విధాత: స్పేస్ఎక్స్, టెస్లా, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) .. భారత్ (India) కు మరోసారి మద్దతు పలికారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఆ దేశం చేస్తున్న డిమాండ్ న్యాయమైనదేనని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశానికి భద్రతామండలిలో లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం అసమంజసంగా ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌తో పాటు ఆఫ్రికా ఖండానికి కూడా యూఎన్‌లో మెరుగైన పాత్ర లభించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ‘ఏదో ఒక సమయంలో యూఎన్‌లో సంస్కరణలు జరగాలి.
కానీ సమస్య ఏమిటంటే.. ఇప్పుడు అపరిమితమైన అధికారాలను అనుభవిస్తున్నవారు.. దానిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతకు ముందు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్.. సమితిలో సంస్కరణలకు అవకాశం ఇవ్వాలని శాశ్వత సభ్యత్వ దేశాలైన రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికాలకు విజ్ఞప్తి చేశారు. ఈ అయిదు దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉండటంతో ప్రతి అంశంలోనూ ఈ దేశాలది మాత్రమే తుది నిర్ణయంగా చెల్లుబాటు అవుతోంది. ‘అంతర్జాతీయ వ్యవస్థలు ఇప్పటి తరాన్ని ప్రతిబింబించాలి కానీ 80 ఏళ్ల గతాన్ని కాదు.
ఇప్పటి వరకు ఆఫ్రికాకు శాశ్వత సభ్యత్వం లేకపోవడమేమిటి? సెప్టెంబరులో జరిగే సదస్సు అంతర్జాతీయ గవర్నెన్స్‌పై కీలక సంస్కరణలకు వేదిక కావాలని ఆశిస్తున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిని రీ పోస్ట్ చేసిన మైఖెల్ ఐసన్‌బర్గ్ అనే పెట్టుబడిదారుడు.. భారత్ గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ‘భారత్‌కు దక్కాల్సిన ప్రాతినిధ్యం సంగతేంటి? యూఎన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి.. అసలైన నాయకత్వంతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమ ఆలోచన’ అని వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగానే.. ఎలాన్ మస్క్ పై విధంగా స్పందించారు.
అత్యంత జనాభా కలిగి, ప్రపంచంలోనే అయిదో పెద్ద ఆర్థికవ్యవస్థగా భారతదేశం.. యూఎన్‌లో శాశ్వత సభ్యత్వం కోసం ఎప్పటికప్పుడు తన గొంతుకను వినిపిస్తూనే ఉంది. అంతర్జాతీయ సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలను అమలుచేయాలని ప్రధాని మోదీ గత ఏడాదే వ్యా ఖ్యానించారు. ‘ప్రస్తుత ప్రపంచం భిన్న ధ్రువాలు కలిగినది. అందరి అభిప్రాయాలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సంస్థలకే భవిష్యత్తులో మనుగడ ఉంటుంది’ అని 2023 ఆగస్టులో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మోదీ అన్నారు.