Jharkhand | భూ వివాదాల కారణంగా ఓ యువకుడు తన స్నేహితులతో సాయంతో బావను చంపేశాడు. ఆ తర్వాత శరీరాన్ని రెండు భాగాలుగా గొడ్డలితో నరికేశాడు. అనంతరం తలతో నిందితుడితో పాటు అతని స్నేహితులు సెల్ఫీలు దిగారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది.
ఖుంతి జిల్లాలోని ముర్హు ఏరియాకు చెందిన దాసాయి ముండాకు 24 ఏండ్ల కుమారుడు కాను ముండా ఉన్నాడు. దాసాయికి తన మేనల్లుడు సాగర్ ముండా(20)తో భూ వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం రోజు అందరూ పొలం పనులకు వెళ్లగా, కాను ముండా ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న సాగర్.. కాను వద్దకు చేరుకుని బలవంతంగా కిడ్నాప్ చేశాడు.
సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన ముర్హుకు తన కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. కానును సాగర్, అతని ఫ్రెండ్స్ కిడ్నాప్ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో దాసాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాగర్ ముండాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి కానును అతి కిరాతకంగా చంపేశారు. ఘటనాస్థలిలో కేవలం మొండెం మాత్రమే లభ్యమైంది. కాను తలను నరికిన తర్వాత దాంతో సాగర్, అతని స్నేహితులు సెల్ఫీలు దిగిన ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు ఫోన్లు, గొడ్డలి, పదునైన ఆయుధాలతో పాటు బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాగర్, ఆయన భార్యతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.