అర్హుల ఎంపికే అసలు సవాల్
రేవంత్ రెడ్డి స్పీడ్‌కు తగినట్లుగా నెల రోజుల పాలనకు పాస్ మార్కులు అయితే వచ్చాయి. కానీ అసలు సవాలే ముందుంది

- పథకాలకు 1.25 కోట్ల దరఖాస్తులు
- గ్యారెంటీల కోసం 1,05,91,636
- ఇష్టారీతిన ఎంపిక చేస్తే నష్టాలే
- పథకాలకు నిధులు ఎక్కడ?
- అప్పులపైనే ఆధారపడే స్థితి
- రుణమాఫీపై సర్కార్ కసరత్తు
- ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
- ఇక బ్యాంకర్లతోనే చిక్కు
- కౌలు రైతుల గుర్తింపు పెద్ద టాస్క్
- నియామకాలపై ప్రగతి చూపాలి
- సమీపిస్తున్న లోక్‌సభ ఎన్నికలు
- ఈలోపే పథకాలు అమలవ్వాలి
- లేదా ప్రజా వ్యతిరేకతకు చాన్స్
విధాత: రేవంత్ రెడ్డి స్పీడ్‌కు తగినట్లుగా నెల రోజుల పాలనకు పాస్ మార్కులు అయితే వచ్చాయి. కానీ అసలు సవాలే ముందుంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈలోగా ప్రకటించిన పథకాలు గ్రౌండింగ్ కావాలి. లేకుంటే ప్రజా వ్యతిరేక మూట గట్టుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా10 ఏళ్ల తరువాత తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ఠను నిలబెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితిలో ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు పథకాల అమలు కూడా అంత సులువైనదేవి కాదు. పాలన నల్లేరు మీద నడకలా లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రజలకు పథకాలకు అందించడం కోసం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తే వచ్చిన సంఖ్యను పరిశీలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. వివిధ పథకాలకు 1.25 కోట్ల దరఖాస్తులు రావడంతో అర్హులైన లబ్దిదారులను గుర్తించడమే ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్‌గా మారింది. అలాగే పథకాల గ్రౌండింగ్, నిధుల సమీకరణ, రైతుల రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, సాగునీటి ప్రాజెక్ట్‌ల పూర్తి చేయడంతో పాటు వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయడంతో పాటు ప్రజల్లో సర్కారుపై వ్యతిరేకత రాకుండా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఆధిక్యతను నిలబెట్టు కోవడం రేవంత్ సర్కారుకు పెద్ద పరీక్ష కానున్నదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు పరీక్షఅర్హుల ఎంపికే..
గ్యారెంటీల అమలు కోసం అర్హులైన లబ్దిదారుల ఎంపికనే కాంగ్రెస్ సర్కారుకు అసలు పరీక్ష. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజా పాలన దరఖాస్తులు 1,25,84,383 దరఖాస్తులు రాగా ఇందులో ఐదు గ్యారెంటీల కోసం వచ్చిన దరఖాస్తులే 1,05,91,636 ఉన్నాయి. వచ్చిన దరఖాస్తులను అదనపు సిబ్బందిని పెట్టి కంప్యూటరీకరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని దరఖాస్తులు రోడ్లపై పడడం కూడా విమర్శలకు తావిచ్చింది. వెంటనే అధికారులు దీనిని సరిదిద్దే ప్రయత్నం చేసినా సోషల్ మీడియా కారణంగా జరగాల్సిన నష్టం జరిగింది. వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసే ప్రక్రియను అధికారులు నేరుగా చేపట్టకుండా గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నది. లబ్దిదారుల ఎంపికపైన, వచ్చిన దరఖాస్తులపైన గ్రామాలలో ప్రజల మధ్యనే చర్చ నిర్వహించి, ప్రజామోదంతో అర్హుల జాబితా ఎంపిక చేస్తే ఫలితాలు మంచిగా వస్తాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అలా కాకుండా పార్టీ నాయకులు తమ ఇష్టమున్న వారిని ఎంపిక చేస్తే మాత్రం తీవ్ర నష్టం జరుగే ప్రమాదం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
నిధుల సమీకరణ ఎలా?
పథకాల అములకు నిధుల సమీకరణ కూడా సవాల్ గా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవు. అప్పులపై ఆధార పడాల్సిందే. ఈ పథకాల అమలుకు ఏటా రూ.50 వేల కోట్ల వరకు నిధులు అవసరం ఉంటుంది. నెలకు నాలుగు వేల కోట్లకుపైగా నిధులు ఈపథకాల అమలుకు అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో విధిగా అప్పులపై ఆధార పడాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వైపు గత ప్రభుత్వం చేసిన ఆరున్నర లక్షల కోట్ల చెల్లింపుల భారం మోస్తూనే వీటిని అమలు చేయాల్సి ఉంటుంది. అదనపు నిధులు ఇతర మార్గాలలో వచ్చే అవకాశాలు కూడా కనిపించకపోవడంతో రేవంత్‌రెడ్డి సర్కారు అదనపు అప్పులు ఇవ్వమని కేంద్రాన్ని కోరింది.
రూ. 13 వేల కోట్లు కోరితే రూ. 9 వేల కోట్లకు అనుమతిచ్చినట్లు సమాచారం. ఇందులో ఈ నెల16వ తేదీన జరిగే బాండ్ల విక్రయంలో రెండు వేల కోట్ల రుణం కోసం తెలంగాణ ప్రభుత్వం యాక్షన్‌లో పాల్గొన్నది. ఈ మేరకు బిడ్ కోడ్ చేసింది. సంక్రాంతి మరుసటి రోజున వచ్చే రెండు వేల కోట్లతో రేవంత్ సర్కారు కొద్దిగా ఊపిరి పీల్చుకోనున్నది. ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు రూ. 2 లక్షల రుణమాపీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రైతుల రుణాలను పార్లమెంటు ఎన్నికల్లోపే మాఫీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందు కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్న సర్కారు ఇప్పటికే బ్యాంకర్లతో చర్చలు మొదలు పెట్టింది. అయితే బ్యాంకర్లు అంగీకరిస్తేనే రుణమాఫీ అమలయ్యే అవకాశం ఉంది. అయితే బ్యాంకర్లు రుణమాఫీకి ముందుకు వస్తారా? లేదా? అన్నదే సమస్య.
కౌలు రైతుల గుర్తింపు పెద్ద టాస్క్
రైతు బంధుకు నిధుల సర్దుబాటు మరో కీలక అంశంగా ఉన్నది. ఉద్యోగులకు జీతాలు విడుదల చేసిన తరువాత రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అరకొరగానేఉంది. ఇప్పటి వరకు రెండు ఎకరాలలోపు రైతులకు మాత్రమే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళుతున్నాయి. గత ప్రభుత్వం కంటే ముందుగానే వేస్తామని ప్రభుత్వ పెద్దలు చెపుతున్నా.. ఫిబ్రవరి నెలాఖరు వరకు వేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే వర్షాకాలం సాగు సమయానికి కౌలు రైతులను గుర్తించాల్సి ఉంది. కౌలు రైతుల గుర్తింపు ఎలా అన్నదానిపై స్పష్టత లేదు. కౌలు రైతును గుర్తించాలంటే ఎల్ఈసీ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే ధరణి సమస్యలు పరిష్కారం కావాలంటే ధరణి చట్టంలో కూడా మార్పులు తెచ్చి, తిరిగి తాసీల్దార్లకు గతంలో మాదిరిగా అధికారాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పూర్తి చేయాలంటే చట్ట సవరణ అవసరం. అయితే ధరణిపై ప్రభుత్వం వేసిన కమిటీ ఎంత త్వరగా నివేదికలు ఇస్తే అంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
యూపీఎస్సీ తరహాలో…
యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని పునర్ వ్యవస్థీకృతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇలా చేయడం ద్వారా ఏ ప్రభుత్వం వచ్చినా జాబ్ క్యాలండర్ ప్రకారం నియామకాలు జరిగేలా చూడాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీఆరెస్ ప్రభుత్వంలో ఏర్పడిన పాలక వర్గం రాజీనామాలు కూడా గవర్నర్ ఆమోదించడంతో కొత్త కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టీఎస్సీఎస్సీ పాలక వర్గం ఏర్పడిన తరువాత వెంటనే 22 వేల ఉద్యోగ నియామకాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి తన నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెలాఖరులోగా 22 వేల ఉద్యోగాలు, ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.
మెగా డీఎస్సీతో…
మెగా డీఎస్సీ కి సిద్ధం కావాలని ఇటీవల విద్యాశాఖ అధికారులను పురమాయించిన సీఎం రేవంత్‌రెడ్డి డిఎస్సీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 12వేల ఉపాధ్యాయ పోస్టులతో పాటు పదోన్నతుల ద్వారా మరో 10వేల పోస్టులు అందుబాటులోకి వచ్చి 22వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు కేవలం 5,089పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ప్రభుత్వ పాఠశాలల పీఆర్‌సీ రిపోర్టు మేరకు రిటైర్మెంట్‌తో ఏర్పడ్డ 24వేల ఖాళీలు, ఎయిడెడ్ పాఠశాలల్లోని 4,900ఖాళీలు, 10వేల పీఈటీ పోస్టులు, 20ఏళ్లుగా ఖాళీగా ఉన్న 5వేల ఆర్ట్, క్రాఫ్టు, డాయింగ్ పోస్టులు, 4వేల కంప్యూటర్ టీచర్ల పోస్టుల భర్తీ చేయాల్సివుంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో 2,400పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 4వేలకుపైగా ఖాళీలు, యూనివర్సిటీల్లో 3వేల అసిసెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయాల్సివుంది. ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లపైన కూడా చర్చకు ఆస్కారముంది. అటు 15,640 కానిస్టేబుల్స్ నియామక ప్రకియ న్యాయవివాదంపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసి నాలుగు వారాల్లో నియాకమ ప్రాసెస్ పూర్తి చేయాలని ఆదేశించడంతో దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
ఎమ్మెల్సీలు..నామినేటెడ్ పోస్టుల భర్తీపై నిర్ణయం
గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీల భర్తీ, ఎమ్మెల్యేల కోటాలోని రెండు ఎమ్మెల్సీల ఎన్నికలకు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుతో పాటు కార్పోరేషన్ వంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ కత్తి మీద సాములాంటిదే. అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాహుల్ గాంధీ భారత న్యాయ సంకల్ప యాత్రలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి శనివారం అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తున్నారు. ఈ మేరకు రెండు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపు లో ఆశావహులను, అసంతృప్తులను బుజ్జగించే క్రమంలో నామినేటెడ్ పదవులిస్తామని హామీలిచ్చారు. ఇవి కాకుండా మిగతా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పదవుల కోసం ఆశావావుల సంఖ్య భారీగానే ఉంది.
పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే..
ప్రజలు మార్పు కోసం తమను గెలిపించారని చెపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికల నాటికి స్పష్టమైన మార్పును చూపించాల్సి ఉంటుంది. అలా మార్పు చూపించి అడిగితేనే ఓట్లు రాలుతాయి. కాంగ్రెస్‌పార్టీకి జాతీయ స్థాయిలో ఈ పార్లమెంటు ఎన్నికలు కీలకం కానున్నాయి. స్పష్టమైన ఆధిక్యతతో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడి నుంచే మెజార్టీ స్థానాలు గెలిపించాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌పై ఉన్నది. ఈ కొద్ది రోజుల్లో ఎలాంటి వ్యతిరేకత ప్రజల నుంచి రాకుండా చూసుకుంటూ విపకక్షాల ఎత్తులకు పై ఎత్తు వేస్తే తప్ప విజయం అంత సలువుగా దక్కే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ కొద్ది సమయంలోనే పథకాల అమలు చేయడంతో పాటు రాజకీయ చతురత ప్రదర్శించి పార్లమెంటు ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది.