విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు నియోజకవర్గ బిజెపిలో చాప కింద నీరులా సాగుతున్న వర్గ విభేదాలు బహిరంగంగా రోడ్డెక్కాయి. రానున్న ఎన్నికలకు ముందస్తుగా ఆయా నియోజకవర్గాలలో శక్తి కేంద్రాల వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించి కార్యకర్తల్లో కదలిక తేవాలనే లక్ష్యం విభేదాల వల్ల నీరుగారుతోన్నది. ప్రజా సమస్యలను చర్చించేందుకు ఏర్పాటుచేసిన ఈ సమావేశాలు కాస్త పార్టీ విభేదాలకు వేదికయ్యాయి.
గ్రూపుల మధ్య ఆధిపత్య పోటీ
కార్నర్ మీటింగ్ లతో వరంగల్ తూర్పు భారతీయ జనతా పార్టీలో నెలకొన్న వర్గ పోరు శనివారం బయటపడ్డది. విచిత్రమేమిటంటే ఒకే చోట రెండు వేదికలు వేరువేరుగా ఏర్పాటు చేసి ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఒకే పార్టీ, ఒకే సమస్యపై, ఒకే చోట వేరువేరు వేదికలు ఏర్పాటు చేసి… నాయకులు వేరువేరుగా మీటింగులు నిర్వహించడంతో ఇది చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు.
పొసగని పాత కొత్త నాయకులు
వరంగల్ తూర్పు నియోజకవర్గ బిజెపిలో గత కొంతకాలంగా వర్గ పోరు నెలకొన్నది. గతంలో కూడా ఈ విభేదాలు ఉన్నప్పటికీ అంతర్గతంగా కొనసాగుతూ వస్తున్నాయి. కార్యక్రమాలలో గ్రూపులుగా పోటీపడుతూ నిర్వహిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి ఈ విభేదాల విషయం తెలిసినప్పటికీ మిన్న కుంటూ వస్తున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా బీజేపీని నమ్ముకుని పనిచేస్తున్న పాత నాయకులు కార్యకర్తలకు కొత్తగా పార్టీలో చేరిన నాయకులు వారి అనుచరులకు మధ్య పొత్తు పోసగడం లేదు.
ఆశావహుల మధ్య పోటీ
ఇటీవల పార్టీకి పెరిగిన ఆదరణ.. వచ్చే ఎన్నికల్లో తమ విజయానికి పునాదిగా నిలుస్తుందని ఆశాభావంతో ఉన్న నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పోటీ పడుతున్నారు. కొత్తగా వచ్చిన వారు సైతం పోటీకి సంసిద్ధం కావడంతో ఈ విభేదాలు అనివార్యమయ్యాయి.
వరంగల్ తూర్పులో ముగ్గురు, నలుగురు నేతలు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఇరువురి మధ్య నువ్వా నేనా అనే పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన పాత నాయకుడు కుసుమ సతీష్ కు, కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు మధ్య పోటీ బహిరంగంగానే సాగుతోంది.
తాజా కార్నర్ మీటింగ్ ల నిర్వహణకు ఇరువర్గాలు పోటీ పడుతున్నాయి. శనివారం ఎస్ఆర్ఆర్ తోటలో ఇరు గ్రూపులు ఒకేచోట వేదికలు ఏర్పాటు చేసి సభ నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. గతంలో కూడా కార్యక్రమాలలో పోటీ పడుతూ బలాబలాలను ప్రదర్శించుకుంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఈ రెండు గ్రూపుల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయని కమలం పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న వరంగల్ తూర్పులో విభేదాలు మిగిలిన నియోజకవర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ నిరంతర కార్యక్రమాలను చేపడుతూ అధిష్టానం పరిశీలకులు, ఇన్చార్జిలను నియమిస్తూ ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ గ్రూపు విభేదాలను పరిష్కరించడంలో అధినాయకత్వం కూడా తగిన శ్రద్ధ కనబరచడం లేదనే విమర్శలు ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది.