తొలి జీవో ధరణి రద్దు పైనే.. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విధాత: కొత్త సంవత్సరం 2024, జనవరి 1న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తూ తొలి జీవో ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా 10వ రోజు వర్ధన్నపేట నియోజకవర్గంలో 17కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వర్ధన్నపేట సెంటర్‌లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గురువారం ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకొని రేవంత్ రెడ్డి […]

విధాత: కొత్త సంవత్సరం 2024, జనవరి 1న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తూ తొలి జీవో ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా 10వ రోజు వర్ధన్నపేట నియోజకవర్గంలో 17కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వర్ధన్నపేట సెంటర్‌లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
గురువారం ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకొని రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. ఈ నెల 6న సమ్మక్క-సారలమ్మల ఆశ్వీరాదంతో, సీతక్క అండతో మొదలైన పాదయాత్ర మహబూబాబాద్, భద్రాచలం మీదుగా 100 కిలోమీటర్లు పూర్తి చేసుకొని వరంగల్ పార్లమెంట్ పరిధిలోని పాలకుర్తి నియోజకవర్గం చేరుకుంది. అటు నుంచి ఇప్పుడు వర్ధన్నపేటకు వచ్చింది. ఐనవోలులో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ పెరుమాండ్ల గ్రామానికి వచ్చారు. అక్కడ ఏడు నెలల నుంచి జీతాలు లేవని గ్రామపంచాయితీ కార్మికులు వాపోయారు.
ఎవరిని కలిసిన ఏదో తెలియని బాధ. ప్రభుత్వం అన్యాయం చేసిందనే భావన. ఎవరికి డబుల్ బెడ్రమ్ ఇళ్లు రాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, రైతులు పండించిన పంటలకు గిట్టు బాటు ధర లేదు, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కాలేదు, రైతులకు రుణ మాఫీ కాలేదు, దళితులకు మూడు ఎకరాల భూమి రాలేదు. పెరుమాండ్ల గ్రామంలో ల్యాండ్ పూలింగును నిరసించిన దళితులపై పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగింపజేశారు. ఎమ్మెల్యే దళితుడే కానీ ఎన్నడు దళిత కాలనీలోకి రాలేదు.
కమీషన్లు లేనిదే ఇక్కడి ఎమ్మెల్యే ఏ పని చేయడని చెబుతున్నారు. రాజకీయంగా నష్టపోయినా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. మోసపూరిత హామీలతో కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. మనమందరం కులవృత్తులు చేసుకోవాలంటా. కేసీఆర్, ఆయన కొడుకు మాత్రం రాజ్యం ఏలుతారంటా. కేసీఆర్ కుబుంబం కోసమా తెలంగాణ వచ్చిందా. నాలుగు కోట్ల మంది కోసం తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబంలో నలుగురు బతుకులు బాగుపడ్డాయి.
తన భూముల ధరలు పెంచుకునేందుకే.. ఇక్కడి ఎమ్మెల్యే ల్యాండ్ పూలింగ్ లో పేదల భూములు లాక్కున్నారు. జేఏసీకి జెండాలు కట్టింది మనం. దొరగారికి దండాలు పెట్టింది మనం. రాష్ట్ర ఏర్పాటు అలస్యమైతే ప్రాణాలు తీసుకుంది మనం. కానీ వచ్చిన తెలంగాణ ఏవడి పాలైందో మీరే ఆలోచించండి.
ఏ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం, దళితబంధు, ఇంటికో ఉద్యోగం, మూడెకరాలు ఇచ్చారో ఆ ఓట్లు కేసీఆర్ వేయించు కోవచ్చు.. రాని వారు కాంగ్రెస్‌కు వేస్తారని ఈ సవాల్‌ను స్వీకరించేందుకు కేసీఆర్ సిద్ధమా? ఏ పార్టీకైనా జనం పదేళ్లు అవకాశం ఇచ్చారు.
ఇక కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. ల్యాండ్, శాండ్, వైన్ మాఫియా అంతా బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలోనే నడుస్తుంది. రేప్‌లు, మర్డర్లు జరిగినా ఆ నాయకులే ఉంటున్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఈ దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుంటుంది.
2024, జనవరి1న కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ధరణి రద్దు చేసే జీవో ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి వారిని ఆదుకుంటాం. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఒక్క ఏడాదిలోనే భర్తీ చేస్తాం. ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. పేదలకు వైద్యం అందించేందుకు 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్ ను 5లక్షలకు పెంచుతాం.
పోయిన భూములు తిరిగి ఇస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే వర్ధన్నపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయండి. రమేష్ తిరిగి వస్తే మీ భూములు పోతాయి. రాష్ట్రంలో రావుసాబ్ పోవాలి. టీఆర్ఎస్ పీడ పోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో అనాడు 2004లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితులే ఉన్నాయి. అనాడు వచ్చిన విధంగానే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుంది. ఈ విషయంలో ఎవరికి అనుమానం అక్కర్లేదు
కోమటిరెడ్డిపై దాడికి ఖండన
తుంగతుర్తి నియోజకవర్గంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల దాడిని ఖండిస్తున్నాం. అనాడు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మేము దాడులకు పాల్పడితే మీరు రోడ్ల మీద తిరిగేవారా. ఎవరైనా మా నాయకులపై దాడులు చేస్తే అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి సంగతి తెలుస్తాం. అన్ని రాసుకుంటున్నం. లెక్కకు లెక్క మిత్తికి మిత్తి చెల్లిస్తం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా రుణం తీర్చుకుంటా. నాయకులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
అరూరి రమేష్ పై చార్జిషీట్ విడుదల
ఉప్పర్ పల్లి లంచ్ పాయింట్ వద్ద కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, కోదండరెడ్డి, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్‌పై చార్జీషీటును విడుదల చేశారు.