Viral Video | ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వాడే నిజమైన దేవుడు అని భావిస్తుంటారు. అలాంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతాం.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. చివరి శ్వాస వరకు అతన్ని మరిచిపోం. మనషుల మాదిరిగానే జంతువులు కూడా ఆ కృతజ్ఞతను చాటుకుంటాయి. ఓ ఏనుగు కూడా తనను కాపాడినందుకు జేసీబీ డ్రైవర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక కొడ్గావ్ జిల్లాలోని ఓ గ్రామ పరిధిలో తీసిన గుంతలో ఏనుగు పడిపోయింది. భారీగా ఉన్న ఆ ఏనుగు గుంతలో నుంచి బయటకు వచ్చేందుక తీవ్ర ఇబ్బంది పడుతుంది. ఏనుగును గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఇక ఘటనాస్థలికి జేసీబీని పిలిపించారు అధికారులు. జేసీబీ డ్రైవర్ ఏనుగును పైకి తెచ్చేందుకు చర్యలు మొదలు పెట్టాడు. గుంతపైకి ఎక్కుతున్న ఏనుగుకు వెనుక భాగం నుంచి జేసీబీతో నెట్టాడు. దీంతో ఏనుగు సునాయసంగా గుంతలో నుంచి బయటకు వచ్చింది.
అనంతరం ఏనుగు తన కృతజ్ఞతను చాటుకుంది. జేసీబీకి తన తొండంతో ధన్యవాదాలు తెలిపి నెటిజన్ల మనసులను దోచుకుంది. ఏనుగులకు ఉన్న విశ్వాసం మనషులకు ఉంటే ఎంత బాగుండో అని అంటున్నారు.