ఆ గ్రామంలో ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం.. ఓటు వేయ‌క‌పోతే రూ. 51 జ‌రిమానా

Gujarat Assembly Elections | ఎన్నిక‌లు వ‌చ్చాయంటే చాలు.. రాజ‌కీయ నాయ‌కులు గ్రామాల్లో వాలిపోతుంటారు. ప్ర‌చారం జోరుగా చేస్తారు. డ‌బ్బులు, మ‌ద్యం విరివిగా పంచి ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు య‌త్నిస్తుంటారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాల‌కు, తండాల‌కు వెళ్లి.. హామీల వ‌ర్షం కురిపిస్తుంటారు. గెలిచిన త‌ర్వాత ఆ వైపు కూడా క‌న్నెత్తి చూడ‌రు రాజ‌కీయ నాయ‌కులు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరం. ఏకంగా ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధించారు ఆ గ్రామ ప్ర‌జ‌లు. […]

  • Publish Date - November 29, 2022 / 04:40 AM IST

Gujarat Assembly Elections | ఎన్నిక‌లు వ‌చ్చాయంటే చాలు.. రాజ‌కీయ నాయ‌కులు గ్రామాల్లో వాలిపోతుంటారు. ప్ర‌చారం జోరుగా చేస్తారు. డ‌బ్బులు, మ‌ద్యం విరివిగా పంచి ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు య‌త్నిస్తుంటారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాల‌కు, తండాల‌కు వెళ్లి.. హామీల వ‌ర్షం కురిపిస్తుంటారు. గెలిచిన త‌ర్వాత ఆ వైపు కూడా క‌న్నెత్తి చూడ‌రు రాజ‌కీయ నాయ‌కులు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరం. ఏకంగా ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధించారు ఆ గ్రామ ప్ర‌జ‌లు. అలాగ‌ని వారు ఎన్నిక‌ల‌కు వ్య‌తిరేక‌మేమీ కాదు.. ఓటు హ‌క్కు ఉన్న వారంతా ఓటు త‌ప్ప‌నిస‌రిగా వేయాల్సిందే. లేదంటే జ‌రిమానా క‌ట్టాల్సిందే. దాదాపు 40 ఏండ్ల నుంచి ఈ నిబంధనలను తూ.చా. తప్పకుండా అమలు చేస్తుంది ఆ గ్రామం. మ‌రి ఆ గ్రామం ఎక్క‌డుందని ఆలోచిస్తున్నారా..? అయితే గుజరాత్‌లోని రాజ్‌సమధియాల గ్రామానికి వెళ్లాల్సిందే.

రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్ స‌మధియాల గ్రామం ఒక ఆద‌ర్శ గ్రామంగా నిలిచింది. ఆ గ్రామంలో ఎక్క‌డ చూసిన బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తాయి. గ్రామానికి సంబంధించి అభివృద్ధి గురించి, ఏం ప‌నులు చేయాలి, ఏ ప‌నులు చేయ‌కూడ‌ద‌నే వంటి విష‌యాల‌ను బోర్డుల్లో రాసి ఉంచారు. మ‌రి ముఖ్యంగా ఈ గ్రామంలో ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధించారు. ఇది 1983 నుంచి అమ‌ల‌వుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉన్న‌ప్ప‌టికీ ఓటు మాత్రం త‌ప్పనిస‌రిగా వేయాలి. ఓటు వేయ‌క‌పోతే రూ. 51 జ‌రిమానా చెల్లించాల్సిందే.

ఇదొక్క‌టే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, ప్లాస్టిక్‌ పడేసినా, గుట్కా తిన్నా రూ.51 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మద్యం సేవించినా, చెట్లను నరికినా, కొట్టివేసినా, మూఢనమ్మకాలను ప్రోత్సహించడం, పటాకులు కాల్చినా రూ.500 చెల్లించాలి. ఇక తప్పుడు సాక్ష్యం, గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లించకపోవడం, భూములను ఆక్రమించడం, బహిరంగంగా ఎవరినైనా దూషించినా రూ.251 జరిమానా విధిస్తారు. ఈ మేరకు గ్రామం నడిబొడ్డున గ్రామంలో ఏమి చేయకూడదు, ఏం చేస్తే ఎంత జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక ఈ గ్రామంలో అన్ని ర‌కాల మౌలిక స‌దుపాయాలు క‌ల్పించారు. సుర‌క్షిత తాగునీరు ప్ర‌తి ఇంటికి అందుతుంది. భ‌ద్ర‌త దృష్ట్యా గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంట‌ర్నెట్ స‌దుపాయం క‌ల్పించ‌డంతో పాటు క్రికెట్ స్టేడియం కూడా ఏర్పాటు చేశారు.