వారిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తా: గోనే ప్రకాశ్‌రావు

శామీర్‌పేట మండలం బొమ్మరాశి పేటలో కొందరు భూరికార్డులను తారుమారు చేసి 920ఎకరాల భూములను భూములను కాజేశారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు

  • Publish Date - March 17, 2024 / 12:36 PM IST

విధాత : శామీర్‌పేట మండలం బొమ్మరాశి పేటలో కొందరు భూరికార్డులను తారుమారు చేసి 920ఎకరాల భూములను భూములను కాజేశారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బొమ్మరాశి పేటలో సర్వే నంబర్ 323నుంచి 408 వరకు ఉన్న 1049 ఎకరాల భూములకు మీర్ రెహ్మత్ ఆలీతో పాటు మరో 6 మంది హక్కుదారులు అని వెల్లడించారు. ఈ భూమిని హక్కుదారుల నుంచి 1965లో మాజీ ఎంపీ బలరామకృష్ణ కొన్నారని తెలిపారు. బలరామకృష్ణ తన వారసుడు అమరేంద్ర బాబుతో పాటు మరో 20మంది పైన భూమిని రిజిస్టర్ చేశారని చెప్పారు. వీరంతా వివిధ కారణాల రీత్యా విదేశాల్లో స్థిరపడ్డారని, దీంతో కొందరు ఈ భూములపై కన్నేశారని మండిపడ్డారు. నిజమైన హక్కుదారుల రికార్డులను మాయం చేసి.. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని ధ్వజమెత్తారు. ఈ భూమిని ఆక్రమించిన వారిలో కొంతమంది అధికారులు ఉన్నారని.. వీరందరూ తెలంగాణ హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని చెప్పారు. కోర్టులో కూడా కేసు నడుస్తుందని… కోర్టుకు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారని చెప్పారు. అసలైన హక్కుదారులను తీసుకొచ్చి నిజమైన డాక్యుమెంట్స్ సీఎం రేవంత్‌రెడ్డికి, కోర్టుకు అందచేస్తామని తెలిపారు. బొమ్మరాశి పేటలో బీఆరెస్‌ నేతలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది భూములు ఉన్నాయన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములు, ఫాం హౌజ్‌లు ఉన్నాయన్నారు. భూముల ఆక్రమణకు గురైన ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సీఎం రేవంత్‌రెడ్డి న్యాయం చేయాలని గోనే డిమాండ్ చేశారు.