Eatala Rajender, Dharani
విధాత బ్యూరో, కరీంనగర్: ధరణి వల్ల సమస్యలు తీరకపోగా, బ్రోకర్లు బాగుపడుతున్నారని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ‘ధరణిలో జరిగిన అక్రమాలను సరి చేయాలంటే.. తమ చిన్న జిల్లాకే రెండు సంవత్సరాల సమయం పడుతుందని’ వికారాబాద్ కలెక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి అనాలోచిత, మూర్ఖపు నిర్ణయాల వల్ల రూపుదిద్దుకున్న ధరణి పోర్టల్ రాష్ట్రంలో లక్షల మంది రైతులకు నష్టం చేకూర్చిందన్నారు. లావోణి పట్టాలు కలిగిన దళితులు, ఎక్సాల్, అసైన్మెంట్ పట్టాలు కలిగిన పేదలకు ఇంతవరకు ఎక్కడ పాసు పుస్తకాలు అందిన దాఖలాలు లేవు అన్నారు. ఈ కారణంగా వారికి రైతుబంధు, రైతు బీమా పథకాలు వర్తించడం లేదన్నారు.
ధరణి లోటుపాట్లపై అనేకసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయిన భూ యజమానులు
పురుగుల మందు డబ్బాలు పట్టుకొని తాగే పరిస్థితి వచ్చింది అన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసి చేతులు దులుపుకోకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకుని ధరణి కారణంగా నష్టపోయిన రైతులకు క్షమాపణలు చెప్పి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.