Medaram | ప్రతిష్ఠాత్మకంగా మేడారం జాతర
దేశంలోనే కుంభమేళా తర్వాత అతి పెద్దదైన మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క చెప్పారు

- భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు
- వచ్చేవారికి మెరుగైన రవాణా వసతి
- 51 ప్రదేశాలు.. 6 వేల బస్సులు
- మేడారం సందర్శించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క
Medaram | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దేశంలోనే కుంభమేళా తర్వాత అతి పెద్దదైన మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులను చేర వేయడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. సోమవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.. మేడారం గద్దెలను దర్శించుకున్నారు. గట్టమ్మను దర్శించుకున్నారు. తదుపరి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు.
51 ప్రదేశాల నుంచి బస్సులు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్ మొదలగు 51 ప్రదేశాల ద్వారా రానున్న భక్తులను చేరవేసేందుకు ప్రత్యేక జాతర క్యాంపులను నిర్వహిస్తున్నామని మంత్రులు తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. రాష్ట్రంతోపాటు.. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై, అమ్మవారి దీవెనలు పొందుతారని తెలిపారు. జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసికి 2.25 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు.

ఉచిత ప్రయాణంతో పెరుగనున్న భక్తులు
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినందున గత జాతరతో పోలిస్తే 50% పెరుగుదల ఉంటుందని అంచనా వేశామని మంత్రులు తెలిపారు. దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచామన్నారు. 2020 సంవత్సరంలో 3382 బస్సులు నడపగా, ఈ ఏడాది సుమారు 50 లక్షల మంది భక్తగులు హాజరవుతారనే అంచనాతో 6 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుండి బస్సులు నడుస్తాయని వివరించారు.
భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు
ప్రయాణికుల సౌకర్యార్థం క్యూలైన్ల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, నిఘా కెమెరాలు, వినోదం కోసం ఎల్‌సీడీ స్క్రీన్లు, బహిరంగ ప్రకటనల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రులు పొన్నం, సీతక్క తెలిపారు. 47 క్యూలైన్లతో వివిధ ప్రాంతాలకు బస్సుల ఏర్పాటు చేస్తున్నామన్నారు. నార్లాపూర్ చింతల్ నుండి మేడారానికి ఉచిత బస్సుల సౌకర్యం కల్పించామని చెప్పారు. సత్వర ప్రయాణానికి ఎక్కడా ఆగకుండా 12 స్పెషల్ చేజింగ్ వాహనాలతో ఆధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక క్రేన్లు, ట్రాక్టర్లు, వాటికి సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని, వారికి మేడారం, తాడ్వాయిలో సబ్సిడీ రేట్లతో క్యాంటీన్ సౌకర్యం, విశ్రాంతి కొరకు తాత్కాలిక విశ్రాంతి గదుల ఏర్పాటు చేస్తామన్నారు. మేడారం జాతరను విజయవంతం చేసేందుకు సుమారు 15 వేల వివిధ శాఖల అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బందితో ఆర్టీసీ సిద్ధంగా ఉందని మంత్రులు పొన్నం, సీతక్క చెప్పారు.