Congress |
విధాత : బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తాను త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఆదివారం చంద్రశేఖర్ నివాసానికి వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. వారి భేటీ అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతు తాను చంద్రశేఖర్ ను కాంగ్రెస్‌లోకి చేరాలని ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఈ నెల 18న చేవేళ్లలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరవుతారని, అదే సభలో చంద్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తుందన్నారు. రాష్ట్రంలోని 25లక్షల ఎకరాల అసైన్డ్ భూఃములు, 10లక్షల ఎకరాల పోడు భూములు కలిపి మొత్తం 35లక్షల ఎకరాల భూములను కేసీఆర్ ప్రభుత్వం తెగనమ్ముకుంటుందని రేవంత్ ఆరోపించారు.
ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా, కబ్జాకోరుగా మారి రియల్ సంస్థలకు భూములు అమ్ముకుంటుం దన్నారు. దళిత, గిరిజనుల భూములకు వారికి యాజమాన్య హక్కులను కల్పించాలన్న కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. ఇదే అంశాన్ని చంద్రశేఖర్ కూడా సూచించారని, పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో పొందుపరుస్తామన్నారు.
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో భేటీ అయిన మాజీ మంత్రి బీజేపీ నాయకులు చంద్ర శేఖర్.
ఈ నెల 18 న తెలంగాణకు విచ్చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో పార్టీ లో చేరనున్న మాజీ మంత్రి.
Vc : @abntelugutv pic.twitter.com/kuRdxrxPW8— srEE (TG) (@sreereddi77) August 13, 2023
కాంగ్రెస్‌లో చేరుతున్నా: చంద్రశేఖర్
తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ ప్రకటించారు. రేవంత్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని, లేదంటే పార్టీ కోసం పనిచేయమన్నచేస్తానన్నారు. తెలంగాణలో బీఆరెస్‌కు కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజకీయ ప్రత్యామ్నాయమన్నారు. తెలంగాణలో బీఆరెస్‌ను బీజేపీ కాపాడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
బీజేపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు. బీజేపీలో చేరిన పలువురు తెలంగాణ ఉద్యమ నేతలు నిరాశతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందన్నారు. కుటుంబాన్ని వదిలేసి బీజేపీని ఒక లెవల్‌కు తీసుకొచ్చిన బండి సంజయ్‌ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని నుండి తొలగించి ఆ పార్టీ పెద్ద తప్పు చేసిందన్నారు. దీంతో బీజేపీ, బీఆరెస్ ఒక్కటేనన్న చర్చ గ్రామస్థాయి వరకు సాగుతుందన్నారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో బండి సంతృప్తికరంగా ఉన్నారో లేదో ఆయనకే తెలియాలని, తెలంగాణలో బీజేపీకి ప్రణాళికలు లేవని, కష్టపడే నాయకులకు ఆ పార్టీలో గుర్తింపు లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు. బీజేపీకి తెలంగాణలో మూడో స్థానమేనని, ఇటీవల బీజేపీలో చేరిన వారంతా పార్టీ నుంచి బయటకు రాబోతున్నారన్నారు.