Bharat |
విధాత: ఒక పక్క దేశం పేరును ఇండియా నుంచి భారత్ కు మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్షాలు ప్రభుత్వ చర్యను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిని ఎదుర్కొనలేకనే ప్రభుత్వం ఈ చర్యకు పూనుకొందని, దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చను పక్కదోవ పట్టించడానికే ఈ ప్రయత్నమని ఘాటుగా విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఒక దేశం పేరును మార్చడం వలన ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే చర్చ కూడా మరో వైపు నడుస్తోంది.
14వేల కోట్ల పైనే!
దేశం పేరును ఇండియా నుంచి భారత్ కు మార్చడం వలన కేంద్ర ప్రభుత్వానికి రానున్న 6 నెలల కాలంలో రూ.14,000 కోట్లకు పైగా భారం పడుతుందని ఔట్ లుక్ పత్రిక అంచనా వేసింది. దీనికి దక్షిణాఫ్రికాకు చెందిన మేధో హక్కుల న్యాయవాది డారెన్ ఓలివియర్ ఉపయోగించిన సూత్రాన్ని ఆధారంగా చేసుకుని లెక్కలు కట్టింది.
డారెన్ ఓలివియర్ సూత్రం ప్రకారం ఒక కార్పొరేట్ సంస్థ తన బ్రాండ్‌ను మార్కెట్ చేసుకోవడానికి చేసుకునే వ్యయం దాని మొత్తం రాబడిలో 6 శాతం ఉంటుంది. అయితే అదే సంస్థ తన బ్రాండ్‌ను మార్చుకుని, ఆ కొత్త బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసుకోవడానికి తన మొత్తం రాబడిలో 10% వ్యయం చేయవలసి ఉంటుంది.
అలాగే ఒక దేశం పేరు మార్పు విషయంలో కూడా ఇలానే జరుగుతుందని ఆయన నిరూపించారు. గతంలో ఆఫ్రికా ఖండంలోని స్వాజిలాండ్ అనే దేశం తన పేరును ఇస్వాతినిగా మార్చుకుంది. కొత్త పేరును ప్రచారం చేసుకోవడానికి ఆ దేశానికి రూ.500 కోట్ల వరకు ఖర్చయినట్లు ఆయన పేర్కొన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రాబడిని రూ.23 లక్షల 84 వేల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. అందువల్ల ఓలివియర్ నమూనా ప్రకారం రానున్న ఆరు నెలల్లో ఇండియా పేరును భారత్ గా రీ బ్రాండింగ్ చేయడానికి రూ.14,304 కోట్లు ఖర్చు కానుంది. ఇది భారతదేశం ప్రతి నెలా ఆహార సబ్సిడీపై చేసే వ్యయం కంటే ఎక్కువ కావడం గమనార్హం.