Wildfire | చిలీలో ఆగని కార్చిచ్చు.. 64కు పెరిగిన మృతులు

దక్షిణ అమెరికా దేశమైన చిలీలోని అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. కార్చిర్చు ధాటికి 1100కుపైగా ఇండ్లు కాలిబూడిదవగా.. 64 మంది మృతి చెందారు

Wildfire | చిలీలో ఆగని కార్చిచ్చు.. 64కు పెరిగిన మృతులు

Wildfire | దక్షిణ అమెరికా దేశమైన చిలీలోని అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. కార్చిర్చు ధాటికి 1100కుపైగా ఇండ్లు కాలిబూడిదవగా.. 64 మంది మృతి చెందారు. హెలీకాప్టర్లు, ట్రక్కుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అత్యవసర సేవ విభాగం ప్రయత్నిస్తున్నది. ఎక్కడ చూసినా అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


దాదాపు మిలియన్‌ జనాభా ఉండే సెంట్రల్‌ చిలీలోని వాల్పరైసో ప్రాంతంలోని అనేక ప్రాంతాలను నల్లటి పొగ కమ్మేసింది. తీర ప్రాంత నగరం వినా డెల్ మార్ పరిసర ప్రాంతాలు సైతం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాల్పరైసోలో పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తోహా తెలిపారు. రోడ్లపై మనుషుల మృతదేహాలు కనిపిస్తున్నాయన్నారు. 2010 భూకంపం తర్వాత చిలీలో ఇదే అతిపెద్ద విపత్తు. ఆ సమయంలో భూకంపం కారణంగా దాదాపు 500 మంది చనిపోయారు. అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ టెలివిజన్ ప్రసంగంలో పరిస్థితి చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రస్తుతం 43 వేల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. సమాచారం ప్రకారం.. మంటలు విల్లా ఇండిపెండెనియా సైతం చుట్టుముట్టాయి. మధ్య, దక్షిణ ప్రాంతాల్లోని 92 అడవులలో మంటలు చెలరేగాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మంటలు ఇండ్లకు సైతం అంటుకుంటున్నాయి. దీంతో ప్రజలపై తీవ్రంగా ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే, చిలీలో వేసవిలో కార్చిచ్చులు సర్వసాధారణమే. గతేడాది రికార్డు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ క్రమంలో చెలరేగిన మంటలకు 27 మంది మృతి చెందగా.. 4లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం ప్రభావితమైంది.