టాప్ ఐదుగురు డోనర్లలో మూడు కేసులు ఇలాంటివే
electoral bonds। ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చిన టాప్ 5లో ముగ్గురు ఐటీ, ఈడీ సోదాలు ఎదుర్కొన్నవారే ఉండటం గమనార్హం. వాటిలో లాటరీ సంస్థ ఫ్యూచర్ గేమింగ్, నిర్మాణ కంపెనీ మేఘా ఇంజినీరింగ్, గనుల దిగ్గజం వేదంత ఉన్నాయి. అత్యధిక ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన సంస్థగా ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నది. దీని యజమాని శాండియాగో మార్టిన్. ఈ లాటరీ కంపెనీ 2019 నుంచి 2024 మధ్య 1300 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది.
విచిత్రం ఏమిటంటే.. 2019లో ఈ సంస్థపై ఈడీ మనీలాండరింగ్ కేసులో విచారణ ప్రారంభించింది. ఆ ఏడాది జూలైలో కంపెనీకి సంబంధించిన 250 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అనంతరం 2022 ఏప్రిల్ 2న ఈడీ సదరు కంపెనీకి చెందిన 409.92 కోట్ల రూపాయల విలువ చేసే చరాస్తులను జప్తు చేసింది. ఆ తర్వాత ఏడు రోజులకు అంటే.. ఏప్రిల్ 7న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ వంద కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది.
శాంటియాగో మార్టిన్, అతన కంపెనీ మెస్సర్స్ ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్), అప్పటి మార్టిన్ లాటరీ ఏజెన్సీస్‌పై సీబీఐ చార్జిషీటు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మార్టిన్, ఇతరులు లాటరీ రెగ్యులేషన్ చట్టం – 1998 నిబంధనలు ఉల్లంఘిస్తూ సిక్కిం ప్రభుత్వాన్ని మోసం చేయడం ద్వారా అక్రమార్జనకు నేరపూరిత కుట్ర చేశారని ఈడీ ఆరోపించింది.
ప్రైజ్ విన్నింగ్ టికెట్ల గడువును 01.04.2009 నుంచి 31.08.2010 వరకు పొడిగించడం ద్వారా 910.3 కోట్ల రూపాయల మేరకు లబ్ధి పొందారని ఈడీ 2019, జూలై 22న వెల్లడించింది. ఈ పరిణామం నేపథ్యంలో 2019-2024 మధ్యకాలంలో అంటే కంపెనీ పెద్ద ఎత్తున బాండ్లను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తొలి విడత బాండ్లను 2020 అక్టోబర్ 21న కొనుగోలు చేసింది.
బాండ్ల కొనుగోళ్లలో రెండో స్థానంలో హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఉన్నది. 2019-2024 మధ్యకాలంలో 1000 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను మేఘా కొనుగోలు చేసింది. కృష్ణారెడ్డి సారథ్యంలో మేఘా ఇంజినీరింగ్.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం డ్యామ్ ప్రాజెక్టు సహా అనేక ప్రాజెక్టును దక్కించుకున్నది. జోజిలా టన్నెల్, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టులను కూడా మేఘా ఇంజినీరింగ్ సంస్థే నిర్మిస్తున్నది.
2019 అక్టోబర్‌లో ఆదాయం పన్ను అధికారులు కంపెనీ అధికారుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. తదనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ కూడా చేపట్టింది. ఇదిలా ఉండగా.. అదే ఏడాది ఏప్రిల్ 12న ఎంఈఐఎల్ 50 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది.
చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ.. తన హైదరాబాద్‌కు చెందిన భాగస్వామి ఎంఈఐఎల్‌తో కలిసి బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రతిపాదించిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్‌ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తిరస్కరించింది.
టాప్ 5 డోన్లలో ఐదో స్థానంలో ఉన్న అనిల్ అగ్వరాల్‌కు చెందిన వేదాంత గ్రూప్.. మొత్తం 376 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. వాటిలో తొలి విడుత బాండ్లను 2019 ఏప్రిల్‌లో ఖరీదు చేసింది. ఇక్కడా విశేషమే ఉన్నది. వీసా కుంభకోణంలో వేదాంత గ్రూప్‌నకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2028 సంవత్సరం మధ్యలో ప్రకటించింది. ఈ మేరకు ఈడీ పంపిన రెఫరెన్స్ 2022 నాటికి అవినీతి కేసుగా మారింది. దీనిపై మనీలాండరింగ్ దర్యాప్తును ఈడీ ప్రారంభించింది. 2019 ఏప్రిల్ 16న వేదాంత గ్రూప్ 39 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసింది. తదుపరి నాలుగేళ్లలో కొవిడ్ కాలమైన 2020ను మినహాయిస్తే.. 2023 నవంబర్ వరకు వేదాంత గ్రూప్ 337 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. దాంతో అది కొనుగోలు చేసిన మొత్తం బాండ్ల విలువ 376 కోట్ల రూపాయలకు చేరింది.
జిందాల్ స్టీల్ అండ్ పవర్ కూడా టాప్ 15 జాబితాలో ఉన్నది. ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో ఈ సంస్థ 123 కోట్ల బాండ్లను కొనుగోలు చేసినట్టు ఉన్నది. కోల్ బ్లాక్స్ కేటాయింపు కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను కంపెనీ ఎదుర్కొన్నది. 2022 ఏప్రిల్‌లో ఫారెక్స్ ఉల్లంఘనల కేసులో సంస్థ ప్రమోటర్ నవీన్ జిందాల్, ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో 2022 అక్టోబర్ 7వ తేదీన కంపెనీ తొలివిడుత బాండ్లను కొనుగోలు చేసింది.
రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కథ కూడా ఇదే. ఈ కంపెనీ 45 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు సీఎం రమేశ్‌కు చెందిన కంపెనీ ఇది. 2018 అక్టోబర్‌లో ఆదాయం పన్ను శాఖ అధికారులు ఆయన కంపెనీ, ఆయన నివాసాల్లో తనిఖీలు చేశారు. అప్పట్లో ఆయన టీడీపీ ఎంపీగా ఉండేవారు. తర్వాత బీజేపీలో చేరిపోయిన తర్వాత ఆయన కార్యాలయాలపై సోదాలు ఆగిపోయాయి.
ఢిల్లీ లిక్కర్ కేసుతో వార్తలకెక్కిన అరబిందో ఫార్మా కూడా 49 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేసింది. కంపెనీ డైరెక్టర్ పీ శరత్‌చంద్రారెడ్డిని ఢిల్లీ లిక్కర్ కేసులో 2022 నవంబర్‌లో అరెస్టు చేసింది. కాగా, ఆ కంపెనీ 2.5 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను 2021న కొనుగోలు చేసింది. ఈ కంపెనీ కొనుగోలు చేసిన బాండ్లన్నీ 2022, 2023 మధ్యకాలంలోనివే కావడం గమనార్హం.
రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 64 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చిన రేష్మి సిమెంట్ కూడా 2022 నుంచి ఈడీ నిఘాలో ఉన్నది. 2022 జూలై 13న పశ్చిమ బెంగాల్‌లోని మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇక 2024 జనవరిలో 40 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన శిర్డి సాయి ఎలక్ట్రికల్స్‌పై గత ఏడాది ఐటీ అధికారులు సోదాలు చేశారు.