నాలుగు రోజుల్లో ఎల‌క్ష‌న్ కోడ్.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కేటీఆర్ వ్యాఖ్య‌లు

నాలుగు రోజుల్లో ఎల‌క్ష‌న్ కోడ్.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కేటీఆర్ వ్యాఖ్య‌లు
  • ఈ ఎన్నికల్లోనూ బీఆరెస్‌దే గెలుపు
  • మళ్లీ కేసీఆర్‌ సీఎం అవడం ఖాయం
  • ఈసారి సిద్ధాంతాల మధ్యనే పోటీ
  • వికారాబాద్‌ సభలో మంత్రి కేటీఆర్‌
  • బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై తిట్ల పురాణం
  • సన్నాసి, వెధవ అంటూ దూషణలు
  • రేవంత్ రెడ్డి సంఘ్ మూలాల వ్యక్తి
  • ఎప్పటికైనా బీజేపీలోకే వెళ్తారు
  • తెలంగాణపై విషం కక్కుతున్న ఆర్ఎస్ఎస్
  • గుజరాతి డబ్బు తీసుకుని కార్ గుర్తుకు ఓటు వేయండి
  • తొమ్మిది ఏళ్ళు గడిచినా కృష్ణా నది లో నీళ్ల వాటా చెయ్యలే
  •  షాద్ నగర్ చుట్టూ ఓఆర్ఆర్.. కొత్తూరు వరకు మెట్రో రైలు



విధాత : రాష్ట్రంలో నాలుగు రోజుల్లో ఎలక్షన్‌ కోడ్‌ రాబోతున్నదని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ గురువారం ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. పోటీ క‌చ్చితంగా పార్టీలు, సిద్ధాంతాల మ‌ధ్య‌నే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రి వ‌ల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందో ఆలోచించాలని కోరారు.



‘ఇది ఉప ఎన్నిక కాదు.. సార్వ‌త్రిక ఎన్నిక‌. ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునే ఎన్నిక‌. ఎవ‌రు మ‌న ముఖ్య‌మంత్రి కావాలి? ఎవ‌రు ముఖ్య‌మంత్రి అయితే రైతులు పేద మ‌హిళ‌లు బాగుంటారు? ఎవరి పాలనలో విద్యావిధానం బాగుంటుంది. ఇవ‌న్నీ ఆలోచించి ఓటేయాల్సిన సంద‌ర్భం ఇది. ఆషామాషీగా ఓటేసే సంద‌ర్భం కాదు’ అని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులపై తిట్ల పురాణం అందుకున్నారు. ‘ఒక వైపేమో చావు నోట్లో త‌ల‌పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్. ఇంకో వైపేమో రాజీనామా చేయ‌మంటే పారిపోయిన స‌న్నాసి కిష‌న్ రెడ్డి. ఇంకో దిక్కు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ, థ‌ర్డ్ రేటు వెధ‌వ రేవంత్ రెడ్డి ఉన్నారు’ అన్నారు. వీళ్లు బీఆరెస్‌కు పోటీ కాదని చెప్పారు. ‘పోటీ అంటే స‌ముజ్జీల‌తో ఉంట‌ది. రాజకీయ మ‌ర‌గుజ్జుగాళ్ల‌తో కాదు. కేసీఆర్ ముంద‌ట వీళ్లు రాజ‌కీయ మ‌ర‌గుజ్జులు, పిగ్మీలు’ అని మండి పడ్డారు.



కాంగ్రెసోళ్ల‌కు, బీజేపోళ్ల‌కు హైక‌మాండ్ ఢిల్లీలో ఉంట‌ది. టికెట్ల పంచాయితీ, పైస‌ల వ‌సూళ్ల పంచాయితీ అంతా ఢిల్లీలోనే. మొనగాడు లాంటి కేసీఆర్‌ను ఇక్క‌డ పెట్టుకుని, ఈ అడ్డ‌మైన వెధ‌వ‌లు మ‌న‌కు అవ‌స‌ర‌మా? సీట్లు, ఓట్లు అమ్ముకునే కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు అవ‌స‌ర‌మా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీని ఢిల్లీకి త‌న్ని త‌రిమేయాల‌ని ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆరెస్‌ పార్టీ మతం పేరుతో, కులం పేరుతో ప్రజలను విభజించే పార్టీ కాదని అన్నారు.



తాము అందరినీ కలుపుకొని పోతామని చెప్పారు. ‘గ‌రీబోడు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఆయ‌న‌ను ఆదుకోవాల‌న్న‌దే మా దృక్ప‌థం త‌ప్ప‌.. ఇంకో ఆలోచ‌న లేనే లేదు. తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే.. దేవుడితోనైనా కొట్లాడ‌టానికి వెనుకాడ‌ని పార్టీ బీఆర్ఎస్ పార్టీ’ అని కేటీఆర్‌ చెప్పారు. 70 ఏండ్ల త‌ర్వాత ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నీళ్ల గోసను కేసీఆర్‌ తీర్చబోతున్నారని అన్నారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల ద్వారా కృష్ణా జ‌లాల‌ను ఇక్క‌డికి తీసుకొస్తామని చెప్పారు. ఇక్కడికి కృష్ణా జలాలు తీసుకురావాలని కాంగ్రెస్‌ ఎందుకు ఆలోచన చేయలేదని నిలదీశారు.

