మంత్రికే రక్షణ లేదు.. సామాన్యుల పరిస్థితేంటి.. ప్రభుత్వానికి ఆర్జీవీ సూటి ప్రశ్న

  • Publish Date - September 30, 2023 / 10:10 AM IST

విధాత‌: రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారని, పలు సామాజిక, రాజకీయ అంశాలపట్ల తక్షణం స్పందిస్తూ ట్వీట్స్ వేస్తుంటారని అందరికీ తెలిసిందే. అయన జగన్ బయో పిక్చర్ ను వ్యూహం పేరిట తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా టీజర్లు రిలీజై మంచి రేటింగ్ అందుకున్నాయి.


ఇక అయన మొదటినుంచీ చంద్రబాబు, లోకేష్ ఇంకా తెలుగుదేశం పార్టీని, నాయకులను వెక్కిరిస్తూ పోస్టులు పెట్టడం కూడా అందరికీ తెలిసిందే.. అయితే ఆయన ఇప్పుడు మాత్రం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టారు. అందులో అసలు ఆంధ్రాలో ప్రభుత్వం ఉందా లేదా అని సందేహం వ్యక్తం చేశారు. ఒక మహిళా మంత్రికే ఇంతటి అవమానం జరిగితే మామూలు మహిళల భద్రత ఎలా ఉంటుందో అంటూ సందేహం వ్యక్తం చేశారు.


అసలేం జరిగిందంటే విశాఖ జిల్లాకు చెందిన మాజీ టిడిపిమంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనే నాయకుడు పర్యాటక మంత్రి రోజా మీద రాయలేని భాషలో ఆరోపణలు చేశారు. ఆమె భువనేశ్వరిని, బ్రహ్మణిని విమర్శించారు అనే దుగ్ధతో ఉన్న బండారు నోరేసుకుని రోజామీద పడిపోయారు. ఆమె వ్యక్తిగత విషయాలను సైతం ప్రస్తావిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీనికి వైసిపి నుంచి సోషల్ మీడియాలో కౌంటర్లు వస్తున్నాయి కానీ ప్రభుత్వపరంగా చర్యలేమి తీసుకోలేదు.


దీంతో ఆర్జీవీ ట్విట్టర్లో స్పందించారు. ఒక మహిళా మంత్రికి ఇలాంటి అవమానాలు ఎదురవుతుంటే మామూలు మహిళల సంగతి ఏమిటి ? వాళ్ళ గతి ఏమిటి అని ప్రశ్నిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మను సైతం ట్యాగ్ చేసి ఆయన ప్రశ్నల పరంపర కొనసాగించారు.


ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా ? ఉంటే ఇలాంటివాళ్లను ఏమీ అనకుండా .. చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. మొత్తానికి ఆర్జీవీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.