అభిమానులకు మాజీ సీఎం కేసీఆర్‌ వీడియో సందేశం

హిప్ రిప్లేస్‌మెంట్ స‌ర్జ‌రీ అనంత‌రం య‌శోద ఆస్ప‌త్రి నుంచి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు సందేశం ఇచ్చారు

  • By: Somu    latest    Dec 12, 2023 11:38 AM IST
అభిమానులకు మాజీ సీఎం కేసీఆర్‌ వీడియో సందేశం

హైద‌రాబాద్: హిప్ రిప్లేస్‌మెంట్ స‌ర్జ‌రీ అనంత‌రం య‌శోద ఆస్ప‌త్రి నుంచి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు సందేశం ఇచ్చారు. ద‌య‌చేసి ఎవ‌రూ కూడా ఆస్ప‌త్రికి రావొద్ద‌ని, త్వ‌ర‌లోనే మీ మ‌ధ్య‌లోకి వ‌స్తాను అని కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను.. హాస్పిట‌ల్‌లో మ‌నం కాకుండా వంద‌లాది మంది కూడా ఇక్క‌డ ఉన్నారు. వాళ్ల క్షేమం కూడా మ‌న‌కు ముఖ్యం. కాబ‌ట్టి మీరు అన్య‌త‌గా భావించ‌కుండా, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మీ ఇళ్ల‌కు చేరండి అని కేసీఆర్ వేడుకున్నారు.


య‌శోద ఆస్ప‌త్రి నుంచి కేసీఆర్ సందేశం ఇదే..


ఈ రోజు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వంద‌లాది, వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన‌టువంటి అభిమానులంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క వంద‌నాలు. అనుకోకుండా జ‌రిగిన యాక్సిడెంట్‌తోని య‌శోద హాస్పిట‌ల్‌లో చేరాను. ఈ సంద‌ర్భంలో వైద్య బృందం న‌న్ను సీరియ‌స్‌గా హెచ్చ‌రించింది. అదేంటంటే.. ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంట‌ది. దానితోని స‌మ‌స్య ఇంకా పెరిగి చాలా అవ‌స్థ‌లు వ‌స్తాయి. దాంతో నెల‌ల త‌ర‌బ‌డి బ‌య‌ట‌కు పోలేర‌ని చెబుతున్నారు. దాన్ని గ‌మ‌నించి, ద‌య‌చేసి మీ అభిమానానికి వెయ్యి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరంద‌రూ బాధ‌ప‌డ‌కుండా మీ స్వ‌స్థ‌లాల‌కు మంచిగా, క్షేమంగా వెనుదిరిగి పోవాలి.


ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. ఇంకో ప‌ది రోజుల వ‌ర‌కు ఎవ‌రూ కూడా త‌ర‌లిరావొద్ద‌ని విన‌య‌పూర్వ‌కంగా విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. హాస్పిట‌ల్‌లో మ‌నం కాకుండా వంద‌లాది మంది కూడా ఇక్క‌డ ఉన్నారు. వాళ్ల క్షేమం కూడా మ‌న‌కు ముఖ్యం. కాబ‌ట్టి మీరు అన్య‌త‌గా భావించ‌కుండా, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మీ ఇళ్ల‌కు చేరండి. మంచిగ అయిన త‌ర్వాత నేను ప్ర‌జ‌ల మ‌ధ్యన ఉండేవాన్నే కాబ‌ట్టి, మ‌నం క‌లుసుకుందాం. దానికి ఇబ్బంది లేదు. ద‌య‌చేసి నా కోరిక‌ను మ‌న్నించి, నా మాట‌ను గౌర‌వించి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. నా విజ్ఞ‌ప్తిని మీరు త‌ప్ప‌కుండా మ‌న్నిస్తారని భావిస్తున్నాను అని కేసీఆర్ త‌న సందేశంలో పేర్కొన్నారు.