వచ్చే టర్మ్‌లో వికారాబాద్‌ అభివృద్ధి


‘మెతుకు ఆనంద్ కొన్ని కోరిక‌లు కోరిండు. కాక‌పోతే నాలుగు రోజుల్లో ఎల‌క్ష‌న్ కోడ్ వ‌స్తున్న‌ది. ఐటీ హ‌బ్ అడిగిండు. అనంత ప‌ద్మ‌నాభ స్వామి టెంపుల్‌ను డెవ‌ల‌ప్ చేయాలి. ప‌ర్యాట‌క క్షేత్రం చేయాల‌న్నాడు. క‌రోనా వ‌ల్ల కొద్దిగా ఈ ట‌ర్మ్‌లో స్లో అయ్యాం. వ‌చ్చే ట‌ర్మ్‌లో కారు జోరుగా ఉరుకుత‌ది. త‌ప్ప‌కుండా సార్ ముఖ్య‌మంత్రి అయిత‌డు. ఆనంద్ ఎమ్మెల్యే అయిత‌డు. మీ కోరిక మేర‌కు వికారాబాద్ అభివృద్ధి చేస్తాం’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మాల్లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో పాటు ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు పాల్గొన్నారు.




ఆర్ఎస్ఎస్ దేశానికి ప్రమాదకారి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశానికి ప్రమాదం. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి. ఎప్పటికైనా బీజేపీలోకే వెళ్తారు’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు త్రీవ ఆరోపణలు చేశారు. గురువారం షాద్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి కాంగ్రెస్, బీజేపీపై నిప్పులు చేరిగారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలలు కల్గిన వ్యక్తి అని అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి చెప్పారని, అలాంటి వ్యక్తికి టీపీసీసీ ఎలా ఇస్తారని, కాంగ్రెస్ నుంచి గెలిచినా బీజేపీలోకే వెళ్తారని సోనియాకు చెప్పారని కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లకు నిలువెల్లా విషం ఉంటుందని, అలాంటి మూలాలు ఉన్న వ్యక్తి టీపీపీసీ అయ్యారన్నారు. రేవంత్ రెడ్డి గాడ్సే కంటే ప్రమాదకరం అని, అలాంటి నాయకుడు తెలంగాణలో ఉండడం కాంగ్రెస్ పార్టీ చేసుకున్న దౌర్భాగ్యం అన్నారు.



తెలంగాణ ఎన్నికల్లో గుజరాతి వ్యక్తి అదానీకి చెందిన డబ్బులు పంచి ఓట్లు దండుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని, ఆ డబ్బులు తెలంగాణ ప్రజలు తీసుకుని కారు గుర్తుకు ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. బీఆరెస్ ఎవ్వరికీ బీ టీమ్ కాదని, కేవలం తెలంగాణ ప్రజలకు ‘ఏ’టీమ్ గా పనిచేస్తామన్నారు. అడ్డమైన కాంగ్రెస్, బీజేపీ లకు బీ టీమ్ గా ఉండాల్సిన అవసరం మాకు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ కలిసి మైనారిటీలకు వ్యతిరేకంగా పని చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని, ఇలాంటి కాంగ్రెస్ పార్టీని గంగలో కలపాలా? వద్దా అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. తొమ్మిదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, నేటికీ కృష్ణా నది నీటిలో తెలంగాణ వాటా తేల్చలేదన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు లో ఐదు జలాశయాల పనులు త్వరలో పూర్తిచేస్తామన్నారు. ఈ పనులు ఎప్పుడో పూర్తి అయ్యేవని, ఈ జిల్లాకు చెందిన నాగం జనార్ధన్ రెడ్డి అనే నాయకుడు ఈ ప్రాజెక్టుపై కోర్టులో కేసు వేసినందున ఆలస్యం అయిందని, మళ్ళీ వారే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఆరోపించడం ఎంతవరకు సమంజసం అని కేటీఆర్ ప్రశ్నించారు.


ఆ గట్టునుంటారా.. ఈ గట్టునుంటారా..


ఒక సినిమా ఉంది అదే రంగస్థలం.. ఈ సినిమాలో ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా అనే పాట ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్న. మీరు అటు కాంగ్రెస్, బీజేపీ రాబంధుల పార్టీ వైపు ఉంటారా? లేక ఈ గట్టున బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి వైపు ఉంటారా? అని కేటీఆర్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ కడుపులో గుద్ది నోట్లో పిప్పరమెంట్ పెడుతుందని, అది ఓ బేకార్ గార్ల పార్టీ అని, మీరు ఇలాంటి పార్టీ వైపు ఉంటారా? లేక ప్రజలను కడుపులో పెట్టుకుని చూసే బీఆర్ఎస్ వైపు ఉంటారా అని అన్నారు. షాద్ నగర్ మరింత అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఎమ్మెల్యే గా అంజయ్య యాదవ్ ను అధిక మెజారిటీ తో అసెంబ్లీ కి పంపాలని కేటీఆర్ కోరారు.

షాద్ నగర్ కు వరాలు


హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న షాద్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో దుసుకుపోతున్నదని ఈ సందర్బంగా కేటీఆర్ ఇక్కడి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పని తీరును కొనియాడారు. షాద్ నగర్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, కొత్తూరు వరకు మెట్రో రైల్ నడిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. అంతకు ముందు 1770 డబుల్ బెడ్ రూమ్ లు, డయాలసిస్ కేంద్రం, ట్రామా సెంటర్, వంద పడకల ఆసుపత్రి, బంజారా భవన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.