Group-2 పరీక్ష వాయిదా కోరుతున్నది.. అభ్యర్థులా? కోచింగ్‌ సెంటర్లా?

Group-2 exam । గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని గత కొన్నిరోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీ వివిధ పార్టీల ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందిం చిన CM KCR అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ.. ‘రిక్రూట్‌మెంట్‌ దశల వారీగా చేయాలని ముందే చెప్పామని, ఒక అభ్యర్థి ఎక్కువ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు చేశామన్నారు. ‘దీనిపై సీఎస్‌తో మాట్లాడాను. ఇప్పటికే ప్రకటించిన […]

  • By: Somu    latest    Aug 10, 2023 12:45 AM IST
Group-2 పరీక్ష వాయిదా కోరుతున్నది.. అభ్యర్థులా? కోచింగ్‌ సెంటర్లా?

Group-2 exam ।

గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని గత కొన్నిరోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీ వివిధ పార్టీల ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందిం చిన CM KCR అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ.. ‘రిక్రూట్‌మెంట్‌ దశల వారీగా చేయాలని ముందే చెప్పామని, ఒక అభ్యర్థి ఎక్కువ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు చేశామన్నారు.

‘దీనిపై సీఎస్‌తో మాట్లాడాను. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను రద్దు చేయడం సరికాదు. గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే ప్రకటించాం. ఈ నేపథ్యంలో వాటిని మార్చడం వీలుకాదు’ అన్నారు. అలా చేయడం వల్ల ప్రిపేర్‌ అయిన నిరుద్యోగ అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయన్నారు. కాబట్టి గ్రూప్‌-2 పరీక్ష యథావిధిగా నిర్వహిస్తామని కేసీఆర్‌ కరాఖండిగా చెప్పారు.

గ్రూప్‌-2 పరీక్ష ఆగస్టు 29,30 వ తేదీలలో నిర్వహించనున్నట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Public Service Commission) చాలా రోజుల కిందటే ప్రకటించింది. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత గ్రూప్‌-1, డీఈవో, ఏఈఈ లాంటి పరీక్షలను సర్వీస్‌ కమిషన్‌ రద్దు చేసింది. అప్పుడే మిగిలిన పరీక్షలను కూడా వాయిదా వేస్తారా? అనే ప్రశ్న తలెత్తింది. అయితే అప్పటికే ప్రకటించి న కొన్ని పరీక్షలను వాయిదా వేసినా.. గ్రూప్‌-2 పరీక్ష యథావిథిగానే జరుగుతుందని ప్రకటించింది.

గురుకుల రిక్రూట్‌మెంట్‌ పరీక్షల తేదీలు ప్రకటించక ముందు దీనిపై పెద్దగా వివాదం రాలేదు. గురుకుల బోర్డు వారు టీజీటీ, పీజీటీ, జేఎల్‌, డీఎల్‌, లైబ్రేరియన్‌ తదితర పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.

అయితే ఈ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులు ఒక్క విభాగంలో మూడు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఆ మూడు పరీక్షల సెంటర్లు మూడు చోట్ల వేయడం వల్ల గురుకుల పరీక్షలు రాసే అభ్యర్థులు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా తిరగాల్సి వస్తున్నది. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు కొంత ఇబ్బందే.

అయితే ఈ పరీక్షలు గత పది రోజులుగా ఆన్‌లైన్‌లో సజావుగానే సాగుతున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 23 వరకు ఉన్నందున ఒకే నెలలో గ్రూప్‌-2, గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్‌లు వేర్వేరుగా ఉండటం తో.. ఏదో పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సి పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే గ్రూప్‌-2 వాయిదా వేయాలని ఇవాళ 2000 వేలకు పైగా నిరుద్యోగ అభ్యర్థులు Service Commission కార్యాలయాన్ని ముట్టించారు.

పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదలైన నాటి నుంచి ఆ ప్రక్రియ ముగిసే వరకు కోచింగ్‌ సెంటర్ల (coaching centers) హడావుడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. గతంలో గ్రూప్స్‌ పరీక్షలకు కోచింగ్‌ అంటే ఆర్టీసీ క్రాస్‌ రోడ్డే అడ్డాగా ఉండేది.

కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్ఙితి మారింది. మారుమూల ఆదిలాబాద్‌, పాలమూరు ప్రాంతాల అభ్యర్థులు కూడా కోచింగ్‌ లేకుండానే ఉద్యోగాలు పొందుతున్నారు. పరీక్ష వాయిదా అన్నది నిరుద్యోగ అభ్యర్థుల కంటే కోచింగ్‌ సెంటర్లు నడిపే కొందరు వారిని ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలున్నాయి.

ఈ మధ్య కాలంలో గ్రూప్స్‌ పరీక్షల తర్వాత కోచింగ్‌ సెంటర్ల వాళ్లు ఆన్‌లైన్‌లో యూట్యూబ్‌ తదితర సోషల్‌మీడియా ద్వారా రివ్యూలు చేయడం, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కటాఫ్‌ ఇంత ఉంటుందని, ప్రశ్నపత్రం టఫ్‌గా ఉన్నదని ఇలా అనేకరకాల విశ్లేషణలు చేయడం మనం చూస్తున్నదే. పరీక్షలపై విశ్లేషణల పేరుతో కొందరు రాజకీయ విమర్శలు చేస్తున్నారు.

అంతేకాదు అన్నిరకాల పోటీపరీక్షల కోసం ఆన్‌లైన్‌\ ఆఫ్‌లైన్‌ కోచింగ్‌లు నడుపుతున్నాయి. యాప్‌లు కూడా పెట్టి కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి. అందుకే ఇవాళ పరీక్ష వాయిదా వేయాలని సర్వీస్‌ కమిషన్‌ను ముట్టించడానికి వెళ్లిన నిరుద్యోగులను రెచ్చగొట్టింది కొందరు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఉన్నారని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

నిరుద్యోగ అభ్యర్థులు తమ ఆవేదనను అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో గ్రూప్‌-2 పరీక్షను మూడు నెలల వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన పరీక్ష తేదీలను మార్చలేమని, ఇంకా ప్రకటించని వాటి గురించి ఆలోచిస్తామని చెప్పిన తర్వాత అభ్యర్థుల ఆందోళన వెనుక కోచింగ్‌ సెంటర్ల యాజమాన్యాలే ఉన్నాయనే చర్చ ప్రస్తుతం జరుగుతున్నది.