తెలుగు సినిమా పరిశ్రమ (Tollywood) విషయానికి వస్తే కరోనాకు ముందు కరోనా తరువాత అని విభజించుకోవాల్సి వస్తుంది. కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీల హవా మొదలయ్యింది. ఇలా నిర్మాతలకు అదనపు ఆదాయ మార్గాలు లభించాయి. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, యూట్యూబ్ వ్యూస్, లిరికల్ వీడియోలు, పాటలు, ట్రైలర్స్, టీజర్ల వ్యూస్ దగ్గర నుంచి అన్ని విధాలుగా నిర్మాతలు ఆదాయ మార్గాలను పెంచుకున్నారు.
ఇక సినిమా బాగుంటే థియేట్రికల్ రెవిన్యూను కూడా సినిమాలు బాగానే వసూలు చేస్తున్నాయి. దాంతో మన హీరోలు టాలీవుడ్ మాట పక్కన పెట్టి ఏకంగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో కంటెంట్లను ఎంచుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా తమ కష్టానికి, స్టార్డంకు తగ్గ ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రం అంటే ఎంతో కష్టపడాలి. దానికి వారి స్టార్డం కూడా ఉపయోగపడుతుంది. తమకు తగిన పారితోషం అందాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా రోజు రోజుకు హీరోల పారితోషకం భారీగా పెరిగిపోతుంది. ఇక ప్రస్తుతం పారితోషికాల విషయానికి వస్తే గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య చిత్రాలు కోసం మెగాస్టార్ చిరంజీవి 50 కోట్లు వసూలు చేశాడట. రవితేజకు ఇందులో 18 కోట్లు ఇచ్చారట. ఇకపై తన చిత్రాలకు ఆయన 20 కోట్లకు పైగా డిమాండ్ చేయబోతున్నారు. వచ్చిన నిర్మాతలకు ఆ విషయం స్పష్టం చేస్తున్నారు.
బాలకృష్ణ రేంజ్ కూడా అఖండతో పెరిగిపోయింది. ఆయన వీరసింహారెడ్డికి భారీ మొత్తంలోనే తీసుకున్నారు. అనిల్ రావిపూడి సినిమాకు 12 కోట్లకు ఓకే చేశారు. ఎఫ్ 3 తో నవ్వులు పూయించిన విక్టరీ వెంకటేష్ ఆ సినిమాకు ఎనిమిది కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ సినిమాకు 12 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం.
కానీ నాగార్జున పారితోషకం పై క్లారిటీ లేదు. ఇక మీడియం రేంజ్ హీరో నాని 20 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 25 కోట్లు అడుగుతున్నారు. కార్తికేయ 2తో సూపర్ హిట్టు అందుకున్న నిఖిల్ ఇకపై ఏడు కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.
నాగశౌర్య నాలుగు కోట్లు తీసుకుంటున్నారు. మరి ఈ రెమ్యూనరేషన్ల విషయంలో నిజం ఎంతో తెలియదు గాని ఈ వివరాలు మాత్రం కథనాలుగా ప్రచురితం అవుతూ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.ఇవే విషయాలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి.