Governor Tamilisai | 500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తాం

తెలంగాణ ప్ర‌జ‌లు ఆశించిన ప్ర‌జాపాల‌న వ‌చ్చింద‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్ చెప్పారు. ఇది సామాన్య ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్న‌ద‌ని పేర్కొన్నారు

  • Publish Date - February 8, 2024 / 08:09 AM IST
  • ఇది సామాన్య‌ ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తుంది
  • ఆరు గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తాం
  • ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై
  • మొద‌లైన శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు


Governor Tamilisai | విధాత‌: తెలంగాణ ప్ర‌జ‌లు ఆశించిన ప్ర‌జాపాల‌న వ‌చ్చింద‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్ చెప్పారు. ఇది సామాన్య ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్ట‌గానే కంచెలు తొల‌గించామ‌ని, సామాన్య ప్ర‌జ‌ల కోసం ప్ర‌జాభ‌వ‌న్‌ను తెరిచామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్ప‌టికే రెండు అమ‌లు చేశామ‌ని, మ‌రో రెండు త్వ‌రలోనే అమ‌లులోకి తీసుకొస్తామ‌ని చెప్పారు. అర్హుల‌కు రూ.500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్లు స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని పేర్కొన్నారు.


గురువారం 2024-25 శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగిచారు. మహాకవి కాళోజీ మాటలతో త‌న ప్రసంగాన్ని ప్రారంభించారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరగని పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరికీ తమ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.


‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్న‌ది. అందులో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశాం. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే 15 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తుంది. ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. వివిధ వర్గాల ప్రజల నుంచి 1.28 కోట్లకుపైగా దరఖాస్తులు అందాయి. నిర్ధిష్ట సమయంలోగా ఆరు హామీలను అమలు చేస్తాం.



మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్‌ను అందిస్తాం. కొత్తగా ఏర్పాటు చేసిన టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పాలమూరు-రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టల నుంచి విద్యారంగం వరకు తెలంగాణలోని వివిధ రంగాలు తమ భవిష్యత్‌ ప్రణాళికలో ఉన్నాయి. హైదరాబాద్‌ గత వైభవాన్ని పునరుద్ధరించాలని, అదే సమయంలో రాష్ట్ర మంతటా అభివృద్ధిని వికేంద్రీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.


ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతను పునరుద్ధరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్న‌ది. ప్రజలపై భారం మోపకుండా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే ప్రభుత్వానికి తక్షణ సవాలు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, నిర్వహణలో బాధ్యత, జవాబుదారీతనాన్ని అవలంభించడానికి ఈ బడ్జెట్‌ ఒక సదావకాశం. రాష్ట్రంలో అత్యధిక జనాభాకు జీవనోపాధిని సమకూరుస్తున్న వ్యవసాయం వెన్నెముకగా ఉన్న‌ది. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పోషించే కీలక పాత్రను గుర్తిస్తూ, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతు భరోసా, పంట రుణమాఫీ, పంట మార్పిడీ కార్యక్రమాలు, ఉద్యానవన అభివృద్ధి, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో రైతాంగ సాధికారతను లక్ష్యంగా పెట్టుకున్నాం.


నూతన ఎంఎస్‌ఎంఈ విధానాన్ని తీసుకురావడంతోపాటు ఎంఎస్‌ఎంఈలకు సహాయపడటానికి, వారి ఇబ్బందులను నివారించడానికి ఒక ప్రత్యేక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాం. ఐటీ, ఫార్మా వంటి రంగాలకు ప్రభుత్వ సహకారం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటనలో భాగంగా రూ.40 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో డిజిటల్‌ మౌలిక సదుపాయాలను సృష్టించడమే కాకుండా, సమాజంలోని అన్ని వర్గాలకు కనీస ధరలకే అందుబాటులోకి తేవడంపై దృష్టి సారిస్తాం. ప్రతి కుటుంబం వేగవంతమైన డిజిటల్‌ అనుసరణ అవకాశాల ద్వారా వచ్చే ప్రయోజనం పొందేందుకు ఒక సార్వజనీన సమగ్ర డిజిటల్‌ అక్షరాస్యత కార్యక్రమాన్ని అమలు చేస్తాం. హైదరాబాద్‌ను కృత్రిమ మేధస్సుకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తాం.


రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తుంది. వేగంగా మారుతున్న జాబ్ మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యువతను సన్నద్ధం చేస్తూ ఇవి ప్రతిభా కేంద్రాలుగా పనిచేస్తాయి. విద్యుత్ ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడానికి, పర్యావరణ పరిరక్షణల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛ ఇంధనపు వాటాను పెంచాల్సి ఉంటుంది. అధిక డిమాండ్ అవసరాలను తీర్చడానికి హరిత ఇంధనం అంటే సౌర, పవన, హైబ్రిడ్‌తోపాటు నిల్వ ఇంధనం వంటి అన్ని రకాల హరిత ఇంధనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక సమగ్ర ‘ఇంధన పాలసీ’తో ముందుకు రానుంది. హరిత ఇంధనం వాటాను గణనీయంగా మెరుగుపరిచి, 2030 సంవత్సరం నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.’ అని గవర్నర్‌ తమిళిసై తెలిపారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం ఉభయ సభలు రేపటి వాయిదా పడ్డాయి.