విధాత: రాహుల్ గాంధీ మూలంగానే తాను కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందనీ, కాంగ్రెస్ లో ఉండాలంటే వెన్నెముక ఉండకూడదనీ మీరు చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి తక్కువ చేసిందని? ఐదు దశాబ్దాలకు పైగా ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవీ సోపానాలు అధిరోహిస్తూ పోయిన మీకే ఇంత బాధగా ఉంటే, మరి ఏ పదవీ భోగాలు లేకుండా త్యాగాలు చేసే వివిధ పార్టీలలోని కోట్లాది మంది కార్యకర్తలకు, అర్హతలు ఉండీ అవకాశాలకు నోచుకొని నాయకులకు ఎంత బాధ కలగాలి.
అయితే.. వారి గురించి సీనియర్ నాయకుడైన మీరు ఏనాడైనా ఆలోచించారా? రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌తో మమేకమైన పీవీ వంటి వారు చివరి దశలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినా వారు కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట లేదు. హుందాగా వ్యవహరించారు. మీలాగా తెప్ప తగలేసి పోవాలనుకోలేదు.
కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి తక్కువ చేసిందని ఇంత ఆక్రోశం? 24 ఏండ్ల చిన్న వయసులో కాంగ్రెస్‌లో చిన్న పాటి పదవితో మీ రాజకీయ జీవితం మొదలైంది. అనతి కాలంలోనే జమ్ము కశ్మీర్ లో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. దాదాపు మూడు పదుల వయసులో 1980లో అఖిల భారత యూత్ కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. ఆ వెంటనే పార్టీ మిమ్మల్ని మహారాష్ట్రలోని వాసిం నుంచి లోక్‌సభకు గెలిపించుకున్నది.
లోక్‌సభలో అడుగు పెట్టగానే, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది. 1984లోనూ మళ్ళా లోక్‌సభకు గెలిపించుకున్నది. 1990 నుంచి 96 వరకు మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారంటే అది పార్టీ అధిష్టానవర్గం చలవే కాదా? పీవీ మంత్రివర్గంలోనూ మీకు చోటు లభించింది. ఆ తరువాత రెండు పర్యాయాలు వరుసగా- 1996 నుంచి 2008 వరకు జమ్ము కశ్మీర్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారంటే పార్టీ అందించిన తోడ్పాటు వల్లనే కాని మీ ఘనత కాదు.
అక్కడి నుంచి పార్టీ అధిష్టానం మీకు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అక్కడ మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణలో మీ బాధ్యత కూడా కొంత ఉందని అంటారు. తప్పు ఎవరిదైనా ఆ ప్రభుత్వం కూలిపోయింది. జాతీయ ప్రయోజనాల కోసం ఆ ప్రభుత్వాన్ని కాపాడటానికి మీ చాతుర్యాన్ని ఉపయోగించలేక పోయారా?
మళ్ళా రాజ్యసభకు ఎన్నికై మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందారు. ఇదంతా అధిష్ఠానం పట్టించుకోకపోవడం వల్లనే జరిగింది. ఇదంతా మీ గొప్పతనమేనా?
2014లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది. అయినా రాజ్యసభలో మెజారిటీ ఉన్నది. మీకు రాజ్యసభలో సభా నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. మీ రాజసానికి ఏమీ ఢోకా లేదు కదా?
2021 నాటికి మీ రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కూడా తగ్గింది. ఇక ఈ ప్రయాణం డెడ్ ఎండ్‌కు వచ్చిందనిపించింది. రాజ్యసభ సభ్యత్వం ముగియవచ్చిన దశలోనే మీకు బీజేపీ ప్రభుత్వంతో లోపాయికారి అవగాహన ఉందనే అభిప్రాయం ఏర్పడింది. ప్రధాని మోదీ మిమ్మల్ని ప్రశంసించడం కేవలం రాజకీయ సభ్యతగా భావించలేము.
కాంగ్రెస్ నాయకత్వం కన్నా, మోదీయే నాపట్ల దయతో ఉన్నారంటూ మీరు చేసిన వ్యాఖ్య మీ వక్రబుద్ధినే సూచిస్తున్నది. ఐదేండ్ల రాజకీయ జీవితం తరువాత, అనేక పదవులు అనుభవించిన తరువాత మీరు మీ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని నిలబెట్టుకోలేక పోయారు. కాంగ్రెస్‌పార్టీలోనే ఉంటూ జీ23 గ్రూప్‌లో భాగంగా మీరు సాధించిందేమిటో తెలిసిందే. మరి ఇంతకాలం ఈ రాజకీయ భోగాలు ఎవరి దయ వల్ల కలిగినట్టు?
దేశవ్యాప్తంగా కవులు రచయితలు తమ అవార్డులను వెనకకు ఇస్తున్న తరుణంలో 2022లో మీకు పద్మ భూషణ్ సత్కారం లభించింది. రాష్ట్రపతి పదవిపై మీరు ఆశ పెట్టుకున్నారనే అభిప్రాయం ఏర్పడింది. అది పుకారో, ఊహాగానమో, వాస్తవమో తెలువదు. కానీ మీ నిజాయితీ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీ అంటూ సొంత దుకాణం ఒకటి తెరుచుకొని దానిని బీజేపీకి బీ టీమ్‌గా మార్చినప్పుడు.. మీ ముసుగు పూర్తిగా తొలిగిపోయింది.
