కూలగొట్టడం తప్ప.. కట్టడం రాదా!

ఎంతసేపు మత రాజకీయాలేనా.. బండి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ఉన్నమాట: బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయంపై అమర్చిన గుమ్మటాలను కూల్చివేస్తామని, దేశ, తెలంగాణ సంస్కృతి అద్దంపట్టేలా రూపు రేఖలు మారుస్తామని, ప్రగతిభవన్‌ను ప్రజాదర్బార్‌ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలకు ఒక వర్గంపై, వారి మతంపై విద్వేషాన్ని వెళ్లగక్కడం, వాళ్లను పరాయీవాళ్లుగా చిత్రీకరించడం తద్వారా హిందుమతం పేరుతో ఓట్లు దండుకోవాలనే కుటిల రాజకీయాలు చేయడం పరిపాటిగా మారింది. […]

  • By: krs    latest    Feb 12, 2023 4:34 AM IST
కూలగొట్టడం తప్ప.. కట్టడం రాదా!
  • ఎంతసేపు మత రాజకీయాలేనా..
  • బండి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు

ఉన్నమాట: బీజేపీ అధికారంలోకి వస్తే నూతన సచివాలయంపై అమర్చిన గుమ్మటాలను కూల్చివేస్తామని, దేశ, తెలంగాణ సంస్కృతి అద్దంపట్టేలా రూపు రేఖలు మారుస్తామని, ప్రగతిభవన్‌ను ప్రజాదర్బార్‌ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలకు ఒక వర్గంపై, వారి మతంపై విద్వేషాన్ని వెళ్లగక్కడం, వాళ్లను పరాయీవాళ్లుగా చిత్రీకరించడం తద్వారా హిందుమతం పేరుతో ఓట్లు దండుకోవాలనే కుటిల రాజకీయాలు చేయడం పరిపాటిగా మారింది.

ఈ ఎనిమిదిన్నర ఏళ్లలో దేశంలో వాళ్లు సాధించిన ప్రగతి ఏమిటి? రెండుసార్లు పూర్తి మెజారిటీ ఇచ్చిన ఈ దేశ ప్రజల కోసం వాళ్లు చేసింది ఏమిటి? కరోనా కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారికి వారు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? కేంద్రంలో ఖాళీగా ఉన్న సమారు 10 ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ఏది? డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే నిధులు తప్పా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష ఎందుకు అన్న విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఉండదు.

బండి సంజయ్‌ లాంటి వాళ్ల మాటలు ఎప్పుడూ విధ్వంసం, విద్వేషం తప్పా తనను గెలిపించిన కరీంనగర్‌ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఏం తెచ్చారు అంటే జవాబు రాదు. గంగా జెమునా తెహజీబ్‌ లాంటి తెలంగాణ సంస్కృతి అంటే బీజేపీ నేతలకు గిట్టదు. ఎంతసేపు మత రాజకీయాలు చేయాలి? తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనే తప్పా ప్రజా సంక్షేమ అనేది వారి విధానంలో లేదు. వారి ఆచరణలో కనిపించదు. తమకు ఒక అవకాశం ఇస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, రైతులకు న్యాయం చేస్తామని, రజాకార్ల రాజ్యం కాకుండా రామరాజ్యం తెస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు చూస్తే అర్థమౌతుంది.

బండి సంజయ్‌ వ్యాఖ్యలపై నెటిజిన్లు ఫైర్‌ అవుతున్నారు. తెలంగాణలో విపక్షాలకు కూలగొట్టడం తప్పా కట్టడం రాదని ఎద్దేవా చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఫొటోలు, పార్లమెంటు ఫొటో పెట్టి వీటిని కూల్చివేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక మతం, వారు ఆరాధించే దేవుడిపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆ వ్యాఖ్యలపై మన దేశంలోనే కాదు ఇరాన్‌, కువైట్‌, ఖతార్‌ వంటి దేశాలు నిరసన వ్యక్తం చేశాయి.

దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్‌శర్మ సస్పెన్షన్‌ వేటు, ఢిల్లీ మీడియా విభాగం ఇన్‌ఛార్జి నవీన్‌కుమార్‌ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అధికారపార్టీతో విభేదించి బీజేపీలో చేరిన నేతలకు బండి సంజయ్‌ వ్యాఖ్యలు ఇబ్బందిగా మారాయి.

ఉద్యమకాలంలో అన్నివర్గాలు, అన్ని కులాలు, మతాల వారితో కలిసి పనిచేసిన అనుభవం వారికి ఉన్నది. ఉద్యమకాలంలో ఎన్నడూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వ్యాఖ్యలు చేయలేదు. కానీ బండి లాంటి వాళ్లు బాధ్యతారాహిత్యంతో చేసే విద్వేష వ్యాఖ్యలు బ ఆ పార్టీకే కాదు, తమ లాంటి వారికి రాజకీయంగా గుదిబండగా మారుతాయని అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు.