పాట్నా : అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు దివ్యముహుర్తంలో కొలువుదీరిన వేళ రామభక్తులు రామజపం జపించారు. దేశమంతా శ్రీరామ నామస్మరణతో మార్మోగిపోయింది. రాముడి పట్ల తమకున్న భక్తిని రామభక్తులు చాటుకున్నారు. చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఓ టీ సెల్లర్ కూడా రాముడి పట్ల తన భక్తిని చాటుకున్నాడు. 11 సార్లు శ్రీరామ్ అని రాసిన వారికి ఉచితంగా టీ అందజేశాడు.
బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో సంజయ్ కుమార్ బబ్లూ అనే వ్యక్తి శ్రీరామ్ టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. అయితే బాలరాముడు కొలువుదీరిన సందర్భంగా వినూత్న కార్యక్రమం చేపట్టి తన భక్తిని చాటుకున్నాడు. ఇక కాపీబుక్‌లో 11 సార్లు శ్రీరామ్ అని రాస్తే.. ఉచితంగా టీ ఇస్తానని ప్రచారం చేశాడు. దీంతో క్షణాల్లోనే అక్కడ రామభక్తులు వాలిపోయారు. 11 సార్లు శ్రీరామ్ అని రాసి ఉచితంగా టీ సేవించారు. వేల మంది టీ తాగినట్లు సంజయ్ కుమార్ పేర్కొన్నాడు.
తన టీ స్టాల్ కూడా శ్రీరాముడి పేరు మీదనే ఉందన్న సంజయ్.. రాముడిని స్మరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇక పాట్నాలోనూ పలు సెంటర్లలో ఉచితంగా టీ అందజేశారు. దనపూర్ మార్కెట్, రాజ్‌భన్సీ నగర్, గర్దనీబాగ్ ఠాకూర్‌బారితో పాటు పలు ప్రాంతాల్లో రామ్, హనుమాన్ టెంపుల్స్‌ను సందర్శించిన భక్తులకు ఉచితంగా టీ ఇచ్చారు.