగల్ నగర పరిధిలో ధరణి సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. భూముల ధరలు పెరగడం ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకపోవడం, రికార్డుల్లో మార్పు జరగకపోవడంతో ధరణి కారణంగా దశాబ్దాల క్రితం పట్టేదారుగా ఉన్న వ్యక్తుల పేర్లు తిరిగి రికార్డుల్లోకి వచ్చాయి. ప్రస్తుతం స్వాధీనంలో ఉన్న రైతులు సమస్యల పాలవుతున్నారు. తమ భూమి ఇతరుల పేరుపై ఉందంటూ ఆందోళన చెందుతున్నారు.
– బీరం రాములు, రైతు ప్రతినిధి