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు పెను ప్రమాదంలో ఉందనేది మీవంటి నాయకుడికి తెలువనిది కాదు. కశ్మీర్ సమాజం కూడా ఎంతో సంక్షోభం అనుభవిస్తున్నది. ఇటువంటి విషమ పరిస్థితులలో సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన రాజకీయ నాయకుడిగా లేదా సిసలైన కాంగ్రెస్ వాదిగా, కనీసం సాధారణ పౌరుడిగా మీరు నిర్వహించే పాత్ర ఏమిటనేది మీకు తెలువదా?
రాహుల్ గాంధీ వ్యక్తిత్వం,వ్యవహార సరళి మీకు నచ్చలేదనే అనుకుందాం. అదే కారణమైతే మీరు కాంగ్రెస్‌లోనే లేదా బయట ఉండి దేశానికి సేవలు అందించవచ్చు. వాస్తవానికి మీకు కాంగ్రెస్ పార్టీ లేబుల్ కూడా ఈ దశలో అవసరం లేదు. పార్టీలకు అతీతంగా లౌకిక ప్రజాస్వామిక శక్తుల బలోపేతానికి, ఐక్యతకు మీ వంతు ప్రయత్నం చేయవచ్చు.
అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే అనివార్యంగా మీ సేవలు ఉపయోగించుకో వలసి వచ్చేది. ప్రతిపక్ష పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు మీరొక కేంద్ర బిందువుగా, పెద్ద మనిషిగా వ్యవహరించాల్సింది. కానీ జీవితకాలం మీకు రాజకీయ జీవితాన్ని, పదవులను కల్పించిన మహోన్నత రాజకీయ విలువలను అలవోకగా కాలరాచి బీజేపీతో లాలూచీ పడ్డారు.
నేడు ప్రజాస్వామిక విలువలను కోరుకుంటున్న ప్రాంతీయ పార్టీలన్నీ రాహుల్ గాంధీపై అభిమానం లేదా దురభిమానంతో నిమిత్తం లేకుండా ఏకతాటిపైకి రావాలని ప్రయత్నిస్తున్నాయి. రాహుల్ అనుకూల వ్యతిరేకతల కన్నా, దేశం ముఖ్యం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ముఖ్యం అని భావిస్తున్నారు. అది నేటి రాజకీయ అనివార్యత. వారు బీజేపీతో లాలూచీ పడదలుచుకుంటే చాలా సాకులు దొరుకుతాయి.
కాంగ్రెస్‌లో ఉండాలంటే వెన్నెముక ఉండకూడదంటూ మీరు ఈ దశలో చేసిన వ్యాఖ్య మీ దివాలాకోరుతనాన్ని, ప్రజా ద్రోహాన్ని కప్పి పుచ్చలేదు. తాను ఆజాద్ పొందినట్టు చెప్పుకుంటున్నాడు, కానీ వాస్తవానికి గులాంగా మారాడు అంటూ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్‌చార్జి పవన్ ఖేరా చేసిన వ్యాఖ్య మీకు కచ్చితంగా సరిపోతుంది. అన్ని పార్టీలూ వ్యక్తి కేంద్రంగా నడుస్తున్నాయంటూ, ఇందుకు బీజేపీ మినహాయింపు అని మీరు అంటున్నారు.
కానీ సైద్ధాంతిక పునాదితో ఇన్నాళ్ళు నడిచిన బీజేపీ ఇప్పుడు ఎంతగా వ్యక్తి కేంద్రంగా మారిపోయిందో మీ కండ్లకు కనిపించడం లేదా! బీజేపీలోని వారే మోదీ ఆధిపత్యాన్ని భరించలేక లబోదిబో అంటూంటే, మీకు మోదీలో ‘గ్రేట్ లిజనర్’ కనిపించారు. మోదీని అంతగా పొగడటానికి మీకు నోరెలా వచ్చింది!
రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అధిష్ఠానం గొప్పగా చెప్పుకోవలసిందేమీ లేదనీ, అదంతా స్థానిక నాయకుల ఘనత అని మీరు అంటున్నారు. ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లో, కర్ణాటక తదితర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యానికి స్థానిక నాయకులు చేస్తున్న పడుతున్న శ్రమ ప్రశంసనీయమైనది. కానీ మీరు మాత్రం ఆ కోవలోకి రారు. దేశం క్లిష్ట దశలో ఉన్నప్పుడు చేయవలసిందేమిటో కనీసం వారిని చూసైనా నేర్చుకోండి.
ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో మిమ్మల్ని దేశవ్యాప్తంగా రాజకీయ చైతన్యం గల ప్రజలు, మేధావులు, లౌకికవాదులు ఎంతో అభిమానించేవారు. మీరొక పరిణతి గల నిజాయితీగల నాయకులనీ, దేశానికి ఎంతో ఉపయోగకరమనీ భావించారు. కాంగ్రెస్‌తో నిమిత్తం లేకుండా మిమ్మల్ని అభిమానించారు. కానీ మీ కపటత్వం ఎంతో కాలం దాగదు. మీ నైజం బయటపడింది. మీ చరిత్రను మీరే మలిన పరుచుకున్నారు.
– పరాంకుశం వేణుగోపాల స్వామి
(సీనియర్ జర్నలిస్టు)