విధాత: తన ప్రేమకు అడ్డు పడుతున్న తండ్రిని ప్రియుడితో హత్య చేయించింది ఓ కూతురు. ఈ హత్యకు ఆమె తల్లి కూడా సహకరించింది. దృశ్యం సినిమా పది సార్లు చూసిన తర్వాత ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితులు తెలిపారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెళగావిలో సెప్టెంబర్ 17వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సుధీర్ కాంబ్లే(57), రోహిణి దంపతులకు స్నేహ(25) అనే కుమార్తె ఉంది. దుబాయిలో పని చేస్తున్న సుధీర్ గత రెండేండ్ల క్రితం బెళగావికి వచ్చి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. స్నేహ పుణెలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోంది. ఈ క్రమంలో ఆమె తన క్లాస్‌మేట్ అక్షయ్ విఠకర్‌తో ప్రేమలో పడింది.
ఇటీవల పుణె నుంచి తన ఇంటికి తిరిగొచ్చిన స్నేహ తన ప్రేమ విషయం సుధీర్‌కు తెలిసింది. అయితే చదువుపై దృష్టి సారించాలని తండ్రి ఆమెను మందలించాడు. దీంతో తండ్రిపై కక్ష పెంచుకున్న స్నేహ తల్లి రోహణికి తండ్రి మందలించిన విషయాన్ని చెప్పింది. ఎలాగైనా తన తండ్రిని చంపాలని తల్లికి, ప్రియుడికి చెప్పింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి దృశ్యం సినిమాను పది సార్లు చూశారు. సమయం కోసం వేచి చూశారు.
ఇక సెప్టెంబర్ 17వ తేదీన సుధీర్ తన ఇంటిలోని పై అంతస్తులో పడుకున్నారు. అదే రోజు పుణె నుంచి అక్షయ్‌ను బెళగావికి రప్పించారు. ముగ్గురు కలిసి పై అంతస్తులోని వెళ్లారు. తల్లీ, కుమార్తె సుధీర్ కాళ్లు చేతులు పట్టుకోగా, అక్షయ్ కత్తితో విచక్షణారహితంగా లెక్కలేనన్ని సార్లు పొడిచి చంపాడు. ఇక ప్రాణాలు కోల్పోయాడని ముగ్గురు నిర్ధారించుకున్న తర్వాత, అక్షయ్ అదే రోజు పుణె వెళ్లిపోయాడు.
ఏమీ తెలియనట్లు తన భర్తను ఎవరో చంపారని రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల్లీకుమార్తెను పోలీసులు విచారిచంగా, ఇద్దరూ ఒకే సమాధానం చెబుతున్నారు. అనుమానం వచ్చి స్నేహ ఫోల్ కాల్ డేటాను పరిశీలించారు. అక్షయ్‌తో అధికంగా మాట్లాడినట్లు తేలింది. ముగ్గురిని విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.