20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత.. ఎర్రబెల్లి సొంత సర్వే!
15- 20 మంది ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉంది మారిస్తే BRSకు100 సీట్లు గ్యారెంటీ.. మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు కేసీఆర్ పై ప్రజల్లో నమ్మకం ఉంది నా సర్వే ఎప్పుడూ తప్పు కాలేదు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో ఒక 15- 20 మంది ఎమ్మెల్యేల పైన మాత్రమే వ్యతిరేకత ఉంది. అయినా బీఆర్ఎస్ కు 90 సీట్లు గ్యారెంటీ. వ్యతిరేకత ఉన్న ఈ ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అంటూ రాష్ట్ర […]

- 15- 20 మంది ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉంది
- మారిస్తే BRSకు100 సీట్లు గ్యారెంటీ..
- మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు
- కేసీఆర్ పై ప్రజల్లో నమ్మకం ఉంది
- నా సర్వే ఎప్పుడూ తప్పు కాలేదు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో ఒక 15- 20 మంది ఎమ్మెల్యేల పైన మాత్రమే వ్యతిరేకత ఉంది. అయినా బీఆర్ఎస్ కు 90 సీట్లు గ్యారెంటీ. వ్యతిరేకత ఉన్న ఈ ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి వ్యాఖ్యలు బీ ఆర్ ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం కేంద్రంగా బీ ఆర్ ఎస్ ఆవిర్భావ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న కీలక సమయంలో మంత్రి ఎర్రబెల్లి ఈ ప్రధాన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని నర్సింహులపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బీఆర్ఎస్‌కు 90 సీట్లు గ్యారెంటీ
ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్‌కు 90 సీట్లు గ్యారెంటీ అన్నారు. కెసిఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందంటూనే కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉందన్నారు.
ప్రజలలో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. 25 మంది వరకు ఎమ్మెల్యేలను మార్చాలన్నారు. నా సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నొక్కి చెప్పడం విశేషం.
అధిష్టానం అనుమతి ఉందా?
బీఆర్ఎస్ అధిష్టానం అనుమతితో ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారా? లేక ఆయన సొంత వ్యాఖ్యలా? అనే సంశయం వ్యక్తమైతోంది. రానున్న ఎన్నికల్లో అసమ్మతి ఎమ్మెల్యేలు వ్యతిరేక త ఉన్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు ముందస్తు వ్యూహంలో భాగంగా ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేశారా.. అన్నది రానున్న రోజుల్లో తేల నున్నది.
పైగా తాను నిర్వహించిన సొంత సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు దయాకర్ రావు చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉండగా గులాబీ పార్టీ అధినేత మాత్రం సిట్టింగులను ఎట్టి పరిస్థితుల్లో మార్చే సమస్య లేదన్నట్టు గతంలో వ్యాఖ్యానించిన విషయం పలువురు గుర్తు చేస్తున్నారు.
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు
ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి వ్యాఖ్యలు పార్టీలో ఒక రకంగా చర్చగా మారాయి. ఒకవైపు ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ఏ సంకేతం అంటూ ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ సమావేశంలో ఎంపీ, మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.