విధాత: ‘విశాఖ ఆత్మగౌరవం కోసమే మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. ఇన్నాళ్లూ తన రాజీనామా లేఖను స్పీకర్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు. తీరా ఎన్నికలకు మూడు నెలల ముందు ఆమోదించారు. ఇందులో వైసీపీ రాజకీయ కుట్ర ఉంది’ అని టీడీపీ నేత, విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే పదవికి తన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం పట్ల గంటా ఘాటుగా స్పందించారు.
శాసనసభ విలువలు, సాంప్రదాయాలు పాటించకుండా స్పీకర్ దొంగచాటుగా రాజీనామా ఆమోదించారని విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కు రాజ్యసభ ఎన్నికల భయం పట్టుకుందని విమర్శించారు. రాజీనామాపై న్యాయపోరాటం జరుగుతుందన్న ఆయన.. రాజ్యసభలో తన ఓటు వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని అన్నారు. న్యాయ సలహా కూడా తీసుకుంటానని చెప్పారు. విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని గంటా స్పష్టం చేశారు.