Rayachoti Terrorists | రాయచోటి ఉగ్రవాదుల ఇండ్లలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం

Rayachoti Terrorists | రాయచోటి ఉగ్రవాదుల ఇండ్లలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం

అమరావతి : అన్నమయ్య జిల్లా రాయచోటిలో అరెస్టయిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ అలీ సిద్ధిఖీ ఇండ్లలో భద్రతా బలగాలు చేపట్టిన తనిఖీల్లో భారీగా పేలుడు పదార్ధాలు లభించాయి. సిద్ధిక్‌ నివాసంలో 4 కిలోల ఆర్డీఎక్స్, అమ్మోనియం నైట్రేట్, నైట్రో గ్లిజరిన్, డిటొనేటర్‌ వైర్లు,సెల్ ఫోన్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అలీ నివాసంలో పేలుళ్లకు ఉపయోగించే వైర్లను, వాకీటాకీలు, రేడియోలు, రిమోట్లు వంటి పరికరాలతో పాటు పలు పాస్ పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు ఇద్దరూ కూడా తమిళనాడు నుంచి రాయచోటి వచ్చి స్థిరపడ్డారు. 13 సంవత్సరాలుగా రాయచోటిలోనే ఉంటూ వస్త్ర వ్యాపారం ముసుగులో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నారు. అబూబకర్ సిద్దిఖీ, మహమ్మద్ అలీలను ఇప్పటికే ఎన్ఐఏ అరెస్టు చేసింది. అలాగే వారి భార్యలను, కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేసి రిమాండ్ చేసింది. సిద్ధిఖీ, అలీ ఇద్దరు కూడా తమిళనాడులో వరుస బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉన్నారు.

1995లో చెన్నైలోని చింతాద్రిపేటలోని హిందూ మున్నాని కార్యాలయంలో జరిగిన బాంబు దాడి, అదే సంవత్సరం నాగూర్‌లో జరిగిన పార్శిల్ బాంబు పేలుడుతో సహా వరుస దాడుల్లో సిద్ధిక్ ప్రమేయం ఉంది. బాంబుల తయారీలో నైపుణ్యం కలిగిన సిద్ధిఖ్ 1995 నుండి 30ఏండ్లుగా పరారీలో ఉన్నాడు. అతనిపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. తమిళనాడు, పొరుగు రాష్ట్రాలలో జరిగిన అనేక ఉన్నత స్థాయి ఉగ్రవాద సంఘటనల వెనుక అతను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. దేశంలోని 3 ప్రధాన నగరాలతో పాటు రైలు మార్గాలను పేల్చడానికి ఇద్దరు పథకం వేశారు. కాగా ఉగ్రవాదులు రాయచోటిలో ఎవరెవరితో ఫోన్లలో మాట్లాడేవారన్న వివరాలను సేకరిస్తున్న పోలీసులు వారితో సంబంధాలున్న వారికోసం గాలిస్తున్నారు. ఉగ్రవాదులు ఇద్దరు ఓ వ్యాపారితో పాటు ఓ ప్రజాప్రతినిధితో ఫోన్లలో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.